పార్టీ మారే ఆలోచనలో వైసీపీ నేత...?
ఆయనో మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నారు. అయినా సంతృప్తిగా లేరట. సొంత గూటికి వెళ్లిపోతే ఎలా ఉంటుందని అని ప్లాన్ వేసుకుంటున్నారట. ఆ బాధ్యతలను సైతం అనుచరులపై వేశారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ?
రాజకీయ భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నారా?
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు పొలిటికల్ ఫ్యూచర్‌ని సరిదిద్దుకునే పనిలో పడ్డారట. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారాయన. అధికార పార్టీలో కొనసాగుతున్నా డేవిడ్ రాజుని ఎవరూ పట్టించుకోవడం లేదని సమాచారం. వైసీపీ నాయకులు ఆయన్ని లైట్ తీసుకుంటున్నారట. నాయకుల తీరుకు తగ్గట్టుగానే అధికారులు సైతం ఈ మాజీ ఎమ్మెల్యేను లెక్క చేయడం లేదని తెలుస్తోంది. దీంతో తన రాజకీయ భవిష్యత్‌పై బెంగ పట్టుకుందట. తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీలోకి జంప్!
తన పొలిటికల్ ఫ్యూచర్‌ని చక్కదిద్దే బాధ్యత డేవిడ్‌రాజు తన పాత అనుచరులపై పెట్టారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆయన జిల్లా రాజకీయాల్లో మళ్లీ చర్చల్లోకి వచ్చారు. డేవిడ్‌రాజు రాజకీయ ప్రయాణం టీడీపీ నుంచే ప్రారంభమైంది. 1999లోనే టీడీపీ నుంచి సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు జడ్పీ ఛైర్మన్‌గాను పని చేశారు. 2009లో ఎర్రగొండపాలెంలో టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన ఆయన... ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014లో ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు డేవిడ్‌రాజు. కానీ.. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎక్కువ రోజులు వైసీపీలో ఉండలేకపోయారు. టీడీపీ కండువా కప్పేసుకుని సొంత గూటికి వెళ్లిపోయారాయన.
టికెట్ ఇవ్వకపోవడంతో తిరిగి వైసీపీలోకి జంప్!
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండటంతో 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ తనకే అని భావించారు డేవిడ్‌రాజు. కానీ.. ఆయనకు కాకుండా ఎర్రగొండపాలెం టికెట్ బూదాల అజితారావుకు ఇచ్చింది టీడీపీ. దీంతో మనస్తాపం చెందిన డేవిడ్‌రాజు తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఏదో ఒక నామినేటెడ్ పదవిని పట్టేందుకు చాలా మంది పార్టీ నేతలను కలిశారట. చేతిలో ఒక పదవి ఉంటే.. దానిని ముందు పెట్టుకుని పర్యటిద్దామని ఆయన అనుకున్నారు. ఆయనొకటి తలిస్తే.. వైసీపీ నేతలు మరోలా లెక్కలు వేసుకున్నారు. వైసీపీలో డేవిడ్‌రాజును పట్టించుకున్నవారు లేరట. పేరుకు అధికార పార్టీలోనే ఉన్నా.. చేతిలో పవర్ లేదట.
టీడీపీలోకి వెళ్లేందుకు బాటలు వేయాలని అనుచురులతో వేడుకోలు!
ఏడాదిన్నరగా వైసీపీలో అసంతృప్తితో రగిలిపోతున్న డేవిడ్‌రాజు.. తన రాజకీయ భవిష్యత్‌ను టీడీపీలోనే వెతుక్కునేందుకు మరోసారి సిద్ధపడినట్టు సమాచారం. అయితే ఇప్పటికే రెండుసార్లు టీడీపీని వీడి వెళ్లిపోవడంతో అక్కడ కూడా ఆయన్ని ఎవరూ పట్టించుకోవడం లేదట. దీంతో ఎర్రగొండపాలెంలోని టీడీపీలో ఉన్న తన పాత అనుచరులను రంగంలోకి దించారట ఈ మాజీ ఎమ్మెల్యే. దీనికి సంబంధించి ఒంగోలులో పాత అనుచరులతో సమావేశమై.. ఎలాగోలా టీడీపీలోకి వెళ్లేందుకు బాటలు వేయాలని అభ్యర్థించారట. చంద్రబాబుతో మాట్లాడి పసుపు కండువా వేయించాలని కోరారట. అయితే డేవిడ్‌రాజు కదలికల గురించి తెలుసుకున్న YcP ఎదురుదాడి మొదలుపెట్టింది. ఆయన YCPలో ఉన్నారా? ఎప్పుడొచ్చారు అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ వ్యాఖ్యలు డేవిడ్‌రాజుకు పుండుమీద కారం జల్లినట్టు ఉన్నాయట.
ఎర్రగొండపాలెంలో టీడీపీ ఇంఛార్జ్ లేరు!
ప్రస్తుతం ఎర్రగొండపాలెంలో టీడీపీ ఇంఛార్జ్ ఎవరూ లేరు. అందుకే టీడీపీలో చేరి ఆ బాధ్యతలను చేపట్టాలని లెక్కలు వేసుకుంటున్నారట డేవిడ్‌రాజు. రెండుసార్లు టీడీపీ వీడి వెళ్లిన డేవిడ్‌రాజుకు వెల్కమ్ చెబుతారా? ఒకవేళ ఒకే అన్నా.. ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది డౌటేనట. మరి.. ఈ ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో డేవిడ్‌రాజు సైకిల్ ఎక్కుతారో లేదో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)