వైసీపీ ఎమ్మెల్యేలను భయపెడుతున్న కొడాలి నాని వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్యేలను భయపెడుతున్న కొడాలి నాని వ్యాఖ్యలు

ఆయనో మంత్రి. నోరు విప్పితే ఉచకోతే. అలాంటి అమాత్యుడి దూకుడు ప్రతిపక్షానికే కాదు.. అధికారపక్ష నాయకులకు షాక్‌ కొడుతోందట. ఆయన ఇస్తున్న కొన్ని స్టేట్‌మెంట్లు స్వపక్ష ఎమ్మెల్యేలకే రివర్స్‌ అవుతున్నాయట. సదరు మంత్రిగారిని కట్టడి చేయలేక.. ఆయన ప్రకటనలకు మద్దతు ప్రకటించలేక అడకత్తెరలో పడుతున్నారట ఎమ్మెల్యేలు. 
 
తనకు గిట్టని వారిని మాటలతో ఊచకోత కోస్తారు కొడాలి!

కొడాలి నాని. రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యే... మరో రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యే. ఇప్పుడు మంత్రి. మొదటి నుంచి కొడాలి నానిది ఒకటే స్వభావం. దూకుడుగా వెళ్తారు. చంద్రబాబు అన్నా.. చంద్రబాబు కుటుంబం అన్నా.. బాబు కోటరీ పేరు ఎత్తినా అంతెత్తున ఫైర్‌ అవుతారు. చంద్రబాబు సహా టీడీపీలో తనకు గిట్టని వారని తన మాటలతో ఊచకోత కోస్తారు. 
 
రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోన్న మూడు రాజధానులకు కొడాలి మద్దతు తెలియజేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా... ఇటీవల అమరావతి శాసన రాజధానిగా కూడా వద్దు అంటూ  సీఎం జగన్‌కు చెప్పానన్న కొడాలి ప్రకటనతో అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కలకలం మొదలైందట. 
 
కొడాలి పేల్చిన బాంబుతో వైసీపీ ఎమ్మెల్యేల ఫీజులు ఎగిరిపోయాయా?

మూడు రాజధానుల అంశానికి మద్దతు తెలియజేసే విషయంలో కృష్ణాజిల్లా, బెజవాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తటపటాయించారు. స్థానికుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని సైలెంట్‌గా ఉన్నారు. ఇక్కడి ఓట్లతో గెలిచి ఇక్కడి నుంచి హైకోర్టు, సెక్రటేరియట్‌ తరలించడానికి మద్దతు ఇవ్వడం ఎలా అని  వారు తర్జన భర్జన పడ్డారు. అయితే మంత్రి కొడాలి మూడు రాజధానులకు మద్దతు తెలియజేయడంతో ఈ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇరుకునపడ్డారు.

దీంతో సీఎం జగన్‌ మాటే మా మాట అని అధికార పార్టీ శాసనసభ్యులు చెప్పక తప్పలేదు. పైగా జగన్‌ మూడు రాజధానుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో వాళ్లు జై కొట్టాల్సి వచ్చింది.  ఈ అంశంపై ఇప్పటికే మింగలేక కక్కలేక ఉన్న కృష్ణాజిల్లా వైసీపీ ఎమ్మెల్యేలకు కొడాలి పేల్చిన మరో బాంబుకు ఫీజులు ఎగిరిపోయాయట. 
 
శాసన రాజధాని కూడా వద్దనడంతో మైండ్‌ బ్లాంక్‌ అయిందా?

అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దన్నది కొడాలి మాట. అదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌కు కూడా చెప్పానన్నారు.  పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఒప్పుకోని ప్రాంతంలో చట్టసభలు కూడా పెట్టవద్దని సీఎంకు చెప్పానన్న నాని మాటలు కాకపుట్టిస్తున్నాయి. ఇప్పటికే అమరావతి ఎటూ తేలక..ఆ ప్రభావం తమపై ఎలా ఉంటుందా అని భయపడుతున్నారట కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు. అలాంటిది ఇప్పుడు శాసన రాజధానిగా కూడా  వద్దని అనడంతో దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవుతోందట. 
 
కొడాలికి మద్దతుగా మాట్లాడితే ఇబ్బంది అనుకుంటున్నారా? 

బెజవాడకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే ఈ అంశంపై తన్న సన్నిహితుల దగ్గర గోడు వెళ్లబోసుకున్నారట. కొడాలి నాని ఎవరితో చర్చించకుండా మాట్లాడేసి.. ఆ తర్వాత  మేం మద్దతు ఇవ్వాలనడం.. ఇస్తున్నా అనడం ఎంత వరకు సబబు అని వాపోయారట. పైగా కొడాలికి మద్దతుగా మాట్లాడటం వల్ల ఇంకో సమస్య తప్ప ప్రయోజనం ఉండబోదని.. ఇలాంటి వివాదాస్పద కామెంట్స్‌ వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని మదనపడుతున్నారట. కొడాలి నాని చేసిన కామెంట్స్‌కు మీరు మద్దతు ఇస్తారా అని మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను అడిగితే.. దానిపై మేం స్పందించడమంటే మా గొయ్యి మేం తీసుకోవడమే అన్నారు.  

వల్లభనేని వంశీ ఒక్కరే కొడాలికి మద్దతుగా మాట్లాడారా? 

ఇప్పటి వరకూ కృష్ణా జిల్లాలో మంత్రి కొడాలి నాని లేవనెత్తిన అంశానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రమే మద్దతుగా నిలిస్తే మిగతా వారు జతకలవడం లేదు. రాజధాని అంశం సున్నితంగా మారడంతో దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉండటమే మంచిదని భావిస్తున్నారట. మిగిలిన ఎమ్మెల్యేలు అవసరమైతే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి.. అత్యవసరమైతే తప్ప మాట్లాడకూడదని నిర్ణయించారట. మరి.. ఇకనైనా సహచర ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారో లేక నేనింతే అంటూ మళ్లీ ఊచకోత మొదలుపెడతారో చూడాలి.