గ్రేటర్ లో టీడీపీ వ్యూహం ఏంటి? ప్రచారానికి లోకేష్, బాలయ్య వస్తారా?

గ్రేటర్ లో టీడీపీ వ్యూహం ఏంటి? ప్రచారానికి లోకేష్, బాలయ్య వస్తారా?

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేస్తామన్న టీడీపీ వ్యూహం ఏంటి? పార్టీ తరఫున ప్రచారానికి వచ్చేవారు ఎవరు? తెలంగాణలో పార్టీని బతికించుకోవడం కోసం చంద్రబాబు, లోకేష్‌, బాలయ్య చొరవ తీసుకుంటారా? ప్రచారానికి వస్తారా? తెలుగు తమ్ముళ్ల మధ్య జరుగుతున్న చర్చ ఏంటి? 

గ్రేటర్‌ ప్రచారానికి బాలయ్య వస్తారా? 

ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందంటే.. ప్రచారానికి వచ్చే వాళ్లలో పార్టీ అధినేత చంద్రబాబు ఉంటారు. అంతా తానై నడిపిస్తారు. తర్వాతి స్థానంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వస్తారు.  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నగారా మోగిన తర్వాత వీరిద్దరూ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా? తక్కువ సమయంలో ఎన్ని ప్రాంతాలు కవర్‌ చేస్తారు? అన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది.  ఇటీవల పార్టీ కమిటీలలో చోటు దక్కించుకుని.. టీడీపీ కార్యకలాపాలలో చురుకుగా ఉంటున్న బాలకృష్ణ సైతం గ్రేటర్‌ ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్న ఉత్కంఠ తెలుగు తమ్ముళ్లలో ఉందట. 

నందమూరి సుహాసిని ప్రచారం చేస్తారా? 

గత GHMC ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిపి పోటీ చేశాయి. అప్పుడు చంద్రబాబే టీడీపీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని సిటీలో సుడిగాలి పర్యటన చేశారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు కారెక్కేశారు. ఇంకొకరు పార్టీలో ఉన్నారు అంటే ఉన్నారు అనుకోవాలి. ఇటీవలే తెలంగాణ టీడీపీ రాష్ట్రకమిటీని ప్రకటించారు. నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ కుమార్తె సుహసినిని కమిటీలోకి తీసుకుని ఉపాధ్యక్షురాలిని చేశారు. ఆమెతోపాటు రాష్ట్ర కమిటీ మొత్తం GHMCపై ఫోకస్‌ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 

మామా అల్లుళ్లు ప్రచారం చేస్తే నేతల్లో ఊపు వస్తుందా? 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కనీసం పరువు కాపాడుకుంటే రాష్ట్రంలో పార్టీకి ఊపిరి పోసినట్టు అవుతుందని  టీడీపీ నాయకులు భావిస్తున్నారట. అందుకే చంద్రబాబు, లోకేష్‌తోపాటు బాలకృష్ణ కూడా ప్రచారానికి వస్తారని లెక్కలు వేసుకుంటున్నారు. పైగా బాలయ్య వస్తే పార్టీ శ్రేణులకు ఉత్సాహం వస్తుందని చెబుతున్నారు నాయకులు. నగరంలో మామా అల్లుళ్లు ప్రచారం చేస్తే రాష్ట్ర నాయకత్వానికి కూడా కొత్త ఊపు వస్తుందని అనుకుంటున్నారు. 

గ్రేటర్‌లో జీరో నుంచి ప్రయాణం..!? 

ఒకప్పుడు టీడీపీ మేయర్‌ స్థానాన్ని గెలుచుకుంది. నగరంలో కాంగ్రెస్‌, టీడీపీ నువ్వా నేనా అన్నట్టు ఉండేవి. టీఆర్‌ఎస్‌ బలం పుంజుకున్న తర్వాత కూడా టీడీపీ కేడర్‌ అదేవిధంగా పోరాటం చేసింది. కానీ.. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు.. పరిణామాలు మారిపోయాయి. కిందటి ఎన్నికల్లో టీడీపీ ఒక్క కార్పొరేటర్‌నే గెలుచుకుంది. తర్వాత ఆ కార్పొరేటర్‌ కూడా దూరమయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే గ్రేటర్‌లో టీడీపీ ప్రయాణం జీరో నుంచి మొదలుపెడుతున్నట్టే భావించాలి. ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ పార్టీల మధ్య నేనున్నాను అని ఉనికి చాటుకోవడం టీడీపీకి సవాలే. అందుకే బాలకృష్ణ, లోకేష్‌లు కూడా ప్రచారానికి వస్తారని అనుకుంటున్నారు. 

ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారి ఓట్లపై గురి!

గ్రేటర్‌లో టీడీపీ దృష్టి అంతా ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారి ప్రాంతాలపై ఉందని చెబుతున్నారు. ఒకవేళ బాలకృష్ణ, లోకేష్‌లు ప్రచారానికి వస్తే.. ఆయా ప్రాంతాలకే పరిమితం అవుతారని పార్టీలో చర్చ జరుగుతోంది. అక్కడ బలమైన అభ్యర్థులను బరిలో దించితే కొంత ప్రయోజనం ఉండొచ్చని లెక్కలు వేసుకుంటున్నారట. మరి.. టీడీపీ గ్రేటర్‌ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.