నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు?

నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు?

నాగార్జున‌సాగ‌ర్‌ ఉపఎన్నిక బ‌రిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరు? ఇంకా ఎందుకు అభ్యర్థిని ప్రకటించలేదు? అధికారపార్టీ శిబిరంలో అనేక మంది పేర్లపై చర్చ జరుగుతున్నా ఎందుకు ఫైనల్‌ చేయడం లేదు? అక్కడి సమీకరణాలు ఏం చెబుతున్నాయి?  

అధికారపార్టీలో పూర్తికాని అభ్యర్థి వేట!

దుబ్బాక తర్వాత జరగబోతున్న నాగార్జునసాగర్‌ ఉపఎన్నికపై విపక్ష పార్టీలు దూకుడు పెంచితే.. అధికారపక్షం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల‌ న‌ర్సింహ‌య్య అనారోగ్యంతో మృతి చెంది దాదాపు మూడు నెల‌లు కావస్తున్నా అధికారపార్టీలో అభ్యర్థివేట పూర్తికాలేదు. సీఎం కేసియార్ బ‌హిరంగ స‌భ కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తి అయింది. ఆ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం అంతా ఎన్నిక‌ల  ప్రచారం మాదిరే సాగింది. పార్టీకి ఓటేయండి అని చెప్పారుగానీ అభ్యర్థి ఎవ‌ర‌నేది ప్రకటించలేదు.  నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్దరు ముగ్గురు నాయకులు టికెట్ ఆశిస్తున్నా వడపోతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

భగత్‌ కాకుండా టీఆర్‌ఎస్‌ ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోందా? 

నోముల న‌ర్సింహ‌య్య త‌న‌యుడు నోముల భ‌గ‌త్ త‌న‌కే  టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. త‌న తండ్రి ఉన్నప్పటి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో తనకు మంచి ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని ...న‌ర్సింహయ్యకు ఉన్న పేరు త‌న‌కు ఉపఎన్నికలో క‌లిసొస్తుంద‌ని చెబుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి బరిలో ఉంటే.. బీజేపీ కూడా బలమైన అభ్యర్థి వేటలో ఉంది. ఈ రెండు పార్టీలు అగ్రకుల నేత‌ల‌ను పోటీ పెట్టబోతున్నాయని.. బీసీనైన త‌న‌కు టికెట్‌ ఇస్తే క‌లిసొస్తుంద‌ని భగత్‌ చెబుతున్నారట. యాద‌వ సామాజివ‌ర్గం ఓట్లు ఇక్కడ ఎక్కువ‌ని.. అది కూడా త‌న‌కు ప్లస్ అవుతుంద‌ని వెల్లడిస్తున్నారట. అయితే న్యాయ‌వాది కూడా అయిన నోముల భ‌గ‌త్ అభ్యర్థిత్వంపై పెద్దగా ఆసక్తి చూప‌ని టీఆర్ఎస్ ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

కోటిరెడ్డి కోసం ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్న మంత్రి జగదీష్‌!

నోముల‌కు బంధువైన ఉస్మానియా యూనివ‌ర్సిటీ విద్యార్థి సంఘం నేత బాల‌రాజు యాద‌వ్ సైతం త‌న ప్రయ‌త్నాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎమ్మెల్యే క‌విత‌ను క‌లిసి టికెట్ ఇవ్వాల‌ని అడిగారు కూడా. అలాగే స్థానికంగా నియోజ‌క‌వ‌ర్గంలో  ఉంటున్న కోటిరెడ్డికి  టికెట్ కోసం మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ప్రయ‌త్నిస్తున్నారు. త‌న క్లాస్ మేట్ అయిన కోటిరెడ్డి ఉన్నవాళ్లలో బెస్ట్ అని  హైక‌మాండ్‌కు మంత్రి ప్రతిదిపాదించినట్లు స‌మాచారం. ఎమ్మెల్యేల  మ‌ద్దతును కూడా కోటిరెడ్డి కోసం కూడ‌గ‌డుతున్నట్టు తెలుస్తోంది. సీఎం దగ్గర ఈ మ‌ధ్య జ‌రిగిన  స‌మావేశంలోనూ అభ్యర్థిపై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. అయితే ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వలేదట.

సాగర్‌లో బలమైన నేత ఉండాలనే దిశగా అడుగులు!

ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డివైపు టీఆర్ఎస్ మొగ్గు క‌నిపిస్తోందట. స్థానికుడైన చిన్నపరెడ్డి అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిని  బలంగా డీకొడతారని అధికారపార్టీ అంచ‌నా వేస్తున్నట్టు సమాచారం. వ‌చ్చే ఏడాది చిన్నపరెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వీ కాలం పూర్తవుతుంది. మరోవైపు ఉపఎన్నిక ఉంది కదా అని ఏదో అభ్యర్థిని ప్రకటించేయకుండా.. భవిష్యత్‌లో ఇక్కడ టీఆర్‌ఎస్‌కు ఒక బలమైన నేతలు సిద్ధం చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే షెడ్యూల్ వ‌చ్చేలోపు అభ్యర్థిని ఫైన‌ల్ చేద్దామ‌ని సీఎం కేసియార్ సూచించిన‌ట్టు చెబున్నారు నేత‌లు.