వాట్సప్‌ కొత్త పాలసీ ఓకే చేయొచ్చా..?

వాట్సప్‌ కొత్త పాలసీ ఓకే చేయొచ్చా..?

వాట్సప్‌ ఓపెన్‌ చేయగానే... కొత్తగా ప్రైవేట్‌ పాలసీ విండో ఓపెన్‌ అవుతోంది. పాలసీని అగ్రీ చేయమని అడుగుతోంది వాట్సప్‌. ఇదంతా మనకెందుకులే అని లైట్‌ తీసుకుంటున్నవాళ్లున్నారు.. పాలసీని చదివి అసలేంటీ పాలసీ అని అర్థం కాక తలలు పట్టుకుంటున్నవాళ్లున్నారు.. కొత్త పాలసీ పేరుతో వాట్సప్‌ ఏదో చేస్తోందని కంగారెత్తుతున్న వాళ్లు కూడా ఉన్నారు. కొత్త ప్రైవసీ పాలసీని చదవకుండా యాక్సెప్ట్ చేసేశారా? దాని వల్ల మీ ప్రైవసీకి కలిగే భంగం ఏంటో తెలుసా? మీ డేటాను వాట్సప్ ఎలా ఉపయోగించుకోబోతుందో... మీ డేటాను ఫేస్‌బుక్‌కు ఎలా షేర్ చేసుకుంటుందో... దీంతో పాటు మీ వివరాలను వ్యాపారులకు ఎలా షేర్ చేస్తారో అన్నీ ఆ కొత్త రూల్స్‌లో వివరంగా ఉన్నాయి. అసలు వాట్సప్ అంటేనే... ప్రైవసీకి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్న పేరుంది. అందుకే ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగించేవారి సంఖ్య పెరిగింది. అసలు వాట్సప్‌ లేని స్మార్ట్‌ ఫోనుండదు. ఒకరకంగా చెప్పాలంటే... వాట్సప్‌ కోసమే స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్న వాళ్లున్నారు. వాట్సప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతో... అంతటి పాపులారిటీ లభించింది. ప్లే స్టోర్‌లో వాట్సప్‌ లాంటి యాప్స్‌ బోలెడన్ని ఉన్నా... వాట్సప్‌ కే క్రేజ్‌.  ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే మీరు పంపిన మెసేజ్ అవతలివారికి మాత్రమే కనిపిస్తుంది. ఎవరూ హ్యాక్ చేసి ఆ మెసేజ్‌ని చదవడం సాధ్యం కాదు.

కానీ, ఇప్పుడు వాట్సప్ ప్రైవసీ పాలసీలో కొత్త మార్పులు వచ్చాయి. మీరు వాట్సప్ కొత్త రూల్స్ యాక్సెప్ట్ చేసినట్టైతే... మీరు ఉపయోగించే ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, భాష, టైమ్ జోన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నీ వాట్సప్‌కి తెలుస్తాయి. అంతేకాదు... మీరు వాట్సప్‌లో పంపే చిన్న టెక్స్ట్‌ మెసేజెస్ పైనా వాట్సప్ నిఘా ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌, మెసేజెస్‌ అన్నీ... వాట్సప్‌ చేతుల్లోకి కూడా వెళ్తాయి. అంటే మీ అభిరుచులు ఏంటీ, మీరు ఎక్కువగా ఏ టాపిక్స్‌పై ఆసక్తి చూపిస్తారు, ఎక్కువగా వేటి గురించి మాట్లాడతారు అన్న విషయాలు వాట్సప్‌కు తెలుస్తాయి. ఇలా మీ అభిరుచులు, ఆసక్తులు వాట్సప్‌కు తెలియడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటనుకుంటున్నారా..? ఈ డేటా మొత్తాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది వాట్సప్. ఒకప్పుడు వాట్సప్ ఇండిపెండెంట్ సంస్థ. కానీ ఇప్పుడు వాట్సప్ ఫేస్‌బుక్‌కు చెందిన సంస్థ. మీ అభిరుచులు, ఆసక్తులు ఫేస్‌బుక్‌కి తెలియడం వల్ల మీరు ఏవి ఇష్టపడతారో అందుకు సంబంధించిన యాడ్స్ మీ స్క్రీన్‌పైన ఎక్కువగా కనిపిస్తాయి. దీని ద్వారా మీకు ఆ అడ్వర్‌టైజ్‌మెంట్ల ట్రాప్‌లో పడే అవకాశం ఉంది. ఇదంతా సాధారణంగానే ఉన్నా... ఇటీవల వాట్సప్ పేమెంట్స్ మొదలైన సంగతి తెలిసిందే. అందులో మీరు చేసే లావాదేవీల వివరాలు కూడా థర్డ్‌ పార్టీ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. మీ అకౌంట్‌ నెంబర్‌... పిన్‌ నెంబర్‌... బ్యాంక్‌ బ్యాలెన్స్‌... మెయిల్‌ ఐడీ... అన్ని హ్యాక్‌ అయినట్టే. వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రానుంది. అంటే మీరు అంతలోపు వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరించాలి. ఈ రూల్స్ అంగీకరించకపోతే మీరు వాట్సప్ యాప్ ఉపయోగించడం సాధ్యం కాదు. మరోవైపు.. ఎలాంటి ప్రమాదం లేదని.. మీ వ్యక్తిగత గోప్యతకు వచ్చిన ముప్పు ఏమీలేదని.. యూజర్ల వ్యక్తిగత డేటాను వాట్సాప్ ఎక్కడా షేర్ చేయబోమని చెబుతోంది వాట్సప్.