ఎవరు కావాలి? మొగుడా...  కుక్కలా... 

ఎవరు కావాలి? మొగుడా...  కుక్కలా... 

సృష్టిలో విశ్వాసంగల జంతువు ఏదైనా ఉందంటే అది కేవలం కుక్క మాత్రమే. పాచిపోయిన అన్నం పెట్టినా తిని తోకాడిస్తూ విశ్వాసంగా ఉంటుంది. యజమానిని, అతని ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతుంది. యజమాని కనిపించకపోతే నిద్రాహారాలు మాని కుక్కలు కన్నీళ్లు పెట్టిన సందర్భాలూ లేకపోలేదు. అలాంటి మూగజీవాల కోసం కట్టుకున్న భర్తనే వదిలేసుకుందో బ్రిటన్ మహిళ. బ్రిటన్ లోని సఫోక్ కి చెందిన 49 ఏళ్ల లిజ్ హాలమ్ కి కుక్కలంటే ప్రాణం. కుక్కలను పెంచే వ్యాపారం చేసిన తల్లి, వాటి ఆహార వ్యాపారంలో తండ్రి ఉండటంతో లిజ్ కు చిన్నప్పటి నుంచి కుక్కలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. లిజ్ శునక ప్రేమ గురించి తెలిసినప్పటికీ ఆమె సహ విద్యార్థి అయిన మైక్ ఆమెను పెళ్లాడాడు. పెళ్లయి 25 ఏళ్లవుతున్నా లిజ్ తీరు మారలేదు. 

ఇంటిని వీధికుక్కలతో నింపేసింది. చూస్తుండగానే 30  కుక్కలయ్యాయి. 21 ఏళ్ల కన్నకొడుకు ఆలీ కన్నా తను పెంచే వీధికుక్కలంటేనే లిజ్ హాలమ్ ఎక్కువ ప్రేమ చూపించేది.దీంతో విసిగిపోయిన మైక్ కుక్కలు కావాలా? నేను కావాలా తేల్చుకోమన్నాడు. వెంటనే మరొక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె తట్టాబుట్టా సర్దుకోమని మొగుడికి చెప్పేసింది. అలా వెళ్లిన మైక్ ఈనాటికీ పత్తా లేడు. తను చేస్తున్న పని తనకెంతో ఆనందాన్నిస్తోందని చెబుతోంది లిజ్. ప్రతి రోజూ 18 గంటల పాటు పని చేయాల్సి వస్తోందని.. అయినా తనకేం బాధ అనిపించడం లేదంటోంది ఈ శునక ప్రేమికురాలు.