అయోధ్యలో ఎలాంటి ఆలయం నిర్మాణం? విశిష్టతలు ఏమిటి?

అయోధ్యలో ఎలాంటి ఆలయం నిర్మాణం? విశిష్టతలు ఏమిటి?

హిందూ సంస్కృతి, రామాయణం గొప్పదనం, రాముడి వైశిష్ట్యం చాటేలా అయోధ్యలో భవ్య రామందిరం నిర్మాణం దిశగా అడుగులు పడటమే మిగిలింది. అయోధ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విశ్వహిందూ పరిషత్‌ 30 ఏళ్ల క్రితమే.. రెండు అంతస్తులుగా మందిరం నిర్మించాలని ప్లాన్‌ వేసింది. ఆ మేరకు నిర్మాణ పనులను 1993లో రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించింది. దశాబ్దాలుగా అయోధ్య వివాదం కోర్టుల్లో నలుగుతున్నా... ఆలయ నిర్మాణ పనులు మాత్రం ఆగలేదు. ఆలయ నమూనా ఎలా ఉండబోతుందో.. అయోధ్య కరసేవపురంలో కర్రతో చేసిన ఆలయ నమూనాను ఒక గాజు పెట్టెలో పెట్టి ఉంచారు. నభూతో నభవిష్యత్‌ అన్నట్లుగా ఆలయం ఉండాలని భవిస్తున్నందున.. నిర్మాణంలో మొత్తం 1.75 లక్షల క్యూబిక్‌ మీటర్ల రాయిని వినియోగిస్తున్నారు. అయోధ్యలోని కరసేవపురం, రాజస్థాన్‌లోని  పిండ్వార్‌లో రాళ్ల కటింగ్‌, మలిచే పనులు నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయ్‌. కేవలం ఆలయం మాత్రమే కట్టి వదిలేయకుండా దీని పరిధిలో ఒక వేద పాఠశాల, సాంస్కృతిక శిక్షణ కేంద్రం కూడా నిర్మించబోతున్నారు. 

రామ మందిరం రెండో అంతస్తు పైన ఆలయ శిఖరం ఉంటుంది. మందిరం పొడవు 268 మీటర్లు, వెడల్పు 140మీటర్లు, ఎత్తు 128 మీటర్లు. మొత్తం 212 స్తంభాలుంటాయి. ఇవి కూడా రెండు రకాలుగా ఉండి.. ఒక్కోదానిపై 16 బొమ్మలు చెక్కబోతున్నారు. ఈ స్తంభాల ఎత్తులోనూ వ్యత్యాసాలున్నాయి. కొన్ని 16.5 అడుగుల ఎత్తుంటే.. మరికొన్ని 14.5 అడుగుల ఎత్తులో ఉంటాయి. కింది అంతస్తులో పెద్ద స్తంభాలతోపాటు మధ్యస్తంగా ఉండేవాటిని వాడతారు. పైఅంతస్తులో 14.5 అడుగుల ఎత్తున్న స్తంభాలను ఉపయోగిస్తారు. ప్రతీ ఫ్లోర్‌లో 106 స్తంభాలుంటాయి. వాటిపై లతలు, పూలు, దేవుళ్ల బొమ్మలు చెక్కుతారు. రాళ్ల ఎంపికలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది రామజన్మభూమి న్యాస్‌. స్తంభాల కోసం తెలుపు, పింక్‌ రంగులోని శాండ్‌ స్టోన్‌ను ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అందరి దృష్టీ అయోధ్యలోని కరసేవపురంపై నెలకొంది. ఎందుకంటే 29 ఏళ్లుగా ఆలయ నిర్మాణానికి పనులు ఇక్కడే జరుగుతున్నాయి. ఈ ప్రాంతం రామజన్మభూమికి ఒక కిలోమీటరు, వీహెచ్‌పీ ఆఫీస్‌కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రాళ్ల కటింగ్‌, శిల్పాల చెక్కడం, రాళ్లను శుభ్రం చేయడం తదితర పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం 12 మందే పనిచేస్తున్నా.. ఒకానొక సమయంలో రోజూ 200 మంది వరకూ పనుల్లో ఉన్నారు. ఈపనుల్లో ఉన్నవారంతా రాజస్థాన్‌, గుజరాత్‌ నుంచి వచ్చిన శిల్పులు. ప్రతీరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకూ ఇక్కడ పనులు సాగుతున్నాయి.

వాస్తవానికి  అయోధ్యలో రామమందిరం నిర్మాణం పనులు 1989లో మొదలయ్యాయి. విశ్వహిందూ పరిషత్‌, ఇతర హిందూ ధార్మిక సంస్థల ఈ అంశంలో చొరవ తీసుకున్నాయి. 1989 ఏడాది చివరిలో రాజస్థాన్‌ నుంచి 2 ట్రక్కుల్లో మార్బుల్ రాళ్లను అయోధ్యకు తీసుకొచ్చారు. ఆ తర్వాత 1991లో ఆలయ నిర్మాణంపై  స్పష్టమైన ప్రకటన చేసింది విశ్వహిందూ పరిషత్‌. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ సమీపంలోని బాన్సిపహార్‌ నుంచి గ్రానైట్, మార్బుల్‌, పాలరాయిని తెప్పించింది. రామమందిరం నిర్మాణంలో జాతిని భాగస్వామ్యం చేసేందుకు రామ శిలల పేరుతో.. శ్రీరాముడు పేరు చెక్కిన, రాసిన ఇటుకలు, ఇతర సామాగ్రిని తరలించారు. ఇలా 29 ఏళ్లుగా సాగుతున్న పనులవల్ల రామాలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌కు కావాల్సిన వాటిల్లో 70 శాతం వరకూ సిద్ధమయ్యాయి. రోజుకు 250 మంది శిల్పులు ఏకధాటిగా పనిచేస్తే ఒకటి రెండు నెలల్లో తొలి ఫ్లోర్‌ పనులు మొదలు పెట్టొచ్చనేది ఈ వర్క్స్‌ను పర్యవేక్షిస్తున్న వారి మాట. ప్రస్తుతం సగటునా 12 మంది పనిచేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు కోసం మూడు రోజులుగా పనులు ఆపేశారు. ఇప్పుడా పనులు వేగం పుంజుకోబోతున్నాయి. సుప్రీంకోర్టు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో..  అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఎన్నాళ్లలో పూర్తవుతుందనేది ప్రశ్న. 2023లో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. నిర్మాణానికి అవసరమైన ముడిసరుకు చాలా వరకూ సిద్ధమై ఉంది. వన్స్‌ పనులు ప్రారంభమైతే నాలుగేళ్లలో మందిర నిర్మాణం పూర్తి చేయవచ్చనేది కొందరి వాదన.