తెలంగాణకు కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరు? 

 తెలంగాణకు కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరు? 

రాష్ట్ర ప్రభుత్వంలో అదో ముఖ్యమైన విభాగం. ప్రభుత్వంలో భాగమైనా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన శాఖ అది. ఇందులో ముఖ్యమైన పోస్టు ఖాళీ అయి నెలలు గడుస్తుండగా.. మరో పదవీ కూడా ఖాళీ అయ్యింది. దీంతో రెండు పదవులకు కొత్త వారిని నియమిస్తారా? లేక పదవీ విరమణ పొందిన వారినే మరికొంత కాలం పొడిగిస్తారా అనేది ఇప్పుడు ఆశాఖలో చర్చనీయాంశంగా మారింది.
 
ఏప్రిల్‌లోనే ముగిసిన ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం!

తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి పదవీకాలం ముగిసి మూడు నెలలు దాటింది. రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్​ఎన్నికలు సమీపిస్తున్నందున కొత్త కమిషనర్ నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఐఏఎస్​అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన నాగిరెడ్డిని..  తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో ఐదేళ్ల పదవీకాలం పూర్తైంది. 
 
కమిషన్‌ కార్యదర్శి అశోక్‌ కుమార్‌ పదవీ కాలం కూడా !

ప్రధాన కార్యదర్శి లేదా ఆపై హోదాలో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా నియమించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బాధ్యతలు ఎవరికి కట్టబెడతారన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో కార్యదర్శిగా ఉన్న అశోక్ కుమార్ పదవీ కాలం జులై 31తో ముగిసింది. ముఖ్యమైన రెండు పోస్టులు ఖాళీ కావడంతో కొత్తవారు ఎవరొస్తారా అని ఎదురుచూస్తున్నారు ఆశాఖ అధికారులు.
 
జనవరిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు?

ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో పూర్తి కానుంది. కొత్త పాలకమండలి కోసం జనవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతోపాటు  గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు గడువులోగా ఎన్నికలు నిర్వహించాలంటే ముందస్తు ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. అందుకే కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
రేస్‌లో పలువురు రిటైర్డ్‌, సీనియర్‌ ఐఏఎస్‌లు!

ప్రస్తుతం కోవిడ్‌ సమస్య తీవ్రంగా ఉంది. పరిస్థితులు సద్దుమణిగితే కానీ.. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. కొత్త కమిషనర్‌ నియామకం కోసం పంచాయతీరాజ్‌ శాఖ ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి  ఫైల్‌ పంపింది. దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త ఎన్నికల  కమిషనర్‌ రేస్‌లో పలువురు రిటైర్డ్‌ IAS అధికారులు ఉన్నారు. వీరిలో పార్థసారథి, బీపీ ఆచార్య, రంజీవ్‌ ఆచార్య పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్‌ ఐఏఎస్‌లు అజయ్‌ మిశ్రా, సీఎంవో అధికారి నర్సింగరావు, జలవనరుల శాఖ సలహాదారు ఎస్కే జోషి సేవలు వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రభుత్వం నిర్ణయం ఏంటో.. కొత్తవారు వస్తారో.. పాతవారినే మరికొంత కాలం కొనసాగిస్తారో చూడాలి.