ప్లాన్ ప్రకారం భర్తను చంపించిన భార్య

ప్లాన్ ప్రకారం భర్తను చంపించిన భార్య

కొత్తగా పెళ్లైన ఓ యువ జంట విహారానికి వెళ్లిన సమయంలో దుండగులు భర్తను హతమార్చిన ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా గరుగుబిల్లి సమీపంలో కలకలం సృష్టించిన ఈ కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. ఆ యువకుడి భార్యే తన ప్రియుడి కోసం భర్తను హత్య చేయించినట్లు విచారణలో వెల్లడౌతున్న అంశం. 

శ్రీకాకుళం జిల్లా చిట్టిపూడివలస గ్రామానికి చెందిన యామక గౌరీశంకరావుకు, విజయనగరం జిల్లా కడెకళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి గత నెల 28న వివాహం జరిగింది. వీరిద్దరూ బావా, మరదులే. అప్పటికే సరస్వతి ఓ వ్యక్తిని ప్రేమించింది. బావతో ఇష్టంలేని సరస్వతి.. తన మిత్రుడు శివ, విశాఖపట్నం రౌడీషీటర్ గోపీల సాయంతో భర్తను హత్య చేయించింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తనపైనా దాడి చేయించుకుంది. అదే విషయం ఆమె పోలీసులకు వివరించింది. విచారణలో భాగంగా పోలీసులు హైవేపై తనిఖీలు చేసేప్పుడు శివ, గోపీలు ప్రయాణిస్తున్న ఆటో వేగంగా వెళ్తూ.. ఎస్పీ ప్రయాణిస్తున్న వాహనాన్ని టేకోవర్ చేసింది. దీంతో ఆ ఆటోను ఆపిన ఎస్పీ, వారిని ప్రశ్నిస్తున్నప్పుడు   పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చి  వారిని పోలీసులకు అప్పగించారు. సరస్వతిపై దాడి చేసిన వారు వీరేనన్న అనుమానంతో పోలీసులు విచారించగా.. అసలు నిజం బయటకు వచ్చింది. కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు.