తెలకపల్లి రవి: ఈటెల రాజేందర్‌ శాఖ రద్దు, తదుపరి ఘట్టం రాజీనామానా, తొలగింపా?

తెలకపల్లి రవి: ఈటెల రాజేందర్‌ శాఖ రద్దు, తదుపరి ఘట్టం రాజీనామానా, తొలగింపా?

      తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌ మెదక్‌ జిల్లా మూసాయి పేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాలలో వంద ఎకరాల అసైన్డ్‌ భూములు ఆక్రమించారంటూ మొదలైన కథనాలు ఇరవై నాలుగు గంటలు తిరగకముందే ఆయన వైద్య ఆరోగ్యశాకలు కోల్పోవడానికి దారితీశాయి. ఇప్పుడు ప్రశ్న ఈటెల రాజీనామా చేస్తారా లేక ముఖ్యమంత్రి కెసిఆర్‌ తొలగిస్తారా అన్న అంశంపైనే కేంద్రీకృతమైనాయి. సంబంధిత భూముల రైతులు ఏకంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కే ఈ సమస్యపై ఫిర్యాదు చేయగా ఆయన జిల్లా కలెక్టర్‌ హరీష్‌నూ, విజిలెన్స్‌ను దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశించడం, ప్రాథమిక నివేదిక కూడా సమర్పించడం శరవేగంగా జరిగిపోయాయి. ఈటెల కూడా సిబిఐతో సహా భూమిమీద వున్న సంస్థలన్నిటితో దర్యాప్తు చేయించవలసిందిగా కోరుతూనే మరోవైపున ఇదంతా ఒక కుట్ర అని ఆరోపించడం, తనను తొలగించాలంటే  ఇంత చేయాల్సిన అవసరం లేదని నిష్టూరాలాడటం తిరుగుబాటే. తొలి స్పందనగా శుక్రవారం రాత్రి  మీడియా గోష్టిలో కన్నా శనివారం ఉదయం విడివిడిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటెల స్వరం పెంచారు. పైగా తను హాచరీస్‌ కోసం భూమి తీసుకోవడం గురించి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాననీ, ఆయన కార్యాయంలోని సీనియర్‌ అధికారి నర్సింగరావు సహా కూడా తీసుకున్నానని మంత్రి చెబుతున్నారు. 
     

        చాలా కాలంగా అసంతృప్తితోనూ ఆవేదనతోనూ వ్యాఖ్యలు చేస్తున్న ఈటెల ఏమంత సంతోషంగా లేరనేది అందరికీ అర్థమైన విషయం. టిఆర్‌ఎస్‌ పార్టీకి మేమే ఓనర్లం అన్న వ్యాఖ్యలను ఇప్పటికీ సమర్థించుకుంటున్నారు. ముఖ్యమంత్రిపై అసంతృప్తితో మాట్లాడుతున్నారు గనక వెంటనే ఆయనకు వ్యతిరేకులైన వారంతా ఈయనపట్ల సానుభూతి చూపడం మొదలుపెట్టారు. కెటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసమే కెసిఆర్‌ హరీష్‌రావునూ ఈటెలనూ దూరం పెట్టారనేది ఈ  వాదనలో ముఖ్యాంశం.  కెటిఆర్‌ను ఆపగలిగే శక్తి సంగతి అటుంచి వీరిరువురూ ఆయన నాయకుడైతే అభ్యంతరం లేదన్నట్టే మాట్లాడారు కూడా. ఈ లోగా కెటిఆర్‌ కొంత బుజ్జగించే ప్రయత్నించారని కూడా వార్తలు వచ్చాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆరోగ్యమంత్రిగా ప్రత్యేక  వత్తిడి ఎదుర్కొంటూనే ఈటెల రాజేందర్‌  తన అసంతృప్తి వ్యాఖ్యలు మాత్రం ఆపకపోవడంతో లోతైన కారణాలే వున్నాయని తేలిపోయింది. ఇదిగో ఇలాంటి సమయంలో ఈ కబ్జా ఫిర్యాదు వచ్చాయి. వీటిని అప్పటి మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి ధృవీకరిస్తూ మాట్లాడటం, జాయింట్‌ కలెక్టర్‌ నగేశ్‌ కూడా బలపర్చడం బట్టి చూస్తే ఇవి వూరికే రాలేదని ప్రభుత్వ వర్గాల దన్ను కూడా వుందని స్పష్టమైంది. చివరకు మంత్రి స్వయంగా వెంటనే  సమాధానం ఇవ్వడం అనివార్యమైంది. మంత్రి అసంతృప్తిగా వున్నారు గనక చరఇదంతా వచ్చిందనేది ఒకటైతే ఇది రాబోతుందని తెలిసినందుకే మంత్రి అలా మాట్లాడుతూ వచ్చారని కూడా చెప్పొచ్చు. ఈ కథనానికి అధికార పార్టీకి సంబంధించిన మీడియాలోనే పూర్తి ప్రాధాన్యతనివ్వడంతో ప్రభుత్వాధినేత మనోగతం కూడా తేలిపోయింది.
            ఇంతకూ ఈటెల సమాధానం చూస్తే ఆధునిక హాచరీకోసం అసైన్డ్‌ భూములు దాదాపు యాభై ఎకరాలు కొన్నమాట నిజమేనని అంగీకరించారు. కాకుంటే అందుకు ఎకరాకు ఆరు లక్షలు చెల్లించామనీ, వారి ఇష్టం మీదనే తీసుకున్నామని ఆయన చెబుతున్నారు. అసైన్డ్‌ భూములు తీసుకోరాదని చట్టం వున్నా ప్రభుత్వం సేకరించే భూములు బడా బాబులు ఆక్రమించేవి  పరిశ్రమలు పెట్టేవి అన్నీ అసైన్డ్‌ భూములు కాదా అని ఆక్షేపిస్తున్నారు. ఈ విమర్శలన్నీ ప్రభుత్వంపై ఎక్కుపెట్టినవేనన్నది స్పష్టం, కాని ఈ సమయం వరకూ అందులో భాగంగా వున్న సీనియర్‌ మంత్రి హఠాత్తుగా వాటిపై విమర్శలు మొదలెడితే విశ్వసనీయత ఏముంటుంది?  ఆత్మగౌరవం కన్నా పదవి గొప్పది కాదంటున్నా  రాజీనామా చేసేందుకు మాత్రం ఆయన సిద్ధం కాలేదు. ఈ సమావేశంలో రాజీనామా ప్రకటిస్తారని మొదట ప్రచారం వచ్చినా దర్యాప్తు జరిపి నిజాలు ముందు తేల్చాలని అన్నారు. తాత్కాలికంగా అన్యాయం పైచేయి సాధించినట్టు కనిపించినా చివరకు ధర్మమే గొస్తుందంటూ తన రాజకీయ జీవితం నీతిమంతమనినొక్కి చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆరోపణలకు గురై వాటి మీద విచారణ కూడా మొదలైన తర్వాత అలాంటి మాటలకు పెద్ద ప్రాధాన్యత వుండదు. ఈ  ఆరోపణలు నిజం కాదని స్థానికులు చెప్పినట్టు కొన్ని కథనాలు వస్తుంటే నిజమేనని మరిన్ని వస్తున్నాయి. విచారణ జరిపిన అధికారులు కూడా ప్రాథమికంగా అరవై అయిదు ఎకరాలు కబ్జా జరిగినట్టే తేలిందని వెల్లడించారు. తొలి నివేదిక ప్రధాన కార్యదర్శికి అందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి మరో మూడు రోజుల్లో మరిన్ని వివరాలు సేకరిస్తామంటున్నారు.
 
     కెసిఆర్‌ ఈటెలను టార్గెట్‌ చేశారు గనకే ఇవన్నీ జరుగుత్తున్నాయని చాలామంది భావిస్తున్నా ఆ కారణంతో ఆరోపణలు అదృశ్యమై పోవు. ఇతరులు అనేకమంది అక్రమాలు చేసినా ఈటెలపైనే  ఎందుకు ఎక్కుపెట్టారనేది కూడా పెద్దగా నిలబడే వాదన కాదు. ఇది  బిసిపై ఎక్కుపెట్టిన అస్త్రమని మరికొందరు విమర్శలు చేయడం ఒక కులం పేరు పదేపదే తేవడం వ్యూహాత్మకమే అవుతుంది. తొలినాటి ఉద్యమ కారులపై దాడిగా చిత్రించడమూ పాక్షికమే. కెసిఆర్‌తో సహా అందరూ ఆ కోవలోకి వచ్చేవారే కదా? మరి వారిపై ఆరోపణలు ఏమవుతాయి. ఎప్పుడైనాసరే  ప్రభుత్వంలో వున్నవారిపై అధికారికంగా బలమైన అరోపణలు వచ్చినపుడు వాటి నిజానిజాలు తేకుండా ఏదో ఒకవైపు నుంచే మాట్లాడటం వల్ల  ఉపయోగం వుండదు. మంత్రి ఈటెల తనవైపు నుంచి దర్యాప్తు కోరుతున్నారు. ముఖ్యమంత్రి కూడా అదే విధమైన ఆదేశాలిచ్చారు. తాను కెసిఆర్‌ను కలుసుకునే ఆలోచన లేదని ఈటెల చెప్పడంతో తెగతెంపులు పూర్తయినట్టే భావించాలి.   ఈలోగానే ముఖ్యమంత్రి ఆయన వైద్య ఆరోగ్య శాఖను తొలగించి తనే తీసుకోవడంతో మొదటి ఘట్టం పూర్తయింది. మంత్రి తనుగా రాజీనామా చేసే పరిస్థితి కనిపించడం లేదు. కెసిఆర్‌ వ్యతిరేకంగా కూటమి కట్టాలనే వారు ఆయనను రాజీనామా చేయమని గట్టిగా కోరుతున్నా దానిపై  స్పందన లేదు, కెసిఆర్‌ తనను తొలగిస్తే వేటు వేశారన్న ప్రచారంతో ప్రజలోకి వెళ్లవచ్చుననే ఆలోచన దీనివెనక వుండొచ్చు, బిజెపి నేతలు దాని అనుకూల మీడియా ఈటెలకు చాలా సానుభూతి చూపించడంలో రాజకీయ ఉద్దేశాలు వుండొచ్చు గాని నిర్ణయం తీసుకోవలసింది ఆయనే. అయితే వామపక్ష నేపథ్యం గల ఈటెల అటు మొగ్గరనే అనుకోవాలి. ఇంకా కొన్ని రాజకీయ సామాజిక శక్తులు ఆయన తమతో వస్తాడనుకుంటున్నాయి గాని దాంతోనే తెలంగాణ రాజకీయాలలో పెద్ద మార్పు వచ్చేస్తుందని చెప్పడానికి లేదు.