దుబ్బాక ఉప ఎన్నికపై MIM ఎందుకు మౌనంగా ఉంది...?

దుబ్బాక ఉప ఎన్నికపై MIM ఎందుకు మౌనంగా ఉంది...?

దేశవ్యాప్తంగా ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్న MIM.. దుబ్బాక ఉపఎన్నిక సమయంలో ఎందుకు మౌనంగా ఉంది? దుబ్బాక ఫలితం వచ్చేసిన తర్వాత MIMపై జరుగుతున్న చర్చ ఏంటి? ఎందుకు అంతా MIMవైపు చూస్తున్నారు? లెట్స్‌ వాచ్‌!

దుబ్బాక ఉప ఎన్నిక.. ఎంఐఎంపై చర్చ!

దుబ్బాక ఉపఎన్నిక ఫలితంపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఓటమికి.. బీజేపీ విజయానికి దారితీసిన పరిస్థితులను ఎవరికివారుగా అంచనాలు వేసుకుంటున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చల్లోకి MIM పేరు కూడా వస్తోందట. ఉపఎన్నికలో MIM పోటీ చేయలేదు. కానీ ఆ పార్టీని జోడిస్తూ జరుగుతున్న చర్చే ఆసక్తిగా ఉందని సమాచారం. 

టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఎంఐఎం ఎందుకు ప్రకటన చేయలేదు?

దేశవ్యాప్తంగా ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్న MIM.. దుబ్బాక ఉప ఎన్నికపై ఎటువంటి వైఖరి తీసుకోలేదు. మౌనంగా ఉండిపోయింది. TRS, MIM మధ్య స్నేహం ఉంది. రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగా దుబ్బాకలో పోటీ చేయలేదు కానీ.. కనీసం TRSకు మద్దతు తెలియజేయాలని ఎందుకు పిలుపివ్వలేదనే చర్చ మొదలైంది. 

దుబ్బాకలో ముస్లిం ఓటర్లు 9వేల పైనే? 

దుబ్బాక నియోజకవర్గం ఎక్కువగా గ్రామీణ ప్రాంతం. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు  సుమారు 9 వేల వరకూ ఉంటారని ఓ అంచనా. MIMపట్ల వీరికి సానుభూతి ఉందనేది పార్టీలు భావిస్తుంటాయి. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తున్నా.. తన వైఖరి వెల్లడించకుండా MIM మౌనంగా ఉండిపోవడం వెనక కారణం ఏంటని చాలా మంది ఆరా తీస్తున్నారు. ఒకవేళ బయటకు తన అభిప్రాయం వెల్లడించకపోయినా.. టీఆర్‌ఎస్‌వైపు మొగ్గు చూపాలని తమ మద్దతుదారులకు సంకేతాలు పంపిన ఉదంతాలు గతంలో ఉన్నాయట. 

దుబ్బాకపై తటస్థం ఎందుకు?

దుబ్బాక ఉపఎన్నికలో MIM తన అనుచరులకు ఎలాంటి సంకేతాలు పంపలేదని సమాచారం. మౌనంగా ఉండిపోవడం.. తటస్థ వైఖరి అవలంభించడం ఎందుకోసమనే చర్చ జోరందుకుంది. ఆ సామాజికవర్గం ఓట్లు టీఆర్‌ఎస్‌కు కాకుండా ఎవరికి పడ్డాయన్నది ఆసక్తిగానే ఉంది. ఈ ఉపఎన్నికలో కేవలం వెయ్యి ఓట్ల  తేడాతోనే టీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో ఈ చర్చ     MIM మీదకు మళ్లింది. 

రఘునందన్‌రావు కోసమే మౌనమా? 

గతంలో కేసులు ఎదుర్కొన్న ఒవైసీ సోదరులకు లాయర్‌గా సేవలు అందించారు రఘునందన్‌రావు.  అప్పట్లో సంగారెడ్డి జైలులో ఉన్న ఒవైసీతో కేసు విషయమై పలుమార్లు కలిసి మాట్లాడారు.  ఆవిధంగా రఘనందన్‌రావు, ఒవైసీ సోదరుల మధ్య పరిచయం బలమైన స్నేహబంధంగా మారినట్టు చెబుతారు. రాజకీయంగా తాము వ్యతిరేకించే బీజేపీ తరఫున రఘునందన్‌రావు దుబ్బాక బరిలో ఉన్నా.. ఆయన కోసమే MIM మౌనంగా ఉండిపోయిందనేది కొందరి విశ్లేషణ. ఇది బీజేపీ అభ్యర్థికి అనుకూలించిందని అనుకుంటున్నారు. 

ఎంఐఎం ప్రకటన చేస్తే ఫలితం మరోలా ఉండేదా? 

ఇదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది. దుబ్బాక ఉపఎన్నికలో TRS.. MIM మద్దతు కోరిందా లేదా అన్న అంశంపై స్పష్టత లేదు. TRS మద్దతు కోరలేదని MIM మౌనంగా ఉందా.. లేక రఘునందన్‌రావుకు పరోక్షంగా సాయం చేసేందుకు తటస్థంగా ఉండిపోయారా అన్నది ఒవైసీ సోదరులే చెప్పాలి. కాకపోతే టీఆర్‌ఎస్‌కు మద్దతుగా MIM ఒక ప్రకటన చేసి ఉంటే ఇవాళ పరిస్థితి మరోలా ఉండేదనే చర్చ కూడా ఉంది. మొత్తానికి దుబ్బాకలో పోటీ చేసిన పార్టీలు ఎలా ఉన్నా.. పోటీకి దూరంగా ఉన్న MIMపై అందరి దృష్టీ మళ్లడం విశేషం.