వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్, జగన్‌పై ఇలా..!

వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్, జగన్‌పై ఇలా..!

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆమె.. మెరుగైన సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేద్దాం అన్నారు. తనను పొలిటికల్ లీడర్‌గా చూడొద్దన్న షర్మిల.. ఓ అక్కగా, సామాన్యురాలిగా మాత్రమే చూడాలన్నారు. దివంగత నేత వైఎస్ఆర్‌ను గుర్తుచేసిన షర్మిల... ఆయన ప్రజలకు అందించిన పథకాలను ప్రస్తావించారు. ఇప్పటికే వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమవుతున్న ఆమె.. ఇప్పుడు యువతపై ఫోకస్ పెట్టారు.. ఇక, మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన షర్మిల.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. నా స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్, విజయశాంతి ఇక్కడి వాళ్లేనా? అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.. జయలలిత కూడా తమిళనాడు వాసి కాదని గుర్తుచేసిన షర్మిల.. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే.. పార్టీ వేరు.. ప్రాంతం వేరైనా.. అన్నాచెల్లెళ్లుగా మేం ఒక్కటే అని పేర్కొన్నారు. దేవుడి దయతో తెలంగాణ వచ్చింది.. తెలంగాణ వచ్చాక ప్రజల సమస్యలు తీరాయా? అమరవీరుల ఆశయాలు నెరవేరాయా? అని సూటిగా ప్రశ్నించారు.. ఉద్యమంలో నేను లేనంత మాత్రాన.. తెలంగాణపై ప్రేమ ఉండదా? అని వ్యాఖ్యానించిన ఆమె.. అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వాళ్ల గడపకు వెళ్లి వస్తానని ప్రకటించారు. ఇక, నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో వైఎస్ జగన్‌నే అడగండి అని వ్యాఖ్యానించారు షర్మిల.. నేను పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టంలేదని పేర్కొన్న ఆమె... నాకు అమ్మ విజయమ్మ మద్దతు ఉందని ప్రకటించారు. వైఎస్ జగన్‌కు నాకు మధ్య విబేధాలో, భిన్నాభిప్రాయాలో తెలియదు అన్నారు. అయితే, త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందన్నారు షర్మిల.. మే 14 లేక జులై 9 అన్నది మీరు చెప్పాలన్నారు. మరోవైపు.. రైతు సమస్యలను కూడా ప్రస్తావించిన ఆమె.. రైతుల సమస్యలపై ఢిల్లీకి వెళ్తానన్నారు.. అయితే, కేసీఆర్‌, వైఎస్ జగన్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.