వీకెండ్ వచ్చిందంటే వణికిపోతున్న రాజకీయ నాయకులు !

వీకెండ్ వచ్చిందంటే వణికిపోతున్న రాజకీయ నాయకులు !

వీకెండ్ వస్తుందంటే జనం రిలాక్స్ అవుతారు. వారం అంతా పడ్డ మెంటల్ టెన్షన్ నుంచి ఉపశమనం పొందుతారు. కానీ, అక్కడ పొలిటీషియన్లకు శనివారం వస్తుంటే చాలు నిద్రపట్టడం లేదు. తెల్లారితే ఎలాంటి కబురు వస్తుందోననే ఆందోళనతో నలిగిపోతున్నారు. ఇంతగా కలవరపడాల్సిన అవసరం ఏంటి!? అక్కడ ఏం జరుగుతోంది!?

గత మూడు నెలలుగా విశాఖలో స్పెషల్‌ డ్రైవ్‌!

విశాఖ నగరంలో రాజకీయ నాయకులకు శనివారం టెన్షన్ పట్టుకుంది. వారం అంతా ఒక లెక్క ఆ ఒక్కరోజు మరో లెక్క అన్నట్టు గడపాల్సి వస్తోంది. ఇంతగా కలవరపడ్డానికిగల అసలు కారణం గడచిన కొద్దివారాలుగా ప్రభుత్వం ఇస్తున్న షాకే. విశాఖజిల్లాలో భూ ఆక్రమణలను ఉపేక్షించరాదని ప్రభుత్వం ధృడ నిశ్చియంతో ఉంది. గత మూడు నెలలుగా రెవెన్యూ యంత్రంగం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. వందల కోట్ల రూపాయలు విలువైన సర్కార్ ఆస్తులను కాపాడేందుకు చర్యలు ప్రారంభించింది.

కూల్చివేతలకు శనివారంను ఎంచుకోవడంపైనే చర్చ!

అక్రమాలు నిర్ధారణ అయితే ఎవ్వరినీ వదలి పెట్టేది లేదని హెచ్చరిస్తున్న సర్కార్ ఇందుకు అనుగుణంగానే కూల్చివేతలు పెంచింది. గతంలో సామాన్యులను కొట్టి పెద్దలను వదిలేస్తున్నారనే విమర్శలు ఉండేవి. ఇప్పుడు రాజకీయ ఆరోపణలు పక్కనపెట్టి ఆక్రమణలు చేసింది ఎవరైనా ఒకటే పద్ధతి ఉంటుందనే సంకేతాలు పంపుతున్నారు అధికారులు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ కూల్చివేతలకు శనివారంను ఎంచుకోవడం చర్చ నీయాంశంగా మారింది.

కబ్జాల విలువ రూ.800కోట్లుగా అంచనా వేస్తోన్న అధికారులు?

నెలరోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద్ సత్యనారాయణ ఇంటి కాంపౌండ్ వాల్.. కాలువను ఆక్రమించి కట్టేశారని చెబుతూ దానిని కూలగొట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. దానిపై ఉన్న న్యాయపరమైన వ్యవహారాలతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత వారం మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటిని ఆనుకుని సుమారు మూడు కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలం కబ్జా చేశారంటూ అక్కడి కట్టడాలను  తొలగించడంలో హైడ్రామా నడిచింది. ఆ తరవాత వారం ఆంధ్రాయూనివర్సిటీ దగ్గర ఉన్న షాపులు సమూహాన్ని తీసివేశారు. ఆ మరుసటి వారం గీతం యూనియువర్శిటి భూములను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 800కోట్లని అంచనా వేస్తున్నారు అధికారులు. 

కోర్టులను ఆశ్రయించకుండా ఉండేందుకే శనివారం ఆపరేషన్‌!

ఈ వ్యవహారాలపై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా... అధికార, విపక్షాలకు చెందిన నాయకుల అక్రమాల లెక్కయితే పక్కాగా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రతీవారం క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఈ దిశలో ఈ శనివారం ఎవరి వంతు వస్తోందోనని చర్చ రాజకీయవర్గాల్లో జోరందుకుంది. అక్రమాలకు పాల్పడిన వారు కోర్టులను ఆశ్రయించకుండా ఉండేందుకే ఈ విధంగా చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. పైగా వీకెండ్‌ను ఎంచుకోవడానికి సిబ్బంది లభ్యత, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటమే కారణమని చెబుతున్నారు అధికారులు. కేవలం టీడీపీ వారి అక్రమాలు బయటపెట్టడం కక్షసాధింపు చర్య అన్న విమర్శలు వినిపిస్తున్నతరుణంలో ఈ వారం రూటు మారుస్తారో లేక ఈ వారం బ్రేక్‌ ఇస్తారో చూడాలి.