ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు జగన్ షాక్...!

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు జగన్ షాక్...!

ఆ ఇద్దరు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు. జూనియర్లే అయినా కంచుకోటను వాళ్ల చేతిలో పెట్టింది పార్టీ. రిజర్వ్డ్‌ స్థానాలు కావడంతో మిగిలిన వారి కంటే ఎక్కువ ప్రాధాన్యమే దక్కింది. కానీ.. స్థానిక ఎన్నికల్లో ఫలితాలు తేడా వచ్చాయి. దీంతో హైకమాండ్ ఆ ఇద్దరికీ షాక్ ఇచ్చింది. అభ్యంతరాలను పక్కన బెట్టి పాత నాయకుడిని రంగంలోకి దించింది. ఈ మార్పులు విశాఖ ఏజెన్సీలోని వైసీపీ సమీకరణాలపై పడుతుందా? 

టికెట్‌ ఇవ్వకుండా ఎన్నికల సమన్వయకర్తగా నియామకం!

ఏపీ ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్‌గా కుంభా రవిబాబును నియమించింది జగన్ సర్కార్. ఇది కేబినెట్ హోదా కలిగిన పదవి. గతంలో ప్రొఫెసర్‌గా, ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. 2019 ఎన్నికల్లో రవిబాబు పేరును అరకు ఎంపీ కోసం పరిశీలించినా.. అనూహ్యంగా గొట్టేటి మాధవి పేరును పార్టీ ఖరారు చేసింది. అరకు ఎమ్మెల్యేగానైనా అవకాశం వస్తుందని రవిబాబు భావించినా.. ఎన్నికల కంటే రెండేళ్ల ముందు నుంచీ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చెట్టి ఫల్గుణకే ఎమ్మెల్యే టిక్కెట్ దక్కింది. దీంతో రవిబాబును ఏజెన్సీలో ఎన్నికల సమన్వయకర్తగా నియమించి అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఆయనకు అప్పగించింది అధిష్ఠానం. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రా ఊటీలో ఫలితాలు ఏకపక్షంగా వెలువడ్డాయని పార్టీ నేతలు భావిస్తుంటారు.

ఎస్టీ కమిషన్‌ నియామకం ముందు జరిగిన పరిణామాలపై చర్చ!

విశాఖ ఏజెన్సీ వైసీపీకి కంచుకోట. రెండు దఫాలుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. ఆదివాసీలు ఫ్యాన్ గుర్తుకే కనెక్ట్ అవ్వడం.. నాన్ ట్రయిబ్ ఓటర్లకు వైఎస్‌ కుటుంబంపై ఉన్న అభిమానం దీనికి ప్రధానకారణాలు. అపారమైన ఖనిజ సంపద, పర్యాటక అద్భుతాలు కలిగిన మన్యంలో గతం కంటే భిన్నమైన రాజకీయాలు నడుస్తున్నాయనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పాడేరు ఎమ్మెల్యే కొత్తగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు శాసనసభ్యుడు చెట్టిఫల్గుణలు తమ ప్రాధాన్యాన్ని నిరూపించుకునేందుకు ఫోకస్‌ పెట్టారట. ఆ తర్వాతే ఏజెన్సీలో వైసీపీ రాజకీయం మారిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎస్టీ కమిషన్ ఛైర్మన్ నియామకం ముందు జరిగిన పరిణామాలు ఇక్కడ చర్చనీయాంశంగా మారాయి. 

రవిబాబుకు పదవి వస్తే ప్రాధాన్యం తగ్గుతుందని అనుమానించారా?
పంచాయతీ ఎన్నికల ఫలితాలు కొత్త చర్చకు బాట వేశాయా? 

కుంభా రవిబాబు మైదాన ప్రాంతానికి చెందిన గిరిజన నేత. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు స్థానికంగా బలమైన తెగలకు చెందినవారు. కుంభా రవిబాబుకు అవకాశం దక్కితే తమ ప్రాధాన్యానికి గండి పడుతుందనే అనుమానంతో వారు ఎత్తుగడలు వేశారట. పార్టీ ముఖ్యనేతల దగ్గర తమ మనసులో మాటను బయటపెట్టారట. అంతేకాదు ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా పలువురు పేర్లను ప్రతిపాదించినట్టు భోగట్టా. అంతర్గత రాజకీయాల వల్ల కొంతకాలం రవిబాబు నియామకం వాయిదా పడింది. ఇది ఆయన అభిమానులను నిరాశపర్చింది. ఇంతలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీలో కొత్త చర్చకు బాట వేశాయి. ప్రజలు, కేడర్‌ ఇద్దరూ ఎమ్మెల్యేలకు దూరమైనట్టు పార్టీ పెద్దలు గ్రహించారట. టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుదారులు గెలవడాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. నియోజకవర్గ కేంద్రాలైన పాడేరు, పెదలబుడు మేజర్‌ పంచాయతీలను పార్టీ కోల్పోవడం పెద్ద చర్చకు దారితీసింది. 

రవిబాబుకు పదవి ఇచ్చి ఏజెన్సీలో పార్టీని సెట్‌రైట్‌ చేస్తున్నారా? 

పంచాయతీ ఫలితాలను చూసిన తర్వాత కంచుకోటకు బీటలు వారుతున్నాయనే చర్చ కూడా వైసీపీలో మొదలైందట. అందుకే కుంభా రవిబాబును ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ చేసి.. అంతర్గతంగా పార్టీని సెట్‌రైట్‌ చేసే బాధ్యతను ఆయన చేతుల్లో హైకమాండ్‌ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.  మరి.. కొత్త పదవితో కుంభా రాక విశాఖ ఏజెన్సీ వైసీపీలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో చూడాలి.