రాజధానిపై చంద్రబాబును వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు?

రాజధానిపై చంద్రబాబును వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు?

మాజీలు సై అంటున్నారు. సిటింగ్‌లు మాత్రం సైలెంట్‌ అయ్యారు. అధికార పక్షం, ప్రతిపక్షం అన్నీ చూసేసి.. ఇప్పుడు ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. వద్దనలేక వదులుకోలేక అడకత్తెరలో నలిగిపోతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఏమా కథ?

విశాఖ సిటీలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు!

విశాఖజిల్లా రాజకీయాల్లో మూడు రాజధానుల కుదుపు మొదలైంది. టీడీపీ ఎమ్మెల్యేలు లక్ష్యంగా అధికారపార్టీ దూకుడు పెంచింది. గ్రేటర్ విశాఖలో ప్రతిపక్షం బలంగా వుంది. సిటీలోని నాలుగు కీలకమైన స్ధానాలను టీడీపీ గెలుచుకుంది. ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాస్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన మూడు స్థానాల్లోనూ సీనియర్ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్ కొనసాగుతున్నారు. మొన్నటి వరకూ అధికారపార్టీతో ఢీ అంటే ఢీ అన్న ఎమ్మెల్యేలదీ విచిత్రమైన పరిస్థితిలో పడ్డారు.

మాజీలు వ్యతిరేకిస్తుంటే.. సందిగ్ధంలో సిటింగ్‌లు!

ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూపిస్తూ విశాఖ కార్యనిర్వహక రాజధానిపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. టీడీపీ అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ఆకాంక్షిస్తోంది. ఇందుకోసం పోరాటాలు చేస్తోంది. అధిష్టానం నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత వంటివారు ప్రకటలు చేస్తున్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యేలు మాత్రం నోరు మెదపడం లేదు.  సున్నితమైన రాజధాని వ్యవహారంలోకి దూరితే ఇబ్బంది పడతామేమోనన్న తప్పదేమోనన్న అయోమయంలో ఉన్నారట. 

టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిని వారితోనే బయటపెట్టిస్తారా?

మూడు రాజధానుల ప్రతిపాదన సిఎం జగన్‌ నోటి నుంచి వెలువడిన వెంటనే విశాఖలో కదలికలు మొదలయ్యాయి. ఓ హోటల్లో టీడీపీ కీలక నేతలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ పరిస్ధితిని ఎలా డీల్ చేయాలో నిర్ణయించుకున్నారు. గంటా సహా పార్టీ ముఖ్యులు హాజరైన ఈ సమావేశం విశాఖ కార్యనిర్వహక రాజధానికే మొగ్గు చూపించిందని సమాచారం. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూడు రాజధానులకు ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలగిపోతున్న ప్రస్తుత తరుణంలో టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిని వారితోనే బయటపెట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఎలాంటి స్టాండ్‌ తీసుకుంటారు?

నలుగురు ఎమ్మెల్యేలు తమ విధానం చెప్పాలని...రాజీనామాలు చేసి రెఫరెండానికి రావాలని సవాళ్లు విసురుతోంది వైసీపీ. గంటాశ్రీనివాస్ త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం బలంగా ఉంది. దీంతో ఆయనపై పెద్దగా ఒత్తిడి కనిపించడం లేదు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా ఉంది. రాజధాని వికేంద్రీకరణకు గవర్నర్‌ ఆమోదముద్ర పడగానే టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. వెలగపూడి, గణబాబులు మాత్రం ఈ అంశానికి టచ్‌మీ నాట్‌ అన్నట్లుగా ఉంటున్నారు. అధికార పార్టీ ఉత్తరాంధ్ర సెంటిమెంట్ వేడిని రగిలిస్తే మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిర్ణయం ప్రకటించక తప్పని పరిస్ధితి ఎదురవుతుంది. అందుకే ఈ అంశంపై రెండు పార్టీల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.