హనీమూన్ క్యాన్సిల్ చేసుకొని షూటింగ్ కు రానుందా ..?

హనీమూన్ క్యాన్సిల్ చేసుకొని షూటింగ్ కు రానుందా ..?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చాలా ఘనంగా పెళ్లి చేసుకుంది. శుక్రవారం ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో ఈ అమ్మడు వివాహం జరిగింది. తన ప్రియుడు గౌతమ్ కిచ్లుతో మూడు ముళ్లు వేయించుకొని ఏడడుగులు నడిచింది ఈ బ్యూటీ. కుటుంబసభ్యులు సన్నిహితుల సమక్షంలో మార్వాడీ సంప్రదాయ పద్దతిలో కాజల్ వివాహ వేడుకను వైభవంగా నిర్వహించారు. కాగా పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తానని కాజల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 'లైవ్ టెలికాస్ట్' అనే వెబ్ సిరీస్ ని కంప్లీట్ చేసిన కాజల్.. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని ఉంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'.. మంచు విష్ణు 'మోసగాళ్లు' మూవీలలో నటిస్తోంది. అలానే తమిళంలో కమల్ హాసన్ - శంకర్ కాంబోలో వస్తున్న 'ఇండియన్ 2' సినిమాలోనూ నటించనుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి రెండవ సారి నటిస్తున్న 'ఆచార్య' చిత్రాన్ని నవంబర్ ఫస్ట్ వీక్ లో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహకాలు చేస్తున్నారని తెలుస్తోంది. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కాజల్ అగర్వాల్ పెళ్ళైన వెంటనే 'ఆచార్య' టీమ్ తో జాయిన్ అవుతుందని .. నవంబర్ రెండో వారంలో 'ఆచార్య' సెట్స్ లో అడుగుపెడుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ అందుకు అవకాశం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కొత్త జంట ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత హనీమూన్ ప్లాన్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో పెళ్ళైన రెండు వారాలకే సినిమా షూటింగ్ లో పాల్గొనడం జరిగే పనేనా అనే డౌట్స్ కలుగుతున్నాయి. మరి ఈ పంచదార బొమ్మ హనీమూన్ కి వెళుతుందో లేక షూటింగ్ కి వెళుతుందో చూడాలి...