కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి 'గ్రేటర్‌' ఎన్నికలు పరీక్షేనా? 

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి 'గ్రేటర్‌' ఎన్నికలు పరీక్షేనా? 

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఎంపీగా.. కేంద్రమంత్రిగా రచ్చ గెలుస్తున్న కిషన్‌రెడ్డి.. ఇంట గెలుస్తారా? ప్రస్తుతం బీజేపీలో..ఇతర రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. 

కేంద్రమంత్రిగా సక్సెస్‌ఫుల్‌ ప్రయాణం!

కిషన్‌రెడ్డి. సికింద్రాబాద్‌ ఎంపీ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. కేంద్రమంత్రి హోదాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల బాధ్యతలు కూడా  చూస్తున్నారు. కోవిడ్‌ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ సమన్వయకర్తగా మంచి మార్కులు సంపాదించారు. అది చూసిన వారంతా కేంద్రమంత్రిగా ఆయన ప్రయాణం సక్సెస్‌ఫుల్‌గా ఉందని అనుకుంటున్నారు. ఆ విధంగా కేంద్రంలో కీలకంగా మారారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. 

'గ్రేటర్‌' ఎన్నికలు పెద్ద పరీక్షేనా?

అయితే కిషన్‌రెడ్డి త్వరలోనే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల రూపంలో పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నారు. కిందటి GHMC ఎన్నికల్లో ఏదో అనుకున్నా.. సిటీలో BJP సింగిల్‌ డిజిట్‌కు పరిమితమైంది. ఇప్పుడు అలా కాదు. నగరంలో పట్టుసాధించడం ఒక ఎత్తు అయితే..  తెలంగాణలో బలపడాలంటే GHMCలో BJP జెండా ఎగరేడం అంతే ముఖ్యమనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఈ ఎన్నికలు బీజేపీతోపాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కూడా సవాల్‌ విసురబోతున్నట్టు పార్టీ వర్గాలు  గుస గుసలాడుకుంటున్నాయి. 

నేతలను ఒకేతాటిపైకి తీసుకురావడం అంత ఈజీ కాదా?

గ్రేటర్‌ హైదరాబాద్‌ బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలను  పక్కన పెట్టించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే కిషన్‌రెడ్డి చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఇది పైకి అనుకున్నంత ఈజీ కాదు. పైగా ఎమ్మెల్యే రాజాసింగ్‌కు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పడదనే టాక్‌ పార్టీ వర్గాల్లో ఉంది. పాతబస్తీలో పట్టు బిగించాలంటే రాజాసింగ్‌ను కలుపుకొని వెళ్లడం ముఖ్యం.  అయితే కేంద్రమంత్రి ముందుగా నేతలను, కార్యకర్తలను సమన్వయ పరిచే పనులను  సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మొదలుపెట్టారు. అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

కిషన్‌రెడ్డిపై 'గ్రేటర్‌' ఎన్నికల ఒత్తిడి ఉందా? 

తెలంగాణలో బీజేపీ ఎంపీలున్న చోట మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఆ పార్టీ చెప్పుకోదగ్గ డివిజన్లనే గెలుచుకుంది. అందుకే ఆ మేరకు ఒత్తిడి కిషన్‌రెడ్డిపై కూడా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. GHMCలో 150 డివిజన్లుంటే.. BJPకి నలుగురే కార్పొరేటర్లు ఉన్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఒక్క కార్పొరేటర్‌ కూడా లేరు. ఆ లోటును భర్తీ చసుకోవాల్సి ఉంటుంది. 

ఇటీవల 'గ్రేటర్‌'పై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారా? 

వీటన్నింటినీ లెక్కల్లోకి తీసుకున్నారో ఏమో కానీ.. ఈ మధ్య కాలంలో గ్రేటర్‌పై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారు కేంద్రమంత్రి. అధికార పార్టీపై  పదునైన విమర్శలు చేస్తున్నారు. క్రమంగా బీజేపీ శ్రేణుల్లో చురుకు తీసుకొస్తూనే.. రాజకీయంగా వేడి రగిలిస్తున్నారు. మరి.. రచ్చ గెలిచిన కిషన్‌రెడ్డి  ఇంట గెలుస్తారో లేదో చూడాలి.