టీడీపీ ఎంపీ గల్లా ఏమైపోయారు?

టీడీపీ ఎంపీ గల్లా ఏమైపోయారు?

ఓవైపు రాజీనామా సవాళ్లు.. మరోవైపు డెడ్‌లైన్లు. రాజధాని వికేంద్రీకరణ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. మరి.. రాజధాని ప్రాంతానికి  ఎంపీగా గెలిచిన ఆయన ఏం చేస్తున్నారు?  ఇంత హడావిడిలో ఎందుకు నల్లపూసయ్యారు? 
 
అమరావతిపై రచ్చ జరుగుతుంటే జయదేవ్‌ ఎక్కడున్నారు?

అప్పట్లో మిస్టర్‌ మోడీ అంటూ.. లోక్‌సభలో గర్జించి అందరి దృష్టిని ఆకర్షించారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌. అలాంటి నాయకుడికి ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు అమరావతిపై రాజకీయ రచ్చ జరుగుతున్న సమయంలో పత్తా లేకుండా పోయారు. అమరావతి ప్రాంతం ఆయన లోక్‌సభ పరిధిలోకే వస్తుంది. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య రాజీనామాలు, డెడ్‌లైన్లతో రాజకీయం హోరెత్తుతోంది. అయినా గల్లా జయదేవ్‌ ఒక్క మాట మాట్లాడింది లేదు. ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదని అంటున్నారు. కనీసం ఫోన్‌కు కూడా అందుబాటులో లేరని అమరావతి ప్రాంత టీడీపీ నేతలే విరుచుకుపడే పరిస్థితి ఉంది.
 
గుంటూరు ఆఫీసులో అందుబాటులో ఉంటే సరిపోతుందా?

ఏపీలో టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వారిలో గల్లా జయదేవ్‌, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు. మిగతా ఇద్దరు పరిస్థితి ఎలా ఉన్నా.. సమస్య ఉన్న ప్రాంతానికి ఎంపీగా  ప్రాతినిధ్యం వహిస్తూ అస్సలు పట్టించుకోకపోవడం ఏంటని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కరోనా వల్ల ఆయన జనాల మధ్యకు రావడం లేదని అనుకున్నా.. భౌతికదూరం పాటిస్తూ స్థానికులు, స్థానిక నేతలు ఆందోళనలు చేయడం లేదా అని నిలదీస్తున్నారట. రోజూ రాజధాని గ్రామాలకు రావాల్సిన పనిలేదు. కనీసం గుంటూరులోని ఆయన కార్యాలయంలో అందుబాటులో ఉన్నా.. ఉద్యమం చేస్తున్నవారికి అండగా ఉన్నారన్న ఫీలింగ్‌ కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. 
 
ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో జయదేవ్‌కు గాయాలు!

ఆ మధ్య చలో అసెంబ్లీకి  రైతులు పిలిపిచ్చినప్పుడు జయదేవ్‌ యాక్టివ్‌గా పాల్గొన్నారు. రాజధాని భూముల మీదుగా డొంకరోడ్లలో నడుచుకుంటూ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేయబోతే కార్యకర్తలు అడ్డుకోవడం.. పెనుగులాడటం జరిగింది. ఈ ఘటనలో గల్లాకు కూడా గాయాలయ్యాయి. ఎంపీగా గెలిచిన తర్వాత  గల్లా తీసుకున్న ఏకైక రిస్క్‌ ఉద్యమం ఇదేనని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.  చంద్రబాబు ముందు చొక్కా విప్పి మరీ గాయాలు చూపించారట. 
 
పోలీస్‌ దెబ్బలకు జడిశారేమోనని టీడీపీలో జోకులు!

వాస్తవానికి గల్లా జయదేవ్‌ సాఫ్ట్ పొలిటీషియన్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఎంపీ గాయలయ్యే విధంగా ఉద్యమించడంపై చంద్రబాబే ఆశ్చర్యపోయారని అంటారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఎంపీ మళ్లీ కనిపించ లేదు. కరోనా టైమ్‌ కావడంతో ఒకటిరెండుసార్లు ఆన్‌లైన్‌లో అందరికీ హాయ్‌ చెప్పారు. మరి.. ఇప్పుడేమయ్యరో తెలియడం లేదట. బహుశా పోలీస్‌ దెబ్బలకు జడిశారో ఏమో కానీ.. మళ్లీ అడ్రస్‌ లేరని టీడీపీ నాయకులే కామెంట్స్‌ చేస్తున్నారట. ఒకరినొకరు జోకులు వేసుకుంటున్నారట. అమరావతిలో రాజధాని నిర్మాణాలు, డిజైన్ల రూపకల్పన, విదేశీ పర్యటనల్లో గల్లా జయదేవ్‌ కీలక పాత్ర పోషించారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయినా.. క్రాస్‌ ఓటింగ్‌ పుణ్యమా అని గట్టెక్కేశారు. ఇప్పుడు అమరావతి గట్టుపై కనిపించడమే మానేశారు.