ఒక్కసారిగా సైలెంట్ అయిన అధికార పార్టీ ఎమ్మెల్యే ...

ఒక్కసారిగా సైలెంట్ అయిన అధికార పార్టీ ఎమ్మెల్యే ...

అధికార పార్టీలో ఉన్న ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇదే ఆ నియోజకవర్గంలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే ఎందుకు దూకుడు తగ్గించారో తెలుసుకుని రకరకాలుగా చర్చించుకుంటున్నారట. ఎవరా నాయకుడు? ఏమా సంగతి ఈ స్టోరీలో చూద్దాం. 

ఎమ్మెల్యే మార్కు పనితనం కనిపించడం లేదా? 

ప్రొద్దుటూరు. కడప జిల్లాలోనే కాదు రాయలసీమ ప్రాంతానికి ప్రముఖ వ్యాపార, వాణిజ్య కేంద్రం. 
రాజకీయంగా కూడా అదేస్థాయిలో ప్రాముఖ్యత కలిగిన నియెజకవర్గం. వైసీపీ నుంచి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉన్న ఆయన.. పార్టీ అధికారంలోకి వచ్చాకా.. ఏడాది నుంచి నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన మార్కు పనితనం కనిపించడం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. 

ఎమ్మెల్యే చెప్పినా పనులు కావడం లేదా?

పార్టీ పెద్దలు రాచమల్లుకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఒకటైతే.. సాధారణ ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఎమ్మెల్యేకు, అధిష్ఠానానికి మధ్య దూరం పెంచాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఎమ్మెల్యే ఏం చెప్పినా  పనులు జరగడం లేదని పార్టీలో కామెంట్స్‌ చేస్తున్నారట. ఇదే టైమ్‌లో స్థానిక ఎన్నికల ముందు నియోజకవర్గంలో అధికార వైసీపీలో మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. 

వరదరాజుల రెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం!

ప్రొద్దుటూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం టీడీపీలో ఉన్న వరదరాజులరెడ్డి.. వైఎస్‌ఆర్‌తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత కొంతకాలం జగన్‌తో ఉన్నా.. తర్వాత టీడీపీలో చేరి.. ప్రొద్దుటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ నిరాకరించడంతో ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత పట్టుసాధించేందుకు వరదరాజుల రెడ్డిని వైసీపీలో తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. దీనిని సిటింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. 

ప్రొద్దుటూరు వైసీపీలో ఆధిపత్య పోరు!

కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడటంతో ఆ వివాదం సద్దుమణిగింది. అయినప్పటికీ వరదరాజుల రెడ్డి వైసీపీలో చేరతారనే ప్రచారం ఇప్పటికీ ఉంది. అందువల్లే ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డిని పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ప్రొద్దుటూరు వైసీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారిని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది. బావమరిది బంగారురెడ్డికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో బంధువర్గాన్ని , సన్నిహితులనే ప్రోత్సహించారని చెబుతున్నారు. 

వరదరాజులరెడ్డితో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారా?

ప్రతిపక్ష పార్టీ ఉనికే లేనిచోట్ల అధికార పార్టీలో అంతర్గత విభేదాలు పార్టీని దెబ్బతీస్తున్నాయని వైసీపీలో చాలా మంది కామెంట్స్‌ చేస్తున్నారట. ఎమ్మెల్యే వైఖరి కారణంగానే పార్టీ అధిష్ఠానం వరదరాజులరెడ్డిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. ఆయనతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారట. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన వారంతా వరదరాజులరెడ్డి వర్గం నుంచి వచ్చిన వారే కావడంతో  పెద్దాయన వస్తే తమకు ఢోకా ఉండబోదనే అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారట. 

వైసీపీలోని ఓ వర్గం జైలుపాలు!

కొద్దిరోజుల క్రితం వైసీపీలో ఒకే సామాజికవర్గానికి చెందిన రెండు వర్గాలు ఆధిపత్యపోరులో భాగంగా ఘర్షణకు దిగడం, ఒక వర్గం జైలుపాలు కావడం పార్టీపై తీవ్ర ప్రభావం చూపాయట. అందుకే ఎమ్మెల్యేను కాదని వరదరాజులరెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అదే నిజమైతే ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి పరిస్థితి ఏంటో కాలమే చెప్పాలి.