ఆళ్లగడ్డ టీడీపీ పగ్గాలు భూమా మౌనిక చేతికి వస్తాయా...?
అక్క రాజకీయంగా.. కేసుల పరంగా ఇబ్బంది పడుతుండటంతో చెల్లి లైన్లోకి వచ్చారా? నియోజకవర్గంలో పార్టీ పగ్గాలు చేపడతారా? కార్యకర్తల రియాక్షన్ ఏంటి? కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. చెల్లి సారథ్యం చేపడితే భూమా కుటుంబానికి పూర్వ వైభవం వస్తుందా?
మౌనిక పగ్గాలు చేపడితే కలిగే లాభాలేంటి? ఎదురయ్యే సవాళ్లేంటి?
హైదరాబాద్ హఫీజ్‌పేట్ భూ వివాదం.. కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టయిన తర్వాత కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు భూమా మౌనిక. ఈ సమావేశంలో మౌనిక చేసిన కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. ఆళ్లగడ్డ టీడీపీకి కొత్త నాయకత్వం వస్తుందా అన్న దిశగా ఆ చర్చ సాగుతోంది. తెలుగు తమ్ముళ్లు ఎవరికి వారుగా విశ్లేసిస్తున్నారు. మౌనిక పగ్గాలు చేపడితే కలిగే లాభలేంటి.. ఎదురయ్యే సవాళ్లేంటనే దానిపై ఇంకొందరు ఫోకస్ పెట్టారు.
రాజకీయ ఒత్తిళ్లు, కేసులు భూమా కుటుంబానికి కొత్తేం కాదన్న మౌనిక!
అఖిలప్రియకు బెయిల్ వచ్చాక భారీ ర్యాలీతో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు తీసుకొస్తామని చెప్పారు మౌనిక. అప్పటి వరకు భూమా కుటుంబం నుంచి తాను బాధ్యత తీసుకుని.. కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటానని తెలిపారామె. అఖిల అరెస్ట్‌ను పెద్ద రాజకీయ కుట్రగా ఆమె ఆరోపించారు. కొన్ని కారణాల వల్ల రెండేళ్లుగా ఆళ్లగడ్డ రాలేకపోయినట్టు తెలిపిన మౌనిక.. రాజకీయ ఒత్తిళ్లు, కేసులు భూమా కుటుంబానికి కొత్తేమీ కాదని స్పష్టం చేశారు. 2017 నంద్యాల ఉపఎన్నికలో మౌనిక జనాలకు పరిచయం అయ్యారు. ఆ సమయంలో ఆమె తీరుపై టీడీపీలోనూ.. జనాల్లోనూ ఆసక్తికర చర్చ జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లో అఖిల యాక్టివ్ కావడంతో.. మౌనిక సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు అక్క అరెస్ట్‌తో పొలిటికల్ తెరమీదకు వచ్చారు చెల్లి.
ఆందోళనలో ఉన్న కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నమా?
కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్ తర్వాత భూమా వర్గీయులు ఆందోళనలో ఉన్నారు. ఆ విషయం తెలుసుకునే కార్యకర్తలకు, అనుచరులకు ధైర్యం చెప్పేందుకు మౌనిక టీడీపీ కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఏ సమస్య వచ్చినా ఫోన్ చేస్తే భూమా కుటుంబం తరఫున బాధ్యత తీసుకుంటానని మౌనిక ఇచ్చిన హామీ.. ఆమె రాజకీయ పగ్గాలు చేపడతారనే అనుమానాలకు బీజమేసింది. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత వారసురాలిగా అఖిలప్రియ బాధ్యతలు తీసుకున్నారు. వారసుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి ఉన్నప్పటికీ వయసు రీత్యా ఇంకా అనుభవం అవసరమనే అభిప్రాయం భూమా వర్గాల్లోనే ఉందట.
యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తానని నేరుగా చెప్పలేదా?
ప్రస్తుతం అఖిలప్రియ కిడ్నాప్ కేసులో అరెస్టయినా.. పొలిటికల్‌గా యాక్టివ్గానే ఉన్నారు. ఆమె బయటకొచ్చేవరకు మౌనిక అండగా ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. మౌనిక రాజకీయ పగ్గాలు చేపట్టేందుకు ఇంకా మరికొంత సమయం పట్టొచ్చని అనేవారు కూడా ఉన్నారు. కార్యకర్తల సమావేశంలో భూమా కుటుంబం తరఫున అండగా ఉంటానని మాత్రమే చెప్పారు కానీ.. తాను యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తానని మౌనిక ఎక్కడా చెప్పలేదు. ఆ విషయాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. మరి.. తాజా ఎపిసోడ్ తర్వాత ఆళ్లగడ్డ రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)