ఆ ఎమ్మెల్యేపై కార్యకర్తల అసంతృప్తి..ఎందుకో తెలుసా..?

ఆ ఎమ్మెల్యేపై కార్యకర్తల అసంతృప్తి..ఎందుకో తెలుసా..?

పార్టీ అధికారంలో ఉంటే  కేడర్‌లో జోష్‌ మరోలా ఉంటుంది. ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకుంటే.. పనులు దక్కుతాయని.. నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని అనుకుంటారు. కానీ.. ఆ నియోజకవర్గంలో కేడర్‌కు ఆ ఛాన్స్‌ ఇవ్వడం లేదట ఎమ్మెల్యే. ఇంకేముంది ఎక్కడైనా బావ కాని వంగతోట కాదన్నట్టు ఫైర్‌ అవుతున్నారట పార్టీ కార్యకర్తలు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

కనిగిరిలో ఏం జరుగుతుందా అని పార్టీ ఆరా!

బుర్రా మధుసూదన్‌ యాదవ్‌. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే. ప్రస్తుతం అధికార పార్టీలో మధుసూదన్‌పై హాట్‌ హాట్ చర్చ జరుగుతోందట. ఆయన వ్యవహార శైలి నచ్చక అదేపనిగా కేడర్‌ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడమే ఈ చర్చకు కారణమట. భారీ మెజారిటీతో గెలిపించిన తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట కార్యకర్తలు. దీంతో కనిగిరిలో అసలేం జరుగుతుందా అని అంతా ఆరా తీస్తున్నారట. 

గెలిచిన కొత్తలో కేడర్‌తో కలిసి మెలిసి ఉన్నారా? 

బిల్డర్‌గా ఉన్న మధుసూదన్‌ 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన సామాజికవర్గం ఓటర్లు కనిగిరి నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటంతో పార్టీ టికెట్‌ ఇచ్చింది.  కానీ.. 2014లో ఓడిపోయారు మధసూదన్‌. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ  గాలి.. అంతకుముందు ఓడిపోయారన్న సింపతి ఆయనకు కలిసి వచ్చింది. దాదాపు 30 వేల మెజారిటీతో గెలుపొందారు.  ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ కేడర్‌తో కలిసి మెలిసి తిరిగారు ఎమ్మెల్యే ముధుసూదన్‌. 

ఏ పని వచ్చినా ఎమ్మెల్యేనే చేస్తున్నారా?
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా పనులు ఎమ్మెల్యేవేనా? 

ఈ హ్యాపీడేస్‌ ఎంతో కాలం నిలవలేదు. ఎమ్మెల్యే మధుసూదన్‌పై  కేడర్‌లో అసంతృప్తి పెరిగింది. ఆయనపై జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వరసగా ఫిర్యాదులు  చేస్తున్నారట. ఈ ఫిర్యాదుల వెనక ఆసక్తికర అంశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  కనిగిరి నియోజకవర్గానికి ఏ పని వచ్చినా.. ఎమ్మెల్యేనే  చేస్తున్నారట. పార్టీ అధికారంలోకి వచ్చింది కదా.. డెవలప్‌మెంట్‌ వర్క్స్ చేసి నాలుగు రాళ్లు వెనకేసుకుందామని ఎదురు చూస్తోన్న కార్యకర్తలకు  ఏ పనీ దక్కడం లేదట.  స్వతహాగా బిల్డర్‌ అయిన మధుసూదన్‌.. వచ్చింది చిన్న పని అయినా.. పెద్ద పని అయినా ఎవరికీ ఇవ్వకుండా కంప్లీట్‌ చేస్తున్నారట. చివరకు కనిగిరిలో కాలనీలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కూడా ఆయన చేస్తున్నట్టు సమాచారం. 

మంత్రి బాలినేనికి కార్యకర్తలు ఫిర్యాదు!

కొంత కాలం ఓపికపట్టి చూసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే మధుసూదన్‌ తీరు రుచించలేదట. పార్టీ జెండా మోసిన తమకు భుజాలు బరువెక్కడం తప్ప మిగిలింది ఏంటని నిలదీయడం మొదలుపెట్టారట. అదే విషయాన్ని మంత్రి బాలినేనికి చెప్పుకొని వాపోయారట కార్యకర్తలు. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలియంది కాదు. కానీ.. ఆయనెందుకు ఇలా చేస్తున్నారో పార్టీ పెద్దలకు అర్థం కావడం లేదట. మంత్రి కానీ.. ఇతర పెద్దలు కానీ ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడే పరిస్థితి లేదని అంటున్నారు. 

ఏడాదిన్నరగా కార్యకర్తలతో గ్యాప్‌!

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో కనిగిరిలో ఎమ్మెల్యేకు కార్యకర్తలకు మధ్య గ్యాప్‌ పెరుగుతుందే తప్ప సయోధ్యకు ఎలాంటి మార్గం కనిపించడం లేదట. మరి.. పార్టీ పెద్దలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.