కన్నా లక్ష్మీనారాయణ కొంపముంచిన టీడీపీ?

కన్నా లక్ష్మీనారాయణ కొంపముంచిన టీడీపీ?

కన్నాను ఎందుకు తప్పించారు? వీర్రాజుకు పగ్గాలివ్వడంలో ఉన్న లెక్కలేంటి? టీడీపీతో దోస్తీ ఆయన కొంపకు చేటు తెచ్చిందా? వర్గ నాయకుడే తప్ప పార్టీ నాయకుడు కాలేకపోయారా? కన్నా విషయంలో బీజేపీ అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకుందా? ఇప్పుడు ఏపీ బీజేపీ ఎవరికి దగ్గర?  

ఏపీలో హఠాత్తుగా అధ్యక్షుడి మార్పు!

అంతా కరోనా హడావిడిలో ఉంటే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చేశారు. దాదాపు ఏడాదిగా అధ్యక్షుడు మార్పుపై ఊహాగానాలు జరిగి రకరకాల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీ.. ఇక్కడ పరిస్థితులను సమీక్షించి.. పార్టీ నేతల పనితీరును, అర్హులను, అర్హతలను పరిశీలించి వెళ్లింది.  అప్పట్లోనే ఇవాళ రేపట్లోనే అన్నట్లుగా  కొత్త అధ్యక్షుడిపై కసరత్తు జరిగింది. ఇంతలో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు రావడం.. కరోనా విజృంభించడంతో ఆ ప్రక్రియ పక్కకు పోయింది. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా అధ్యక్షుడిని మార్చేస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుని సోము వీర్రాజును నియమించింది. 

అంతా కన్నా స్వయంకృతాపరాధమా అన్న ప్రచారం!

నాడు తెలంగాణ అధ్యక్షుడిని మార్చింది కానీ.. ఏపీ అధ్యక్షుడి విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణను తప్పింది వీర్రాజుకు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. కన్నాను మార్చడం అవసరమని భావించారా లేక.. వీర్రాజే ఉండాలని, సమర్ధుడని నిర్ణయానికి వచ్చిందనే రీతిలో ఈ మార్పు జరిగింది.  బయట మాత్రం అంతా కన్నా స్వయకృతాపరాధమే అన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీకి బీజేపీని  తోక పార్టీలా మార్చేశారని కన్నా విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా వైసీపీ మీదకు ఏ స్థాయిలో దూకుడుగా వెళ్లారో.. వైసీపీ కూడా అదే దూకుడుగా కన్నా మీదకు వెళ్లింది. వాళ్లు పార్టీగా కంటే.. కన్నాను వ్యక్తిగతంగానే టార్గెట్‌ చేశారు. 

ఒకానొక సమయంలో వైసీపీతో కన్నా బేరసారాలు!

ప్రత్యేకంగా కన్నా విషయానికి వచ్చే సరికి.. ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీ ఆయనకు ఆఫర్‌ ఇచ్చింది. ఆ సమయానికి కన్నా బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి అనూహ్యంగా కమలం తీర్థం పుచ్చుకున్నారు. వస్తూ వస్తూనే అధ్యక్ష పదవిని ఆశించారు. అయితే పదవి రావడంలో జాప్యమైంది. దాంతో బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించి.. వైసీపీతో బేరం పెట్టుకున్నారు. ఆ పార్టీలో చేరిపోవడానికి రంగం కూడా సిద్ధం చేసుకున్నారు. తెల్లారితే వైసీపీలో చేరిపోతారు అనగా.. అమిత్‌షా రంగంలోకి దిగి ఫోన్‌ చేసి ఆపారు. కన్నాకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. వాస్తవానికి కన్నా పుట్టు కాంగ్రెస్‌.  ఆ పార్టీలోనే ఎదిగారు. పెరిగారు. మంత్రి అయ్యారు. సంఘ్‌ నేపథ్యం లేదు. ఆ విధంగా బయట నుంచి వచ్చిన వ్యక్తిని ఫస్ట్‌ టైమ్‌ ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేశారు. 

 టీడీపీ చేసిన ఆరోపణలే కన్నా కూడా చేశారా?

కన్నా కాపు నాయకుడిగా.. ఆయన ఉంటే ఆ వర్గం ఓట్లు గంపగుత్తగా వస్తాయని బీజేపీ లెక్కలు వేసుకుంది.  అయితే ఎన్నికల్లో అవేమీ పనిచేయలేదు. బీజేపీకి ఒక్క సీటూ రాలేదు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. జగన్‌కు ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి అని అనుకుంటే.. బీజేపీ రాజకీయంగా మిన్నకుండి పోయింది. రాజధాని, కరోనా, అధికార విభజన అంశాలలో టీడీపీ ఏ ఆరోపణలైతే చేస్తోందో... సేమ్‌ టు సేమ్‌ కన్నా కూడా అవే ఆరోపణలు చేయడం..  సీఎం జగన్‌కు తరచూ లేఖలు రాయడం వైసీపీకి మంటెక్కించింది. అందుకే కన్నా ఎన్నికల ఫండ్‌ మింగేశారని సాయిరెడ్డి ఆరోపించారు.

కన్నా రూ.30 కోట్ల ఎన్నికల ఫండ్‌ కొట్టేశారని సాయిరెడ్డి ఆరోపణ!

దాదాపు 30 కోట్ల ఎన్నికల ఫండ్‌ను కన్నా, పురేందశ్వరి కొట్టేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు సాయిరెడ్డి. ఆ విషయం బీజేపీకి తెలుసో లేదో తెలియదు కానీ.. సాయిరెడ్డి ఆరోపణలు చూసి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. గతంలో ఏ పార్టీ అధ్యక్షుడిపైనా రాని  ఆరోపణలు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిజమేనా అని అనుకున్నారు. చంద్రబాబు దగ్గర కూడా కన్నా డబ్బులు కొట్టేశారన్నది సాయిరెడ్డి అండ్‌ కో ఆరోపణ. ఈ అంశంపై సవాళ్లు, ప్రతిసవాళ్లు నడిచాయి. కాణిపాకంలో ప్రమాణం చేద్దామా అనేంత వరకూ వెళ్లింది. ఢిల్లీలో బీజేపీతో ఉన్న సాన్నిహిత్యం, సాంగత్యం కోరుకుంటున్న వైసీపీ.. రాష్ట్రంలో మాత్రం బీజేపీ నేతలను ఎవరినీ విడిచిపెట్టడం లేదు. కన్నాతోపాటు ఆ మధ్య బీజేపీలో చేరిన సుజనా, సీఎం రమేష్‌, పురందేశ్వరీని ఈ బ్యాచ్‌ మొత్తం వైసీపీ ఏకిపారేసింది. 

వైసీపీ నుంచి కొంత సమాచారం వెళ్లిన మీదటే కన్నాను తప్పించారా?

ఈ ఆరోపణలను హైకమాండ్‌ నిర్దారించుకుందో.. నిజమని నమ్మిందో లేక ఇక టైమ్‌ అయిపోయింది కదా అని కొత్తాయన్ని పెట్టుకుందామనుకుందో కన్నాను తప్పించింది. ఈ ఆరోపణలపై బీజేపీ జాతీయ నాయకుడు రాంమాధవ్‌కు నివేదిక వెళ్లిందంటారు. ఎన్నికల  సమయంలో పార్టీ కోశాధికారి రాజీనామా చేశారు. ఈ పరిణామాలను పరిశీలించి.. వైసీపీ వైపు నుంచి కొంత సమాచారం వెళ్లిన మీదటనే కన్నాను అర్థాంతరంగా తప్పించారు అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా కన్నా మరో టర్మ్‌ పొడిగింపు వస్తుందని ఆశించారు. అయితే చడీ చప్పుడు లేకుండా సోము వీర్రాజు వైపు అధిష్ఠానం మొగ్గు చూపింది. 

బీజేపీలో కూడా వర్గ నాయకుడిగానే కన్నా ఉండిపోయారా?

పైగా కన్నా వ్యవహార శైలి కూడా పార్టీకి ఇబ్బందికరంగా ఉందని టాక్‌. అందరినీ కలుపుకొనేతత్వం లేదనే ఆరోపణ ఉంది.  కాంగ్రెస్‌లో ఉండగా.. ముఠా రాజకీయాల్లో.. వర్గంలో ఉండే కన్నా.. ఇక్కడ కూడా అలా వర్గ నాయకుడిగానే  ఉన్నరు తప్పించి అందరికీ ఆమోదయోగ్యమైన అధ్యక్షుడిగా  ఉండలేకపోయారని పార్టీలో అంతర్గతంగా కొంతకాలంగా చర్చ జరుగుతోందట. కన్నా వేరు.. మిగతా పార్టీ వేరు అన్నట్లుగా ముక్కలైందట. 

కన్నా కొనసాగింపు వాంఛనీయం కాదని నిర్ణయించారా?

కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చినా.. ఆ స్థాయిలో పార్టీల ఏపీలో రిఫ్లెక్ట్‌ కాలేదు. పాతవారు అంతా ఒకటి.. కొత్తగా వచ్చినవారంతా మరొకటిగా మారిపోయింది. పార్టీ మొత్తం ఏకతాటిపై ఉన్న ఫీలింగ్‌ కలిగించలేకపోయారు. ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత ఏ విధంగా కూడా కన్నా కొనసాగింపు వాంఛనీయం కాదనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కన్నాను తప్పించడం.. వీర్రాజుకు బాధ్యతలు అప్పగించడంలో కూడా పొలిటికల్‌ లెక్కలు వేసుకున్నట్లుందని అభిప్రాయపడుతున్నారు.

ముందు అనుకున్న లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర బీసీ సామాజికవర్గానికి చెందిన కరుడుగట్టిన సంఘ్‌ కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్సీ మాధవ్‌కు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. రాయలసీమ నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్లు వచ్చాయి. మాణిక్యాలరావు అసక్తత వ్యక్తం చేశారు. వీర్రాజుకు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. 

కన్నాను తప్పిస్తే కాపులకు దూరం అవుతారన్న ఫీలింగ్‌తో మళ్లీ కాపులకే ఇవ్వడం ఓ లెక్క అయితే..  సంఘ్‌ నేపథ్యం మరొకటి. పార్టీ తప్ప మరేమీ పట్టని సోము వీర్రాజుకు పట్టం కట్టేశారు. దూకుడిగా ఉండే సోము వీర్రాజు అయితే ఆమోదయోగ్యంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చిన తర్వాత కన్నా స్థానాన్ని ఆయనతో భర్తీ చేశారు.