ఢిల్లీలో అతిపెద్ద కొవిడ్‌ ఆస్పత్రి ప్రారంభం

ఢిల్లీలో అతిపెద్ద కొవిడ్‌ ఆస్పత్రి ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌ సెంటర్‌ను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. దేశ రాజధానిలో కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ ఈ భారీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌... అనుకున్న సమయంలోనే నిర్మాణాన్ని పూర్తి చేశారు. 10 వేల బెడ్స్‌ సామర్థ్యం గల కోవిడ్‌ కేంద్రాన్ని.. ఢిల్లీ లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ నేడు ప్రారంభించారు. దీనికి 'సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌గా నామకరణం చేశారు. ఈ ఆస్పత్రిని ఇవాళ కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌షా సందర్శించారు. 

ఢిల్లీలో ఏర్పాటైన కొవిడ్‌ ఆస్పత్రి.. చైనాలో నిర్మించిన కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రికి పదింతలు పెద్దది కావడం విశేషం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేసింది ఢిల్లీ సర్కార్‌. దీనిలో మొత్తం నాలుగు విభాగాలు ఉండగా ఒక్కొక్క దానిలో 2500 పడకలు ఉంటాయి. ఒక విభాగంలో ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి. ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్(ఐటీబీపీ)‌ విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలో పనిచేస్తారు. ఈ కోవిడ్‌ కేంద్రాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు కేంద్రమంత్రులు పరిశీలించారు.