దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి వెళ్తున్నారా? ఇది తెలుసుకోండి..!

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి వెళ్తున్నారా? ఇది తెలుసుకోండి..!

హైదరాబాద్‌ ఖ్యాతిని మరింత ప్రకాశింపజేసేలా దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది.. ఆసియాలోనే పెద్దదైన అద్భుతమైన కేబుల్ వంతెనను హైదరాబాద్ ప్రజలకు అంకితం చేశారు.. రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై నిర్మించిన ఆ కేబుల్‌ బ్రిడ్జిని కేంద్రమంత్రి జీ. కిషన్‌రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో దుర్గం చెరువుపై నాలుగు లేన్లతో నిర్మించిన ఈ కేబుల్ వంతెనతో జూబ్లీహిల్స్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మధ్య దూరంతోపాటు, ట్రాఫిక్‌ తగ్గిపోనుంది అంటున్నారు అధికారులు. అయితే, కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో.. పర్యాటకుల తాకిడి పెరిగిపోయింది.. వేలాది మంది కొత్త బ్రిడ్జిని చూసేందుకు తరలివస్తున్నారు. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు.. నేటి నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం మాత్రమే సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. 

మరోవైపు.. కేబుల్ బ్రిడ్జిపై ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో సింఫోనీ బ్యాండ్ నిర్వహించనున్నారు.. లైవ్ బ్యాండ్ ప్రదర్శనకు ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు అధికారులు. .నార్తన్ బార్డర్‌లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు, జీహెచ్ఎంసీ శానిటేషన్ కరోనా వారియర్ల సేవలకు సంఘీభావంగా బ్యాండ్ ప్రదర్శన జరగనుంది.. 45 నిమిషాల పాటు ప్రదర్శన నిర్వహించనున్నారు.. వందేమాతరంతో ప్రారంభించి పలు దేశ భక్తి, భారతీయ, పాశ్చాత్య గీతాలు, మరియు సంగీతాన్ని ప్రదర్శించి “జయ హో” తో ముగింపు పలకబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం.