టీటీడీ వివాదంలో అసలు నిజానిజాలేంటి ?

టీటీడీ వివాదంలో అసలు నిజానిజాలేంటి ?

నిరర్థక ఆస్తుల్ని విక్రయించాలని  టీటీడీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అమ్మకాల ద్వారా వంద కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని  టీటీడీ బడ్జెట్లోనే ప్రతిపాదించినా అప్పుడు రాని అభ్యంతరాలు... ఇప్పుడు భూములు అమ్మాలన్న నిర్ణయం రాగానే వస్తున్నాయి. భక్తులు సమర్పించిన ఆస్తుల్ని ఎలా విక్రయిస్తారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే వాస్తవానికి తిరుమల శ్రీవారికి నగదు, ఆభరణాలతో పాటు భూములు కూడా కానుకగా సమర్పిస్తుంటారు భక్తులు. ప్రస్తుతం టీటీడీ అధీనంలో ఉత్తరాఖండ్‌లో 15 ఎకరాలు, తమిళనాట 170 ఎకరాలు, తెలంగాణలో 188 ఎకరాలు, తిరుపతిలో 3 వేల ఎకరాలు ఉన్నాయి.

ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాల్లోనూ 5 వేల ఎకరాలకు పైగా స్థలాలు ఉన్నాయి. 70 వేల కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాలకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్‌ చేసింది టీటీడీ.  అయితే శ్రీవారికి భక్తులు సమర్పించిన ఆస్తుల్ని అమ్మడానికి, లీజుకు ఇవ్వడానికి టీటీడీ పాలకమండలికి అధికారం ఉంది. 1970 నుంచే నిరర్ధక ఆస్తుల్ని విక్రయిస్తోంది కూడా. 2014 వరకు 374 నిరర్ధక ఆస్తుల్ని అమ్మితే 6 కోట్ల 90 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. 2002లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోని నిరర్ధక భూముల్ని విక్రయించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

అదే సమయంలో  టీటీడీ ఏపీలో 27 స్థలాలు, తమిళనాడులో 10, కర్నాటకలో 4, తెలంగాణ ప్రాంతంలో ఓ స్థలాన్ని అమ్మింది. 2015 జూలైలో ఉపయోగం లేని ఆస్తుల్ని గుర్తించేందుకు  టీటీడీ పాలకమండలి ఓ సబ్‌కమిటీని నియమించింది. దేశవ్యాప్తంగా 53 స్థలాల్ని నిరర్థకమైనవిగా గుర్తించిన సబ్‌కమిటీ వాటిని విక్రయించాల్సిందిగా 2016 జనవరిలో  టీటీడీకి సూచించింది. వీటిలో ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో 17, పట్టణ ప్రాంతాల్లో 9 స్థలాలు తమిళనాట 23 స్థలాలు ఉన్నాయి. తమిళనాడులోనే మరో మూడు స్థలాల అమ్మకంపై మరోసారి పరిశీలన చేయాలని సబ్‌కమిటీ సూచించాక ఓ స్థలానికి సంబంధించి కోర్టులో వివాదం నడుస్తుండటంతో టీటీడీ వెనక్కి తగ్గింది.

53 స్థలాలకు సంబంధించిన మార్కెట్ విలువను, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విలువను లెక్కగట్టి... టెండర్ ధరను  టీటీడీ అప్పట్లో ఖరారు చేసింది. చిత్తూరు జిల్లాలో 5 స్థలాలు, పశ్చిమగోదావరిలో 3 శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒక్కోటీ... కడప, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండేసి స్థలాలతో పాటు రంగారెడ్డి జిల్లాలో 3, బెంగళూరులో ఒకటి, మహారాష్ట్రలోని నాందేడ్‌లో 2... ఒడిశాలోని కోరాపుట్‌లో ఒకటి, పాండిచ్చేరిలో ఒకటి, తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో 3, కాంచీపురం జిల్లాలో 3, తిరువళ్లూరు జిల్లాలో 3, వేలూరు జిల్లాలో 7... కోయంబత్తూరు, నాగపట్నం జిల్లాల్లో ఒక్కోటీ, తిరువణ్నామలై జిల్లాలో 2... తిరుచ్చిరాపల్లి, తిరుచ్చి, ధర్మపురి జిల్లాల్లో ఒక్కో స్థలం విక్రయించాలని నిర్ణయించింది.

ఏపీలోని గ్రామీణ ప్రాంత స్థలాలను జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో... పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్థలాల్ని MSTS, విశాఖపట్నం ఆధ్వర్యంలో విక్రయించాలని... మిగతా వాటిని  టీటీడీ ఆధ్వర్యంలో టీమ్‌లు ఏర్పాటు చేసి అమ్మాలని భావించింది. ప్రాపర్టీ సెల్ AEO ఆధ్వర్యంలో ఒక టీమ్‌, తహసీల్దార్ ఆధ్వర్యంలో మరో టీమ్‌ని ఏర్పాటు చేసింది. స్థలాల అమ్మకం ద్వారా 23 కోట్ల 92 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేయగా... తీర్మానం తర్వాత ప్రక్రియ ఆగిపోయింది. కొత్త పాలకమండలి బాధ్యతలు చేపట్టాక... ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

స్థలాల పరిరక్షణ  టీటీడీకి ఇబ్బందిగా మారుతుందని, వాటి ద్వారా ఉపయోగం లేకపోగా నిర్వహణ భారంగా మారుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. అందుకే అమ్మేసి వచ్చిన డబ్బును డిపాజిట్‌ చేయాలని పాలకమండలి నిర్ణయించింది. రిషికేష్‌లోని 1.2 ఎకరాల స్థలం అమ్మితే 20 కోట్లు రావచ్చని అంచనా వేసిన  టీటీడీ... ఆ ఆదాయంతో అక్కడే భక్తుల సౌకర్యం కోసం నిర్మాణాలు చేపట్టాలని భావించింది. భూముల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను  టీటీడీ వేగవంతం చేసింది. తమిళనాడులో 23 స్థలాల్ని టెండర్‌ ప్రక్రియ ద్వారా విక్రయించేందుకు రెండు టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తైతే... కోటీ 50 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని  టీటీడీ భావిస్తోంది. భూముల అమ్మకానికి సంబంధించిన ఉత్తర్వుల్ని ఏప్రిల్‌ 30నే జారీ చేసింది.