ఆరుగురు ఎమ్మెల్యేలు టార్గెట్..వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్యూహం ఇదేనా...!

ఆరుగురు ఎమ్మెల్యేలు టార్గెట్..వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్యూహం ఇదేనా...!

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా వైసీపీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై వల విసిరింది. ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ లతో వైసీపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. మహానాడు ముందు టీడీపీని దెబ్బతీయాలని భావించిన అధికారపార్టీ... ఆపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వల విసిరింది. అయితే దీని వెనుక అసలు ప్యూహం వేరే ఉందన్న టాక్ వినిపిస్తుంది.

టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలవగా వల్లభనేని వంశీ,మద్దాలి గిరి, కరణం బలరాంలు పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు సభలో టీడీపీ వాస్తవ బలం 20కి చేరింది. మరో ముగ్గురు సభ్యులు ఇదే తరహాలో దూరమైతే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా దక్కదు. ఇప్పటికే పలువురు టీడీపీ సభ్యులు తమతో టచ్ లో ఉన్నారని  వైసీపీ చెబుతుంది. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయటం ద్వారా..ఆయనకు ప్రస్తుతం కొనసాగిస్తున్న కేబినెట్ హోదా రద్దవుతుంది. అదే విధంగా ఆయనకు దక్కాల్సిన ఇతర సౌకర్యాల విషయంలోనూ కోత పడుతుంది.

ఈ ప్యూహంలో భాగంగానే మరోసారి ప్రకాశం జిల్లాలో విపక్ష టీడీపీపై అధికార వైసీపీ వలేసింది.. పర్చూరు  ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అధికార పార్టీలో చేరే విషయమై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు.  సాంబశివరావు,మంత్రి బాలినేనితో కలిసి సీఎం జగన్‌ను కలిసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బలరామ్ దారిలోనే ఏలూరి సాంబశివరావు కూడా వైసీపీకి మద్దతు తెలపనున్నట్టు సమాచారం.

గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.. అధికార పార్టీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తనతో సంప్రదింపులు జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు సత్యప్రసాద్.. పార్టీ మారితే  తప్పకుండా చెప్పే మారతానన్నారు. సత్యప్రసాద్ సోదరి డాక్టర్ కావటం...జగన్ సతీమణికి స్నేహితురాలు కావటంతో ఆ పరిచయాల ద్వారా సత్యప్రసాద్ వైసీపీలోకి వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.చేరికలతో విపక్షాన్ని మానసికంగా దెబ్బతీసేదిశగా.. అధికార పార్టీ అడుగులేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

తాజాగా విశాఖ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కనుక అధికార పార్టీకి జై కొడితే మొత్తంగా ఆరుగురు ఎమ్మెల్యేలు దూరమైతే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోయినట్లే. అయితే వారు టీడీపీని వీడినా వంశీ తరహాలో స్వతంత్ర సభ్యులుగా స్పీకర్ గుర్తిస్తేనే సాధ్యం అవుతుంది.