క‌ట్టుకున్నవాడి అంత్య‌క్రియ‌లకు ఎంత క‌ష్టం..! తోపుడుబండిపై తీసుకెళ్లి..

క‌ట్టుకున్నవాడి అంత్య‌క్రియ‌లకు ఎంత క‌ష్టం..! తోపుడుబండిపై తీసుకెళ్లి..

కరోనా భ‌యం మాన‌వ సంబంధాల‌ను మ‌రింత దూరం చేస్తోంది.. అస‌లే ఉరుకుల ప‌రుగుల జీవితంలో.. ఎంతోమంది అయిన‌వారికి దూరం అవుతుండ‌గా.. ఇప్పుడు క‌రోనా భ‌యం అన్నింటికీ అడ్డుగా నిలిస్తోంది.. క‌నీసం చ‌స్తే పాడేమోయ‌డానికి న‌లుగురు కావాలి.. ఆ న‌లుగురు కూడా ద‌రిచేర‌కుండా చేస్తోంది. క‌రోనా స‌మ‌యంలో సాధార‌ణ మ‌ర‌ణాల‌ను సైతం బూచిగా చూస్తూ అయిన‌వాళ్లు కూడా ముందుకురావ‌డంలేదు.. దీంతో.. క‌ట్టుకున్న‌వాడు క‌న్నుమూస్తే... తోపుడు బండిపై తీసుకెళ్లి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించింది ఓ మ‌హిళ‌.. 

వివ‌రాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బెలగావి జిల్లా అథానిలో స‌దాశివ అనే 55 ఏళ్ల వ్య‌క్తి గుండె సంబంధిత సమస్యతో బాధ‌ప‌డుతున్నాడు.. అయితే.. మూడు రోజుల క్రితం... ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు ఆయ‌న‌ను ఇంటిద‌గ్గ‌రే వ‌దిలి.. భార్య, కొడుకు, కూతురు వెళ్లారు.. వాళ్లు తిరిగి వ‌చ్చిన త‌ర్వాత సదాశివ ఎంత‌కీ తలుపు తెరవలేదు. చివ‌ర‌కు తలుపుబద్ధలు కొట్టి లోపల చూస్తే కుర్చీలో కూర్చొని ఉండగానే ప్రాణం పోయినట్టుగా గుర్తించి క‌న్నీరుమున్నీర‌య్యారు.. ఇక‌, క‌రోనాతోనే చ‌నిపోయాడ‌న్న అనుమానంతో చుట్టుప‌క్క‌ల‌వాళ్లు ఎవ్వ‌రూ ద‌గ్గ‌ర‌కు రాలేదు.. గురువారం నాడు త‌న భ‌ర్త అంత్యక్రియల కోసం సాయం చేయాలని... ఆ మ‌హిళ‌ ప్రాదేయపడ్డా ఎవరూ క‌నిక‌రించ‌లేదు.. క‌రోనా కాదు.. స‌హ‌జ‌మ‌ర‌ణం అని చెప్పినా సాయం చేయ‌డానికి ముందుకురాలేదు. దీంతో.. ఇక‌, చేసేది లేక కొడుకు స‌హాయంతో తోపుడు బండిపై భ‌ర్త‌ మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లింది భార్య‌.. చుట్టుప‌క్క‌ల‌వాళ్లు స‌హ‌క‌రించ‌క‌పోయినా.. వారి దుస్థితి చూసి చలించిపోయిన ఓ వ్య‌క్తి సాయంగా తోపుడు బండి నడిపించాడు. దహన సంస్కారాలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నాడు. తన భర్తకు ఇలా అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చినందుకు ఆమె గుండెలు పగిలేలా విలపించింది... ఇక‌.. కొన్ని ప్రాంతాల్లో భార్య‌, వారి సంతానం కూడా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డానికి ముందుకురాని ప‌రిస్థితి చూస్తూనే ఉన్నాం.