ఈ ఒత్తిళ్లను తట్టుకుంటారా.. జెండా మార్చేస్తారా?

ఈ ఒత్తిళ్లను తట్టుకుంటారా.. జెండా మార్చేస్తారా?

 
కేసులు పెట్టారు. కోట్లకు కోట్లు పెనాల్టీలు వేశారు. చివరకు మైన్స్‌ క్లోజ్‌ చేశారు. ఇక ఆయన్నేం చేస్తారు? ఆయనేం చేశారు? ప్రకాశం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారినా వైసీపీ వర్సెస్‌ టీడీపీ గేమ్‌ తారాస్థాయికి చేరింది. ఇప్పుడు ఏం జరగబోతుంది? 
 
రవికి వైసీపీ ఒత్తిళ్లు ఇబ్బందిగా మారాయా? 

గొట్టిపాటి రవి. అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే. వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ఆయన ససేమిరా లొంగడం లేదు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లి ఒకసారి తప్పుచేశాననే బాధలో ఉన్న రవికి వైసీపీ ఒత్తిళ్లు ఇబ్బందిగా మారాయి.  అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతాడు అనే మాట అనిపించుకోవడం ఇష్టం లేదట రవికి. అందుకే వైసీపీ రారమ్మని పిలుస్తున్నా నో.. నోనో అంటున్నారట.
 
కడప నుంచి వచ్చిన సర్వేయర్లతో విచారణ!
 

దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలల పాటూ రవితోపాటు మాజీ మంత్రి శిద్ధా, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు గనులపై విజిలెన్స్ అధికారుల దాడులు  జరిగాయి. విజిలెన్స్ దాడులు ఈ నేతల గ్రానైట్ క్వారీలే టార్గెట్‌గా జరిగాయి. బల్లికురవలో ఉన్న గొట్టిపాటి రవికుమార్ క్వారీల్లో ప్రత్యేకంగా కడప నుండి తీసుకువచ్చిన సర్వేయర్లుతో క్వారీలో తవ్వకాలపై విచారణ చేపట్టారు. క్వారీల్లో ఉన్న రికార్డులు స్వాధీనం చేసుకుని క్షుణంగా పరిశీలన చేశారు. ఆ తరువాత గ్రానైట్ క్వారీల్లో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతో పాటూ ఆయన కుటుంబ సభ్యుల క్వారీలకు  900 కోట్లు, గొట్టిపాటి రవికుమార్ ఐదు గ్రానైట్ క్వారీలకు 305 కోట్లు, పోతుల రామారావు క్వారీకి 24 కోట్లు జరిమానా విధించారు. అంతేకాదు... క్వారీల్లో గ్రానైట్ ఎగుమతులు కూడా నిలిపివేశారు. దీంతో టీడీపీ నేతలు హైకోర్టుని ఆశ్రయించారు. ఎగుమతుల నిలుపుదలపై హైకోర్టు స్టే విధించింది. అయినా లోకల్‌ గా హైకోర్టు ఆదేశాలు ఏమాత్రం అమలు కాలేదు.
 
అద్దంకిలో ఎమ్మెల్యే మాట నెగ్గడం లేదా? 

ఇంకోవైపు రవి ఎమ్మెల్యే అనే  మాటే కానీ నియోజకవర్గంలో ఒక్క మాటా నెగ్గడం లేదు.  సమయం మనది  కాదనుకుని ఇంటికే పరిమితం అయ్యారు. ఇలాంటి ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రకాశం జిల్లాకే చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు హ్యాండ్సప్‌ అన్నారు.  వైసీపీలో చేరి సేఫ్‌ సైడ్‌లోకి వెళ్లిపోయారు.  రవి మాత్రం ససేమిరా అంటూనే ఉన్నారు. దాని ఫలితం ఇప్పుడు మరింత తీవ్రమైంది. 
 
హైకోర్టును ఆశ్రయించే పనిలో రవి, పోతుల!

ఆర్ధిక మూలాలుగా ఉన్న గ్రానైట్ క్వారీల్లో ఎగుమతులు నిలిపి వేసినా రవి, రామారావు లొంగకపోవడంతో ప్రభుత్వం ఈ ఇద్దరు నేతలకు మరో షాక్ ఇచ్చింది. ఇద్దరి గ్రానైట్ క్వారీలతోపాటూ వారి సన్నిహితులకు చెందిన గ్రానైట్ క్వారీలకు కూడా లీజులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గ్రానైట్ క్వారీలు చేజారి పోతే...భారీగా నష్టపోవాల్సి వస్తుందని లీడర్లు ఆందోళన చెందుతున్నారట. గ్రానైట్ క్వారీలను కాపాడుకునేందుకు వైసీపీకి మద్దతు తెలపాలన్నా.... అక్కడ పొలిటికల్ ఫ్యూచర్ కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదట. దీంతో ఈ ఇద్దరు నేతల పరిస్థితి ముందు నుయ్యి... వెనుక గొయ్యి అన్న చందంగా మారిందట. ఇటు వ్యాపారాలు వదులు కోలేక.. అటు ఉన్న పార్టీని వీడ లేక నేతలు సతమతమైపోతున్నారట. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన షాక్ నుండి ఉపశమనం పొందేందుకు ఈ ఇద్దరు నేతలు హైకోర్టుని ఆశ్రయించే పనిలో పడ్డారట. అధికార పార్టీకి టార్గెట్‌గా మారిన ఈ ఇద్దరు నేతలు తమ గ్రానైట్ వ్యాపారాలు ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.