తెలకపల్లి రవి : సీబీఐతోనైనా రథ రాజకీయం ఆగేనా?

 తెలకపల్లి రవి : సీబీఐతోనైనా రథ రాజకీయం ఆగేనా?

తెలకపల్లి రవి

            అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై సిబిఐ విచారణ అభ్యర్థించాని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించడం ఆహ్వానించదగింది. రథం మంటల్లోంచి రగులుతున్న రాజకీయాలకు ఇదైనా ముగింపు పలుకుతుందేమో చూడాలి. చలో అంతర్వేది పేరిట బిజెపి జనసేన కూటమి పిలుపునిచ్చాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో సహా వారిని మించి ఆరోపణలు ఎత్తుకున్నారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి వంటి వారు ఏ మాత్రం తీసిపోకుండా మీదే బాధ్యత అంటూ ట్వీట్లు సంధించారు.  మిగతా వారంతా మాటకే పరిమితమైతే జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తన  షరా మామూలుగా పుస్తకాలు పఠిస్తూ దీక్షకు దిగారు. ఇలా మొత్తం పైన ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయం యావత్తు అమరావతి నుంచి అంతర్వేదికి తరలిపోయినట్టు తయారైంది. రథం కాలిపోవడానికి కారకులెవరనే దర్యాప్తు జరిపి దోషులను పట్టుకోవడం కన్నా ముందు వెనకా జరిగిన ఘటనల జాబితా ఏకరువు పెట్టడం ప్రహసనంగా తయారైంది. ఒక మతిస్తిమితం లేని వ్యక్తి దొరికాడని చెప్పగానే పిచ్చివాళ్లపై  నెడుతున్నారని దాడి మొదలవడం రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును ఆమోదించబోరనే సంకేతం స్పష్టమైపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో బిజెపిది ప్రధాన పాత్ర గనక వారి ఆధ్వర్యంలోని కేంద్ర సిబిఐకే దర్యాప్తు అప్పగించడంతో వివేకవంతమే గాక వాస్తవికంగా కూడా వుందని చెప్పాలి.

            ప్రజా భక్తి విశ్వాసాలతో ముడిపడిన ఆలయ రథాలకు సంబంధించిన ఈ ఘటనను దురదృష్టకరమనడంలో సందేహం లేదు. వాటిపై ఉద్రిక్తతలు పెంచడం ఆందోళనకరం  కూడా. అయితే తిరుపతి సింహాచం సహా అన్నిటినీ అసందర్భంగా అంతర్వేదితో కలిపి మాట్లాడితే ప్రయోజనం ఏమిటి? గతంలో బిజెపి కూడా నాలుగేళ్లు అధికారం పంచుకున్నప్పుడే పుష్కర ప్రమాదాలు ఇతర ఆరోపణలు  వచ్చాయి. వాటికి టిడిపిని అంటూనే ఇప్పుడు జరిగేవి మాత్రం క్రైస్తవ హిందూ ఘర్షణగా చెప్పడం ఎలా పొసుగుతుంది? ఏపీలో 90శాతం పైన హిందువు 7 శాతం పైన ముస్లిములు వుండగా క్రైస్తవులు  రెండు శాతం కూడా లేరు. జగన్‌ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వారు రాష్ట్రంలో చెలరేగిపోయి హిందూ దేవాయాలపై దాడులు చేయడం సాధ్యమయ్యేదేనా? ఏ మత స్థంస్థ పై దాడి జరిగినా తప్పే. వాటిపై లోతుగా దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాల్సిందే. మామూలు ప్రజలు  తమ దేవతలను పూజించుకుంటారే గాని ఇతరులతో తగాదాలు కోరుకోరు. మత రాజకీయాలు రెచ్చగొట్టే వారే అందుకు పాల్పడుతుంటారు. మామూలు పిచ్చివాళ్ల కంటే మత పిచ్చి మరింత ప్రమాదకరమైంది. భిన్నమతాలతో విశ్వాసాలతో కూడిన దేశం ఇది. ఇప్పటికే మత రాజకీయాలతో చాలా మూల్యం చెల్లించాము. ఏపి తెలంగాణలో లౌకిక తత్వం మతసామరస్యం తప్ప మతోన్మాదం ఎప్పుడూ లేదు. ఎక్కడైనా ఏవైనా ఘటనలు  జరిగితే అరికట్టే చర్యలు తీసుకోవాలి గాని వాటిని పెద్దవి చేసి వాతావరణం కలుషితం చేసుకోవడం సరికాదు. కాని ఈ మధ్య బిజెపి నేతలు  తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా ఏపి క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయిందని మాట్లాడటం వాస్తవికతను ప్రతిబింబించదు. దురదృష్టవశాత్తూ బిజెపి వ్యూహాలను విమర్శించేందుకు ఏపిలో వైసీపీ గాని టిడిపి గాని సిద్ధం కావడం లేదు.  టిడిపి నేతలు బిజెపిని మించి పోయి మాట్లాడుతుంటే వైసీపీ విమర్శలు  టిడిపికే పరిమితమవుతున్నది. జనసేన బిజెపినే అనుసరిస్తున్నది.  విహెచ్‌పి భజరంగదళ్‌ వంటి సంస్థలకు చెందిన వారు అంతర్వేదిలో మంత్రుల పై రాళ్లు విసరడం ఉద్రిక్తత పెంచింది.  ప్రభుత్వం కూడా బిజెపి అద్యక్షుడు సోము వీర్రాజును మాత్రం అనుమతించి మిగిలిన వారిని అడ్డుకోవలసి వచ్చింది.

              రథం దగ్ధం రాజకీయ జ్వాల గా మారిన పరిస్తితులలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి కేసు అప్పగించడం ద్వారా తమపై భారం లేకుండా చేసుకోవాలని భావించి వుండొచ్చు. అయితే వారు ఆమోదించి ఎప్పుడు రంగంలోకి దిగడం, దర్యాప్తు జరిపి  నిజాలు తేల్చడం  చాలా కాలం పట్టే వ్యవహారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం,వీటిని ఆధారం చేసుకుని విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసే వారిని అడ్డుకోవడం రాజకీయ పార్టీ బాధ్యత.ప్రధానపార్టీలుగా వున్న వైసీపీ టీడీపీ తమ రాజకీయ వివాదాలలో మునిగితేలుతూ కొత్త వ్యూహాలతో వస్తున్న బిజెపికి ఉపయోగపడుతున్న పరిస్తితిలో ఇది  పెద్ద సవాలే. తెంగాణ బిజెపి అద్యక్షుడు బండి సంజయ్‌, ఏపి అద్యక్షుడు సోము వీర్రాజు కూడా  సంఘ్ నేపథ్యం నుంచి వచ్చిన వారు గనక రాబోయే రోజులలో వారి దూకుడు జోరుగానే వుంటుంది.