తుంగతుర్తి కాంగ్రెస్ వర్గపోరుతో లాభపడింది ఎవరు?

తుంగతుర్తి కాంగ్రెస్ వర్గపోరుతో లాభపడింది ఎవరు?

కాంగ్రెస్ నేతల వర్గపోరుతో తుంగతుర్తిలో లాభపడుతోంది ఎవరు? బేజారైన కేడర్‌ పక్కచూపులు చూస్తోందా? టైమ్‌ బాగుందని ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలైందా? ఇంతకీ తుంగతుర్తిలో ఏం జరుగుతోంది?

మాజీ మంత్రి దామోదర్‌రెడ్డిపై పోలీసులు ఫిర్యాదు చేసిన అద్దంకి వర్గం!

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నియోజకవర్గ ఇంచార్జ్‌ అద్దంకి దయాకర్‌, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. నియోజకవర్గంలో తనను తిరగనివ్వడం లేదని అద్దంకి వర్గం  పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, సీఎల్పీ, AICC నేతలకు దామోదర్‌రెడ్డిపై ఫిర్యాదు చేసింది.  కాంగ్రెస్‌ పార్టీలో ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే.. ఈ వివాదం మరో టర్న్‌ తీసుకుంది. తమను దామోదర్‌రెడ్డి ఫోన్లో బెదిరించారని ఆరోపిస్తూ.. ఆడియో టేపులను తీసుకెళ్లి హైదరాబాద్‌ బేగంబజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదో ఇద్దరి మధ్య సయోధ్య చేద్దామని పార్టీ నేతలు భావిస్తే.. సమస్య కాస్తా ముదురుపాకాన పడి కేసులు పెట్టుకోవడం వరకూ వెళ్లింది. దీంతో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుందామని అనుకున్నవాళ్లు వెనకడుగు వేస్తున్నారట. 

కాంగ్రెస్‌ కేడర్‌కు గాలం వేస్తోన్న టీఆర్‌ఎస్‌!

ఇదే సమయంలో తుంగతుర్తిలో కాంగ్రెస్‌ కేడర్‌ సైతం రెండు వర్గాలుగా చీలిపోయిందట. మొన్నటి ఎన్నికల్లో అద్దంకి దయాకర్‌పై గెలిచిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌  ఇదే మంచి తరుణంగా భావించి ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీశారని జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి జగదీష్‌రెడ్డి ఆశీసులతో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేతలను కారెక్కిచ్చేస్తున్నారట.  జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సైతం  కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతూ మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో గులాబీ కండువా కప్పేసుకున్నారు. 

కేడర్‌తో మాట్లాడని దయాకర్‌, దామోదర్‌రెడ్డి!

ఆనకట్ట గేట్లు ఎత్తినట్లుగా కాంగ్రెస్‌ కేడర్‌ టీఆర్‌ఎస్‌ చేరిపోవడానికి ఆసక్తి చూపిస్తుండటంతో తుంగతుర్తిలో  హస్తంపార్టీ ఖాళీ కావడం ఖాయమనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.  ఇలా పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని  ఆపేందుకు దయాకర్‌ కానీ, దామోదర్‌రెడ్డి కానీ  ప్రయత్నించడం లేదని టాక్‌. మా నేతలే సరిగా ఉంటే మాకు ఈ గతి పట్టేదా అంటూ విమర్శలు కూడా చేస్తున్నారట. మొత్తానికి తుంగతుర్తిలో ప్రత్యర్థి పార్టీ వీక్‌నెస్‌పై అదను చూసి అధికార పార్టీ దెబ్బకొట్టడంతో నియోజకవర్గ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.