ఆర్టీసీలో అశ్వత్థామరెడ్డి కథ కంచికి చేరినట్టేనా?

ఆర్టీసీలో అశ్వత్థామరెడ్డి కథ కంచికి చేరినట్టేనా?

TMU నేత అశ్వత్థామరెడ్డికి చెక్‌ పెట్టేందుకు రంగం సిద్ధమైందా? ఆయన అధిపత్యానికి చరమగీతం పాడతారా? దీనికి సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ వేగవంతమైందా? టీఎస్‌ ఆర్టీసీలో అసలేం జరుగుతోంది? 

అశ్వత్థామకు చివరి ఛాన్స్‌?

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో టీఎంయూకు కాలం చెల్లిందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇటీవల యూనియన్‌లో.. ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు కొత్త యూనియన్ ఆవిర్భావానికి దారి తీసేలా ఉన్నాయి. ఇదే సమయంలో TMU నేత అశ్వత్థామరెడ్డిని సర్వీసు నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ యాజమాన్యం నోటీసులు ఇవ్వడం ఆ హీట్‌ను మరింత పెంచింది. వివరణ ఇచ్చేందుకు అశ్వత్థామకు వారం రోజులు గడువిచ్చింది ఆర్టీసీ. ఇది చివరి ఛాన్స్‌. ఇందుకు సంబంధించిన నోటీసులను బస్‌ భవన్‌తోపాటు.. అశ్వాత్థామరెడ్డి పనిచేసే MGBS నోటీస్‌ బోర్డులోనూ ప్రదర్శించారు. 

బీజేపీతో అంటకాగడంపై  గుర్రు!

పేరుకు షోకాజ్ నోటీసే అయినా.. సర్వీసు నుంచి అశ్వత్థామరెడ్డిని తొలగించేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీనికితోడు ఆయన బీజేపీతో అంటకాగడంపై అధికారపార్టీ గుర్రుగా ఉందట. ఇప్పటికే టీఎంయూలో మరో నాయకత్వం తెర మీదకు వచ్చింది. కార్మిక సమస్యల పరిష్కారం పేరుతో మంత్రులను, ఉన్నతాధికారులతోపాటు ఎమ్మెల్సీ కవితను కూడా కలిసి వినతిపత్రాలు ఇచ్చి ప్రసన్నం చేసుకుంటోంది. ఈ పరిణామాలకు.. అశ్వత్థామరెడ్డి విషయంలో జరుగుతున్న విషయాలకు లింక్‌ పెడుతున్నారు. 

అశ్వత్థామరెడ్డి బీజేపీలో చేరిపోతారా? 

అయితే అశ్వత్థామరెడ్డి కూడా యాజమాన్యం ఎప్పుడు వేటు చేస్తే అప్పుడు అన్ని జిల్లాలు తిరిగి కార్మికులను ఏకం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తే.. ప్రభుత్వం కక్ష్య కట్టి తనను ఉద్యోగం నుంచి తొలగించిందని చెప్పేందుకు బలం చేకూరుతుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారట. ప్రస్తుతం ఆర్టీసీలో యూనియన్ల మనుగడ కష్టంగా మారి నాయకులు పునరాలోచనలో పడ్డారు. అశ్వత్థామరెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఎప్పటినుంచో బీజేపీతో ఆయనకు అనుబంధం ఉందని.. ఇప్పుడు ఉద్యోగం నుంచి తొలిగిస్తే కాషాయ కండువా కప్పుకొంటారని తెలుస్తోంది.

నిధుల విషయంలో కార్నర్‌ చేస్తారా?

యూనియన్ కార్యకలాపాలు కొనసాగించేందుకు కార్మికుల నుంచి వసూలు చేసిన చందాల వివరాలకు లెక్కలు లేవట. కోటిన్నరకు పైగా నిధులు... ఇతరత్రా విషయాలపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు టీఎంయూలోని మరోవర్గం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో అశ్వత్థామరెడ్డిని కార్నర్‌ చేస్తారని అనుకుంటున్నారు. మరి.. అశ్వత్థామరెడ్డిని ఆర్టీసీ నుంచి తొలగిస్తే కథ కంచికి చేరుతుందో.. కొత్త కథ మొదలవుతుందో చూడాలి.