కోవిడ్ 19 పుట్టుక, వ్యాప్తి... ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

కోవిడ్ 19 పుట్టుక, వ్యాప్తి... ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది అంటే వెంటనే అంతా చైనా పేరు చెప్పేస్తారు.. చైనాలో పుట్టిన కోవిడ్ ప్రపంచం వెన్నులో వణుకుపుట్టించింది.. ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపేసింది.. ఉద్యోగాల, ఉపాధి అవకాశాల అంతు చూసింది.. ఇక, ఇది కరోనా వైరస్ కాదు.. చైనా వైరస్ అనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో.. కోవిడ్ ఎక్కడ పుట్టింది అని తేల్చేందుకు డ్రాగన్ కంట్రీలో పర్యటిస్తోంది అంతర్జాతీయ నిపుణుల బృందం. ఇప్పటికే పలు సమీక్షలు, మీటింగ్, విజిట్లు చేసిన ఆ టీమ్.. కోవిడ్‌పై ఓ అంచనాకు వచ్చింది. 

అంతా భావిస్తున్నట్టుగా, ప్రచారం జరిగినట్టుగా.. వుహాన్ ప్రయోగశాలలో ఈ వైరస్ పుట్టిందన్నవాదన నిజమే అనేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. చైనా-ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా చేపట్టిన వుహాన్ పర్యటన ముగిసిన సందర్భంగా.. ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ మిషన్ చీఫ్ పిటర్ బెన్ ఎమ్బారెక్.. కోవిడ్ పుట్టుక, వ్యాప్తిపై నిర్ధారణకు వచ్చేందుకు మరింత అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపారు. కోవిడ్ వైరస్ మొదట జంతువుల్లో పుట్టి.. ఆ తర్వాత మనుషులకు పాకి ఉంటుందనే అంచనాకు వచ్చారు. అయితే... జంతువుల నుంచి ఎలా ఈ వైరస్ మనుషులకు సోకింది అనే విషయంలో మాత్రం ఓ అంచనాకు రాలేకపోయారు నిపుణులు. కాగా, కరోనా వైరస్ జన్వువు గబ్బిలాల్లో ఉన్నందున.. గబ్బిలాల మూలంగానే ఇది వ్యాప్తి చెందినట్టు కొన్ని ప్రాథమిక అధ్యయనాలు సూచించిన సంగతి తెలిసిందే.