గుంటూరు మార్కెట్ పై కన్నేసిన వైసీపీ నేత ఎవరు?

గుంటూరు మార్కెట్ పై కన్నేసిన వైసీపీ నేత ఎవరు?

గుంటూరు మార్కెట్‌ను బిల్డ్ ఏపీ నుంచి ప్రభుత్వం మినహాయించిందా? అయితే.. వ్యాపారాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇంతకీ మార్కెట్ స్థలం ఎవరికి అవసరం? ఈ స్థలంపై మోజుపడిన పెద్దాయన ఎవరు? 

బిల్డ్‌ ఏపీ నుంచి గుంటూరు మార్కెట్‌ స్థలానికి మినహాయింపు!

గుంటూరు మార్కెట్‌ స్థలంపై అధికార పార్టీకి చెందిన ఓ పెద్దాయన కన్ను పడినట్టు పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జోరందుకుంది. దీనిపై వైసీపీలోనే పెద్ద ఎత్తన కథలు కథలుగా చెప్పుకొంటున్నారట. గుంటూరు నడిబొడ్డున, నగర పాలక సంస్థ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఈ స్థలం కోట్లు విలువ చేస్తుంది. బిల్డ్‌ ఏపీ పథకంలో భాగంగా ఈ మార్కెట్‌ స్థలాన్ని విక్రయించాలని చూసినా.. స్థానికంగా వచ్చిన వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు. కొందరు కోర్టు తలుపు తట్టారు. చివరకు మార్కెట్‌ స్థలాన్ని బిల్డ్‌ ఏపీ  నుంచి తప్పించింది ప్రభుత్వం. 

కరోనా టైమ్‌లో తెరిచిన రెండోరోజే మూసివేత!

ఈ మార్కెట్‌లో దాదాపు 340 కూరగాయల దుకాణాలు ఉన్నాయి. నిత్యం లక్షల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. కరోనా వల్ల ఇక్కడ మార్కెట్‌ను మూసివేసి.. నగరంలోని వివిధ ప్రాంతాల్లోనే దుకాణాలు పెట్టారు.  ఈ మార్కెట్‌కు ఆనుకుని ఉన్న చేపల మార్కెట్‌ తెరిచేందుకు అనుమతి ఇచ్చిన అధికారుల.. దీనికి మాత్రం ససేమిరా అన్నారు. దీంతో అనుమానించిన వ్యాపారులు పెట్రోల్‌ బాటిళ్లతో నిరసనకు దిగడం కలకలం రేపింది. స్థానికంగా వ్యక్తమవుతున్న ఆందోళనను గమనించిన ఇద్దరు ఎమ్మెల్యేలు మార్కెట్‌ను ఓపెన్‌ చేశారు. కానీ.. కరోనా పేరు  చెప్పి రెండోరోజే మళ్లీ మూసివేశారు. 

మార్కెట్ స్థలం వశం చేసుకోవడానికి 'పెద్దాయన' యత్నం? 

ఎమ్మెల్యేలు స్వయంగా తెరిపించిన మార్కెట్‌ను మూసివేయడంపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. వైసీపీకి చెందిన ఓ పెద్దాయన ఈ స్థలంపై మనసు పడటం వల్లే అధికారులపై ఒత్తిడి తెచ్చి తాళం వేయించారని అనుకుంటున్నారు. పార్టీకి వీరవిధేయుడిగా పేరున్న ఆ నేతను ఇటీవలే పెద్ద పదవి వరించింది. పెద్ద పదవి వచ్చిందన్న దీమానో లేక పాలకులకు దగ్గరన్న  ధైర్యమో కానీ.. ఈ స్థలాన్ని ఎలాగైనా వశం చేసుకోవాలని ఆయన చూస్తున్నారట. 

వ్యాపారుల ఆందోళనతో దుమారం!

వందల కోట్ల విలువైన ఈ స్థలాన్ని ప్రభుత్వం నుంచి నేరుగా కొనుగోలు చేయాలని ఆయన అనుకుంటున్నారట. ఆ మేరకు ప్రతిపాదనలు పంపారని సమాచారం. అందుకే  కరోనాను బూచిగా చూపించి తిరిగి ప్రారంభమైన మార్కెట్‌ను మూయించి.. వ్యాపారులు రాకుండా విశ్వప్రయత్నం చేశారని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అయితే వ్యాపారులు మరోసారి ఆందోళనకు దిగడంతో ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. 

హోంమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లిన వైసీపీ నేత!

వైసీపీ నేత పన్నాగం గురించి తెలుసుకున్న అధికార పార్టీలోని నేతలే ఆయనకు చెక్‌ పెట్టేందుకు పావులు కదుపుతున్నారట. గుంటూరు నగర పాలక సంస్థ మేయర్‌ రేస్‌లో ఉన్న  ఓ నాయకుడు ఈ వివాదాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత దృష్టికి తీసుకెళ్లారట. హోంమంత్రి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారని సమాచారం. ఏమైందో ఏమో కానీ.. మార్కెట్‌ తెరిచేందుకు అనుమతులు వచ్చాయి. దీంతో ఆ పెద్దాయన ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. మరి.. సదరు వైసీపీ నేత కామ్‌గానే ఉంటారో.. లేక మరో రూపంలో పావులు కదుపుతారో చూడాలి.