మోడీకి అన్ని తలుపులు మూసేశాం

మోడీకి అన్ని తలుపులు మూసేశాం

మోడీ ఆలోచనా విధానాన్ని కాంగ్రెస్ నేలమట్టం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 'మా పార్టీ రైతులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించింది. మేం న్యాయ్ పథకాన్ని ప్రవేశపెట్టాం. మా పని మేం చేశాం. ఇక మిగతాది దేశ ప్రజలు నిర్ణయిస్తారు. ఐదేళ్ల క్రితం మోడీ వచ్చినపుడు ఆయనకు మంచి అవకాశం లభించింది. నిరుద్యోగ సవాల్ ను ఎదుర్కొంటే చూడాలని కోరుకున్నాను. కానీ ఆయన వాస్తవ దృశ్యాన్ని విస్మరించారని' చెప్పారు. ఇప్పటికీ రాఫెల్ ఒప్పందంపై తనతో చర్చకు రావాలన్న తన సవాల్ ను ప్రధానమంత్రి ఎందుకు స్వీకరించరని ప్రశ్నించారు.

ఎన్నికల పొత్తులు, కూటమిపై వివరిస్తూ ' కాంగ్రెస్ దృక్కోణం నుంచి ఉత్తరప్రదేశ్ లో పార్టీ ఆలోచనా విధానాన్ని విస్తృతం చేయాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ లో మా స్థానం కోసం పోరాడాల్సి వచ్చింది. బీజేపీ ఓటమి మొదటి ప్రాధాన్యత, కాంగ్రెస్ ఆలోచనా విధానం రెండో ప్రాధాన్యత, శాసనసభ ఎన్నికలు మూడో ప్రాధాన్యత. రెండేళ్ల నుంచి వ్యూహాత్మకంగా పనిచేస్తూ వచ్చాం. మోడీ తెరవగలిగిన తలుపులను ఓ పద్ధతి ప్రకారం మూసేస్తూ వచ్చాం. ఆయన తలుపులు 90 శాతం మేం మూసేశాం. మిగతా 10 శాతం ఆయనే మూసుకున్నారు. బీజేపీతో మేం పోరాడాం. మోడీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఈ దేశ వ్యవస్థలను రక్షించాం' అని తెలిపారు.

ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఏ గ్రేడ్ పాత్ర పోషించదని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనుభవజ్ఞులను విస్మరించబోనని చెబుతూ 'నేను నరేంద్ర మోడీని కాను. అనుభవాన్ని విస్మరించను. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ల అనుభవంతో కాంగ్రెస్ లాభపడుతుంది. ప్రధాని మోడీ మళ్లీ ఏదో ఒక 'దేశం దృష్టి మరల్చే' పని చేస్తారు. కానీ దేశం దృష్టి మరల్చుకోదని' అన్నారు.