అయోధ్య అభివృద్ధి, ఎయిర్‌పోర్టుకు నిధులు

 అయోధ్య అభివృద్ధి, ఎయిర్‌పోర్టుకు నిధులు

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాల సేకరణ జరుగుతోంది.. మరోవైపు.. అయోధ్యలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి నిధులు కేటాయించింది ఉత్తర‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ సర్కార్.. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు.. అయోధ్యలో నిర్మిస్తున్న ఎయిర్‌పోర్ట్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. అయోధ్యలో నిర్మిస్తున్న ఎయిర్‌పోర్ట్‌కు రూ.101 కోట్లు కేటాయించగా.. నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌కు అయితే ఏకంగా రూ.2 వేల కోట్లు కేటాయించారు. ఇక, అయోధ్యలో నిర్మిస్తున్న విమానాశ్రయానికి మ‌ర్యాద పురుషోత్తం శ్రీరామ్ అనే పేరు ఖరారు చేసినట్టు ఈ సందర్భంగా యూపీ ఆర్థిక మంత్రి సురేష్‌ ఖ‌న్నా ప్రకటించారు. అయోధ్య అభివృద్ధికి మొత్తంగా రూ.140 కోట్లు కేటాయించింది యోగి సర్కార్.. సూర్యకుంద్ అభివృద్ధితో సహా అయోధ్య నగరం యొక్క ఆల్ రౌండ్ అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు.. రామ్ మందిర్ నుండి అయోధ్య ధామ్ వెళ్లే రహదారికి 300 కోట్ల బడ్జెట్, అయోధ్యలో పర్యాటకానికి రూ .100 కోట్లు బడ్జెట్ నిర్ణయించారు.. ఇలా అయోధ్యపై ప్రత్యేకంగా దృష్టిసారించారు యోగి.