గుడ్‌ మార్నింగ్‌కు గుడ్‌బై చెప్పిన మంత్రి వేణు!

గుడ్‌ మార్నింగ్‌కు గుడ్‌బై చెప్పిన మంత్రి వేణు!

మంత్రి పదవి చేపట్టగానే గుడ్‌ మార్నింగ్‌ రాజమండ్రి అంటూ కొత్త స్లోగన్‌ ఇచ్చారు. ముచ్చటగా మూడు డివిజన్లలో తిరిగి.. 3 నెలలుగా కనిపించకుండా పోయారు. గుడ్‌ మార్నింగ్‌కు మంత్రి ఇంత తొందరగా ఎందుకు గుడ్‌ బై చెప్పారా అని జనం.. పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

మొదటివారం ఉత్సాహంగా గుడ్‌ మార్నింగ్‌ రాజమండ్రి!

రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పాగా వేయడానికి పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది  వైసీపీ. ఈ వ్యూహంలో భాగంగా సెప్టెంబర్‌ నెలలో గుడ్‌ మార్నింగ్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. పనిలో పనిగా లోకల్‌గా పార్టీ బలోపేతం కూడా ఆయన భుజనాకెత్తుకున్నారు. వారంలో రెండు రోజులు ఉదయాన్నే రాజమండ్రి వచ్చి స్థానికంగా ఉన్న డివిజన్లలో పర్యటించేలా ప్లాన్ వేసుకున్నారు. మొదటి వారం ఉత్సాహంగానే సాగింది. తర్వాత ఏమైందో ఏమో కానీ గుడ్‌ మార్నింగ్‌కు గుడ్‌బై చెప్పేశారు మంత్రి. 

నాయకుల మధ్య సమన్వయం లేదా? 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రిలో వైసీపీకి పట్టు చిక్కలేదు. నాయకుల మధ్య సమన్వయ లోపం వల్ల 30 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. అందుకే రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలిచి తీరాలని అనుకుంటోంది అధికార పార్టీ. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా స్థానిక వైసీపీ నాయకులు గుణపాఠం నేర్వలేదట. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. అందుకే వారిని సమన్వయ పరిచే బాధ్యతను.. పార్టీని గెలిపించే పనిని తన మీద వేసుకున్నారట మంత్రి వేణు. 

మంత్రి వెంట డివిజన్లలో నడిచిన ఎమ్మెల్యే రాజా!

రామచంద్రపురంలో నిర్వహించిన తరహాలోనే రాజమండ్రిలో గుడ్‌ మార్నింగ్‌ అని ప్రజలకు చేరువై.. నాయకుల్లో ఉత్సాహం తీసుకురావాలని అనుకున్నారట మంత్రి వేణు. అయితే మంత్రి ఎంత ప్రయత్నించినా  పార్టీలోని వర్గాలు దారికి రావడం లేదట. దాంతో మంత్రి తన ప్రోగ్రామ్‌కు ఎండ్‌కార్డ్‌ వేశారని చెవులు కొరుక్కుంటున్నారు. మంత్రి డివిజన్లలో పర్యటించిన సమయంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఒక్కరే వెంట నడిచారు. స్థానిక ఎంపీ మార్గాని భరత్‌ ఎందుకో దూరంగా ఉన్నారు. పైగా.. మంత్రికి పోటీగా శుభోదయం పేరుతో మరో కార్యక్రమానికి ప్లాన్‌ చేశారట ఎంపీ భరత్‌. దీనికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ వస్తారని ప్రచారం చేశారు. ధర్మాన రాకపోవడంతో ఆ కార్యక్రమం చివరి నిమిషంలో రద్దయింది. అదే సమయంలో మంత్రి వేణుకు కరోనా అని తేలడంతో పనులకు బ్రేక్‌లు పడ్డాయి. 

యువనేతల వైరంలో ఇరుక్కుపోతానని ఆందోళన?

మంత్రి వేణు ప్రస్తుతం కోలుకున్నారు. పలు కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. కానీ.. రాజమండ్రిలో ప్రారంభించి వదిలేసిన గుడ్‌ మార్నింగ్‌ ఈవెంట్‌ను మాత్రం తిరిగి మొదలు పెడతారో లేదో తెలియడం లేదట. రాజమండ్రి వైసీపీలో ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య నెలకొన్న వైరంలో తాను ఇరుక్కుపోతానని అనుకుంటున్నారో ఏమో మంత్రి ఆ మాట ఎత్తడం లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి.. రాజమండ్రిలో వేణుగానం పనిచేయకపోతే.. పార్టీ పెద్దలు చొరవ తీసుకుని చక్కదిద్దుతారో లేదో చూడాలి.