నాగార్జునసాగర్‌లో కొలిక్కిరాని బీజేపీ అభ్యర్థి!
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోందా? జానారెడ్డిని ఢీకొట్టే సామర్థ్యం ఉన్న నేతను బరిలో దించేందుకు వేస్తున్న ప్రణాళిక ఏంటి? ఈదఫా కొత్త ముఖమే పోటీ చేస్తుందా? కమలనాథులు మధ్య జరుగుతోన్న చర్చ ఏంటి?
సాగర్‌లో వ్యూహం బెడిసి కొడితే ఇబ్బందేనా?
దుబ్బాక ఉపఎన్నికలో గెలిచినా.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బలం పుంజుకున్నా.. నాగార్జునసాగర్ బైఎలక్షన్లో భిన్నమైన లైన్లో వెళ్లాలని బీజేపీ నాయకులు నిర్ణయించారట. రాష్ట్రంలో నెలకొన్న అనుకూల వాతావరణాన్ని కొనసాగించడానికి ఏం చేయాలన్నదానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సాగర్‌లో వ్యూహం ఏ మాత్రం బెడిసి కొట్టినా అది ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారట పార్టీ నాయకులు. క్షేత్రస్థాయిలో ఎన్నికల కార్యాచరణ ప్రారంభించినా.. అభ్యర్థి విషయంలో వెనకాముందు ఆడటానికి కారణం అదేనని చర్చ జరుగుతోంది.
ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు!
నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం ఇంఛార్జ్‌ను కూడా నియమించింది పార్టీ. అక్కడి పరిస్థితపై ఒకటి రెండు సర్వేలు చేయించింది. పార్టీపట్ల సానుకూల వాతావరణం ఉన్నా.. అభ్యర్థుల విషయంలోనే పాజిటివ్ ఒపీనియన్‌కు రాలేకపోతున్నారట. 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన కంకణాల నివేదిత రెడ్డి మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. తనకే టికెట్ వస్తుందన్న ఆశతో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగిన అంజయ్య యాదవ్ సైతం కాషాయగూటికి చేరి.. పోటీకి ఆసక్తితో ఉన్నారు. ఆయన కూడా ప్రచారం ప్రారంభించేశారు.
ఈ దఫా కొత్తవారిని బరిలో దించాలనే యోచన?
ఇలా ఇద్దరు నేతలు పోటాపోటీగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండటంతో పార్టీకి నష్టం జరుగుతుందని భావించి నివేదిత, అంజయ్యలతో బీజేపీ నేతలు మీటింగ్ పెట్టి సర్దిచెప్పారట. కానీ.. వెనక్కి తగ్గడానికి ఎవరూ ఒప్పుకోలేదని సమాచారం. నివేదిత, అంజయ్యలలో ఎవరో ఒకరిని అభ్యర్థిగా బరిలో దింపినా జానారెడ్డిపై తేలిపోతారని బీజేపీ నేతలు భావిస్తున్నారట. 2018లో నివేదితకు 3 వేల లోపు ఓట్లు వచ్చాయి. 2014లో అంజయ్యకు 27వేల ఓట్లు వచ్చాయి. అందుకే ఈ దఫా కొత్తవారిని బరిలో దించితే ఎలా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట కమలనాథులు.
బీజేపీకి కొత్తముఖం దొరుకుతుందా?
నాగార్జునసాగర్‌లో బలమైన జానారెడ్డిని ఢీకొట్టాలంటే.. ఆ స్థాయిలో ఆర్థిక అంగబలం కలిగిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారట బీజేపీ నేతలు. ప్రస్తుతం ఆ వేటలోనే పార్టీ నేతలు ఉన్నారట. మరి... ఆ కొత్త ముఖం బీజేపీకి దొరికిందా? దొరుకుతుందా? అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. అలాంటప్పుడు ఉన్నవాళ్లతో సరిపెట్టుకుంటుందా? వారిలో బెటర్ ఆప్షన్ ఎవరికి ఇస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. మరి.. సాగర్‌లో ఎలాంటి వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తుందో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)