గ్రేటర్ ఎన్నికల్లో జనసేన, వైసీపీ ప్రభావం ఎంత ?

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన, వైసీపీ ప్రభావం ఎంత ?

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ఆసక్తిగా మారబోతున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పోటీ ఒక ఎత్తు అయితే.. టీడీపీ, జనసేన సైతం బరిలో దిగుతున్నాయి. వైసీపీ కూడా కదనోత్సాహంతో ఉంది. కాకపోతే  ఆ మూడు పార్టీల వల్ల ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అన్న చర్చ ఊపందుకుంది. 

2016లో టీడీపీకి ఒక్క కార్పొరేటరే గెలిచారు!

150 డివిజన్లు.. అరడజనకు పైగా పార్టీలు. అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్‌ కీలకం కావడంతో పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. అన్ని డివిజన్లలో సింగిల్‌గా పోటీ చేస్తామని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. చంద్రబాబు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. 2016 GHMC ఎన్నికల్లో టీడీపీకి ఒక్క కార్పొరేటరే గెలిచారు. ఇప్పుడు ఆ ఒక్కటైనా నిలబెట్టుకుంటారా లేక ఏ మేరకు ఓట్లు చీల్చుతారు అన్నది ఆసక్తిగా మారింది. 

పోటీకి సై అంటోన్న జనసేన!

ఇదే సమయంలో  GHMC ఎన్నికలకు జనసేన సమాయత్తం అవుతోంది. పార్టీ నాయకులతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కష్టపడేవారికి ప్రాధాన్యం ఉంటుందని  చెప్పారు. 150 డివిజన్లలో దాదాపు 40 డివిజన్లలో పోటీ చేయాలనే ఆసక్తితో జనసేన ఉందట.  గ్రేటర్‌లోని కొన్ని ప్రాంతాల్లో జనసేనకు బలమైన కేడర్‌ ఉందని.. తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారట. 

బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? 

ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. తెలంగాణలో ఆ మేరకు పొత్తు లేదు. GHMC ఎన్నికల్లో జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేస్తాయా లేక పొత్తు పెట్టుకుంటాయా అన్నది తేలాల్సి ఉంది. ఏదైనా ఫటాఫట్‌ తేల్చాల్సిందే. నామినేషన్ల దాఖలుకుకానీ, ప్రచారానికి కానీ పెద్దగా సమయం లేదు. వాయువేగంతో పొత్తు ఖరారు చేసుకున్నా ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్నది స్పష్టం కావాలి. ఒకవే కలిసి పోటీ చేసినా.. వీడిగా బరిలో దిగినా జనసేన వల్ల ఎవరికి మేలు చేకూరుతుంది.. ఎవరికి నష్టం వాటిల్లుతుందన్న చర్చ మొదలైంది. 

గ్రేటర్‌లో పోటీకి తెలంగాణ వైసీపీ నేతల ఒత్తిడి!

ఇక వైసీపీ విషయానికి వస్తే.. ఏపీలో ప్రభుత్వంలో ఉంది. 2014లో ఒక ఎంపీతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు తెలంగాణలో వైసీపీ నుంచి గెలిచినా తర్వాత వారంతా టీఆర్‌ఎస్‌లో కలిసిపోయారు. 2018 అసెంబ్లీ,  2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ పోటీ చేయలేదు. 2016 GHMC ఎన్నికల బరిలోనూ దిగలేదు. ఇప్పుడు మాత్రం పోటీ చేద్దామని తెలంగాణలోని వైసీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారట.  ఇదే విషయమై మాట్లాడేందుకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ దగ్గరకు ఓ బృందం వెళ్తోందట. 

ఎస్‌ఈసీ సమావేశానికి వైసీపీ ప్రతినిధులు హాజరు!

GHMC ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇటీవల గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యారు. తమ పార్టీ తరఫున సూచనలు అందజేశారు. దీంతో GHMC ఎన్నికల్లో వైసీపీ వ్యూహం ఏంటన్నది ఆసక్తిగా మారింది. వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాత్రం పోటీకి ఒప్పుకోవాలని పార్టీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అలాగే వైసీపీని జాతీయ పార్టీగా నాయకులు చెబుతున్నారు. అంటే ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో చెప్పుకోతగ్గ  ప్రజాప్రతినిధులు, ఎన్నికల్లో తగినన్ని ఓట్లు పొంది ఉండాలి.  ఆ నిబంధనల మేరకైనా వైసీపీ పోటీ చేసేందుకు  సీఎం జగన్‌ సమ్మతించాలని కోరుతున్నారట. అయితే తెలంగాణ సీఎంతో ఏపీ సీఎం జగన్‌కు సత్ససంబంధాలే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వైసీపీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.