విశాఖపై వ్యూహం మార్చిన వైసీపీ

విశాఖపై వ్యూహం మార్చిన వైసీపీ

అధికారపార్టీ అక్కడ మళ్లీ వ్యూహం మార్చింది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం సామాజికంగా.. ఆర్థికంగా బలమైన వ్యక్తిని ఎంచుకుంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. మరి.. ఈ ప్రయత్నమైనా ఫలితానిస్తుందా?. సిటింగ్‌ ఎమ్మెల్యేపై ఆ మాజీ సై అంటారా?
 
విశాఖ తూర్పు నియోజకవర్గంపై వైసీపీ ఫోకస్‌!

విశాఖ జిల్లామొత్తం ఓ లెక్క అయితే.. నగరం నడిబొడ్డున ఉన్న నాలుగు నియోజకవర్గాలది మరో లెక్క. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలలో తిరుగులేని విజయం నమోదు చేసిన వైసీపీకి గ్రేటర్‌ విశాఖలో పట్టుదక్కలేదు. ఇది పెద్దలోటుగా భావిస్తోంది అధికారపార్టీ. మిగిలిన స్థానాల మాట ఎలా ఉన్నా.. విశాఖ తూర్పు నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు వెలగపూడి రామకృష్ణబాబు. 
 
హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా వెలగపూడికి గుర్తింపు!

2009లో విశాఖ తూర్పు నియోజకవర్గం ఆవిర్భవించగా అప్పటి నుంచి వెలగపూడి రామకృష్ణబాబే ఇక్కడ ఎమ్మెల్యే. ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడిచినప్పుడు 4 వేల మెజార్టీతో గెలిచారు. 2009లో వెలగపూడికి ప్రత్యర్ధిగా బరిలోకి దిగిన వంశీకృష్ణ శ్రీనివాస్.. 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వెలగపూడి మెజార్టీ ఏకంగా 47 వేలు దాటిపోయింది. 2019 ఎన్నికల్లో వంశీ కృష్ణను కాదని అక్కరమాని విజయనిర్మలకు టిక్కెట్ ఇచ్చింది వైసీపీ. అయినా ముచ్చటగా మూడోసారి విజయం వెలగపూడినే వరించింది. దీంతో ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించారు.
 
పాత నేతలు వెలగపూడి వేగాన్ని అందుకోలేకపోతున్నారా?

ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు టైమ్‌ ఉన్నా.. ఇప్పటి నుంచే బలమైన కోఆర్డినేటర్‌ను నియమించాలని భావిస్తోందట. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న వంశీకృష్ణకు GVMC హామీ దక్కడంతో ఆయన దాదాపుగా ఎమ్మెల్యే సీటుపై ఆశలు వదిలేసుకున్నారట. అక్కరమాని విజయ నిర్మలకు పార్టీ కేడర్‌తో సమన్వయ లోపాన్ని పార్టీ పెద్దలు గుర్తించారట. పైగా సిటీ రాజకీయాలకు కొత్త కావడంతో వెలగపూడి వేగాన్ని అందుకోలేక పోతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. 
 
విశాఖ తూర్పులో పంచకర్ల సరిపోతారా? 

ఈ పరిణామాలతో తూర్పు నియోజకవర్గంలో కొత్త కన్వీనర్‌ వేటలో పడిందట వైసీపీ. ఆ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుపై ఫోకస్‌ పెట్టిందని చెబుతున్నారు. పంచకర్ల గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. విశాఖ టీడీపీ రూరల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వ్యాపార పనుల్లో మునిగిపోయారు. ఆర్థికంగా.. సామాజికంగా బలమైన పంచకర్ల అయితే విశాఖ తూర్పునకు సరిపోతారని అనుకుంటున్నారట. 
 
కాపు ఓటర్లే 40 వేల మంది!

ఈ నియోజకవర్గంలో యాదవులు, కాపులు, మత్స్యకారుల ఓటర్లు ఎక్కువ. కాపు ఓటర్లే దాదాపు 40 వేల మంది ఉంటారు. పంచకర్ల కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడం.. గతంలో ఆయన ఎమ్మెల్యే పనిచేసిన యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో మత్స్యకారులతో మంచి సంబంధాలు ఉండటంతో తూర్పులో ఆయనైతే లెక్క సరిపోతుందని అనుకుంటున్నారట. యాదవ సామాజికవర్గానికి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ విశాఖ మేయర్ అయితే.. యాదవులు, కాపులు, మత్స్యకారుల మద్దతుతో ఇక్కడ ఎమ్మెల్యే స్థానాన్ని కైవశం చేసుకోవాలని చూస్తున్నారట. విశాఖ ఎంపీగా ఎంవీవీ సత్యనారాయణ ఉండటంతో కమ్మ సామాజికవర్గం ఓట్లు కలిసి వస్తాయని అనుకుంటున్నారట. మరి వైసీపీ ఆఫర్‌కు పంచకర్ల రమేష్‌ బాబు ఎలా రెస్పాండ్‌ అవుతారో చూడాలి.