ఒకప్పుడు స్పీడుగా ఉండే వైసీపీ నేత ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు...

ఒకప్పుడు స్పీడుగా ఉండే వైసీపీ నేత ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు...

ఒకప్పుడు జిల్లాలో ఆయన చెప్పిందే వేదం. ఎన్నికల సమయంలోనూ కీలకంగా వ్యవహరించారు. తీరా గెలిచాక సైలెంట్‌ అయ్యారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలు మనసుకు కష్టపెట్టాయో ఏమోగానీ అటు పార్టీకి.. ఇటు ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఇంతకీ ఆయనకు ఏమైంది? ఎవరా నాయకుడు?

నియోజకవర్గ ప్రజలకూ దూరంగా ఉంటున్నారా? 

ధర్మాన ప్రసాదరావు. ఒక్క సిక్కోలులోనే కాదు ఏపీలో పరిచయం అక్కర్లేని నేత. ఆరుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. జిల్లాలో అందరూ పెద్దాయన అని పిలుచుకునే ధర్మాన ప్రస్తుత తీరు అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకూ పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేవలం తన నియోజకవర్గ పరిధిలోని ప్రజలతో మాత్రమే టచ్‌లో ఉంటూ వచ్చారు ప్రసాదరావు. ఇప్పుడు  నియోజకవర్గ ప్రజలకు కూడా దూరంగా ఉంటున్నారట. 

అన్న కృష్ణదాస్‌తో దూరం పెరిగిందా? 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల్లోనూ జిల్లాలో వైసీపీ గెలుపుకోసం కీలకంగా పనిచేశారు. అంతా తానై నడిపించారు. అన్న ధర్మాన కృష్ణదాస్‌ వైసీపీలో సీనియర్‌ అయినప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి దిశానిర్దేశం చేసింది ప్రసాదరావే. వైసీపీ అధికారంలోకి రావడంతో ధర్మాన ప్రసాదరావుకు కేబినెట్‌లో  చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ.. కృష్ణదాస్‌ను మంత్రి పదవి వరించింది. అంతేకాదు.. ఆ తర్వాత అదే మంత్రి పదవి అన్నదమ్ముల మధ్య గ్యాప్‌ పెంచిందనే ప్రచారమూ నడిచింది. ప్రస్తుతం అందరికీ దూరంగా ఉంటున్న ప్రసాదరావు వ్యవహార శైలి చూస్తుంటే ఇదంతా వాస్తవమే అనుకునేలా కనిపించేది. 

జిల్లా విభజనపై ప్రసాదరావు కామెంట్స్‌ కలకలం!

తన నియోజకవర్గం శ్రీకాకుళంలో మంత్రి హోదాలో కృష్ణదాస్‌ పర్యటిస్తున్నా.. ప్రసాదరావు డుమ్మా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య జిల్లాల విభజనపై  తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టేశారు చిన్న ధర్మాన.  స్వపక్షంలోనే విపక్షంలా మాట్లాడారని అంతా చర్చించుకున్నారు. ఇది  వ్యక్తిగతంగా జిల్లాలో ఆయనకు ప్లస్ అయినప్పటికీ పార్టీపరంగా కొంత మైనస్‌ అయిందనే కామెంట్స్‌ వినిపించాయి. 

పార్టీలో గుర్తింపు రావడం లేదని కినుక!

పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజీనామాలతో ఖాళీ అయిన రెండు  కేబినెట్‌ బెర్త్‌లలో తనపేరు పరిశీలనలోకి తీసుకుంటారని అనుకున్నారట ప్రసాదరావు. కానీ.. అది జరగకపోగా.. తన శిష్యుల్లో ఒకరైన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజును మంత్రిని చేయడంతో షాక్‌ తిన్నారట. ఇదే సమయంలో అన్న కృష్ణదాస్‌ను ఉపముఖ్యమంత్రిని చేయడం కూడా  ధర్మానకు రుచించలేదని సమచారం. ఈ రెండు ఘటనలతో పార్టీలో తనకు సరైన గుర్తింపు రావడం లేదని కినుక వహించారట. 

ఇప్పుడు అవ్వదులే తర్వాత చూద్దాం అంటున్నారా? 

కరోనా సమయంలో క్యాంపు కార్యాలయానికే ప్రసాదరావు పరిమితమయ్యారు. అందరితో అంటీముట్టనట్టు ఉంటున్నారట. దీంతో ప్రసాదరావును చూసినవారు విస్తుపోతున్నారట. ఒకప్పుడు ఏ చిన్న కష్టం వచ్చినా ధర్మానతో చెప్పుకొంటే తీరిపోతుందని ప్రజలు భావించేవారు. ప్రస్తుతం శ్రీకాకుళం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ .. వాటిని ప్రస్తావించినా ఇప్పుడేమీ అవ్వదులే తర్వాత చూద్దాం అనేస్తున్నారట. గతంలో కనుసైగలతో పనులు చేసిపెట్టిన ప్రసాదరావు ఇలా మాట్లాడంపట్ల కేడర్‌ ఆశ్చర్యపోతోందట. ఆయన ఈయనేనా అని గుసగుసలాడుకుంటున్నారట.  మరి.. ధర్మాన ఎన్నాళ్లిలా మౌనంతో ఉంటారో చూడాలి.