అసలు తిరుపతిలో టీడీపీ ఉందా ?
ఎన్నడూ లేనంతంగా తిరుపతిలో భూ దందాలు, భూ ఆక్రమణలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సెగ ఎమ్మెల్యే భూమనకు తగలడంతో ఆయన ఓపెన్ అయ్యారు. భూ దందాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరి.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎందుకు మౌనంగా ఉంది. సొంత జిల్లాలో అంత జరుగుతున్నా చంద్రబాబు మాట్లాడటం లేదు. స్థానిక నేతలూ నోరు విప్పడం లేదు. ప్రస్తుతం దీనిపైనే జిల్లాలో చర్చ జరుగుతోంది.
2004 నుంచి తిరుపతిలో ఎక్కువైన భూ కబ్జాలు!
తిరుపతి ఓ ఆధ్యాత్మిక ప్రాంతం. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నివాసం ఉంటోన్న వారిలో ఎక్కువ మంది వలస వాసులే కావడంతో ఎవరి పనుల్లో వారు ఉంటారు. తిరుపతి చుట్టుపక్కల ఇనాం భూములు ఎక్కువ కావడంతో కబ్జాదారులకు వరంగా మారాయి. ఆ పార్టీ..ఈ పార్టీ అని కాదు.. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కూడా ఉండదు.. ఎవరు పవర్లో ఉన్నా కబ్జా రాయుళ్లదే రాజ్యం అన్నట్లు ఉంటుంది. 2004 నుంచి ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. గ్యాంగ్‌లు, రౌడీలతో ఎంట్రీ ఇచ్చి స్థలాలను ఆక్రమించుకోవడం.. కుదిరితే సెటిల్ చేయడం లేదంటే జెండా పాతేయడం అన్నట్లు ఉంటుంది వీరి వ్యవహారం.
రేణిగుంట రోడ్డులో రూ.20 కోట్ల విలువ చేసే స్థలం కబ్జా!
కొద్ది రోజులుగా తిరుపతిలో భూ ఆక్రమణల పర్వం జోరందుకుంది. ఎంతగా అంటే తన పేరు చెప్పి ఎవరైనా భూములు కబ్జాలు చేస్తే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్వయంగా ప్రకటన చేశారంటే పరిస్థితి ఈ స్థాయికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. రేణిగుంట రోడ్డులో 20 కోట్ల విలువచేసే స్థలంపై దృష్టి పెట్టిన ఓ గ్యాంగ్ గంగిరెడ్డి మనుషులమంటు ఆక్రమణకు ప్రయత్నించింది. 50 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న వారిపై పట్టపగలే దాడిచేసి ఆక్రమణ చేశారు. అలిపిరి పోలీసులను ఆశ్రయించినా స్పందన లేదన్నది బాధితుల ఆరోపణ. చివరకు మీడియా ద్వారా ఈ అంశం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. అయితే ఈ ఘటనతో తనకు సంబంధం లేదన్నారు గంగిరెడ్డి.
తిరుపతి భూ కబ్జాలపై మాట్లాడని టీడీపీ !
ఇలా విచ్చల విడిగా పెరిగిపోతున్న భూ కబ్జాలపై టీడీపీ తప్ప అన్ని ప్రతిపక్ష పార్టీలు దృష్టిపెట్టాయి. భూ కబ్జాలపై బీజేపీ ధర్నాలు చేస్తే... తిరుపతిని కాపాడాలని చివరకు కమ్యూనిస్ట్ పార్టీ టెంట్ కూడా వేసింది. కానీ.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కనుచూపు మేరలో కూడా కనిపించకుండా పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో మంగళకృష్ణ ఆక్రమించుకున్న స్థలం ఇదేనంటూ తిరుపతి లీలా మహల్ సర్కిల్లో చంద్రబాబు ఆరోపించారు. అలాంటి టీడీపీ అధినేతకు.. ఎన్నికల్లో ఓడించారని ప్రజల బాధపట్టలేదో ఏమో కానీ ప్రస్తుతం భూకబ్జా రగడపై మాట్లాడటం లేదని అనుకుంటున్నారు. టీడీపీ పోరాడడం లేదు.
పైగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ వైసీపీ మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు జరిగింది. భూమనపై టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ 700 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అంటే టీడీపీ తిరుపతిలో అంత స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉన్న టీడీపీ ప్రతిపక్ష పార్టీ అంటే ఎలా ఉండాలి. కానీ ఆ దాఖలు కనిపించడం లేదు. ఎందుకీ దుస్థితో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయినా లోకల్ లీడర్స్ అస్త్రసన్యాసం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటు హైకమాండ్ పెద్దలు.. ఇటు స్థానిక అగ్రనేతలే పట్టించుకోకపోవడంతో కేడర్ సైతం నిర్లిప్తతతో ఉందట. దీంతో తిరుపతిలో టీడీపీ ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)