గెలవక ముందే హడావుడి చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులు...

గెలవక ముందే హడావుడి చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులు...

బెజవాడ కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీ వైసీపీ నుంచి స్థానిక ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులతో అధికారులకు వింత అనుభవం ఎదురవుతోందట. ఎన్నికలకు సంబంధించి గతంలో నోటిఫికేషన్ ఇవ్వటంతో అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. తర్వాత ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఇప్పడే అసలు చిక్కోచ్చి పడిందట బెజవాడ కార్పొరేషన్ అధికారులకి. 

గెలవకముందే హల్‌ చల్‌ చేస్తున్న అభ్యర్ధులు
బెజవాడ కార్పోరేషన్‌ లో అధికారులకు తిప్పలు


బెజవాడ కార్పొరేషన్ పరిధిలో ఇంకా ఎన్నికలు జరగలేదు. కార్పొరేటర్లుగా ఎవరూ గెలవలేదు. కానీ అధికారులకు మాత్రం కొత్త తిప్పలు మొదలయ్యాయట. ప్రధాన కారణం వైసీపీ నుంచి బరిలోకి దిగిన కార్పొరేటర్ అభ్యర్థులేనట. బెజవాడ కార్పొరేషన్ పరిధిలో మూడు నియోజకవర్గాలు, 64 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి వైసీపీ తరపున పోటీకి దిగిన కార్పొరేటర్ అభ్యర్థులు కార్పొరేషన్ సిబ్బందితోపాటు ఇతర సిబ్బందిపై ఓవర్ యాక్షన్ చేస్తున్నారట. అభ్యర్థులుగా ఉన్న వీరంతా తమను తాము కార్పొరేటర్లుగా భావించి అధికారులకు ఫోన్లు చేసి ఆ పని చేయలేదేంటి, ఈ పని చేయలేదేంటని హడావుడి చేస్తున్నారట.

ప్రధానంగా పారిశుద్ధ్య సిబ్బంది, పారిశుద్ధ్య అధికారులకు ఉదయాన్నే ఫోన్లు చేసి రావాలంటూ హుకుం జారీ చేస్తున్నారట కొందరు అభ్యర్థులు. ఇక మరికొందరు అభ్యర్థులు మరింత అత్యుత్సాహంతో డివిజన్లలో జరుగుతున్న సీసీ రోడ్ల శంకుస్థాపన, అమ్మ ఒడి, ఇళ్ళపట్టాలు మొదలైన ప్రభుత్వ కార్యక్రమాల్లో హడావుడి చేస్తున్నారట. అంతా తామే అన్నట్టు వ్యవహరిస్తూ డివిజన్ స్థాయి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారట. ప్రతిరోజూ డివిజన్లలో పర్యటిస్తూ అధికారులను కూడా తమతోపాటు తిరగాలని ఒత్తిడి చేస్తూ పెత్తనం చేస్తున్నారట అభ్యర్థులు. ఇక అక్రమ నిర్మాణాల విషయంలో కూడా కొందరు అభ్యర్థులు అప్పుడే తలదూరుస్తున్నారట. విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఈ హడావిడి ఎక్కువగా ఉందని సమాచారం.

మరోవైపు కొందరు అభ్యర్ధులు తమను అధికారులు పట్టించుకోవటం లేదంటూ గింజుకుంటున్నారట. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొందరు అభ్యర్థులు అధికారులపై స్థానిక మంత్రికి సైతం ఫిర్యాదు చేశారట. అధికార పార్టీకి చెందిన వారిమైనా మున్సిపల్ సిబ్బంది తామంటే పట్టనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పుకున్నారట. మరోవైపు కొందరు అభ్యర్థులు అప్పుడే ఆయా డివిజన్ల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులపై సైతం పంచాయితీల పేరుతో ఒత్తిడి చేస్తున్నారనే  టాక్ కూడా ఉంది. మొత్తానికి బెజవాడ కార్పొరేషన్ వైసీపీ అభ్యర్థుల హడావిడి ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సొమలింగం అన్నట్టుగా ఉందని బెజవాడ వాసులు చెప్పకుంటున్నారట.