విజయశాంతి ప్రకటన వెనుక అంతర్యం ఏంటి..?

విజయశాంతి ప్రకటన వెనుక అంతర్యం ఏంటి..?

విజయశాంతి ప్రకటన వెనుక అంతర్యం ఏంటి..? తెలంగాణలో కాంగ్రెస్ బలహీన పడింది... బీజేపీ కి బలం చేకూరుతుంది అనేనా..? ఓన్లీ కామెంట్ కె పరిమితం అయ్యారా...లేదంటే భవిష్యత్ రాజకీయాన్ని స్పష్టం చేయదలుచుకున్నారా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  ఫైర్‌బ్రాండ్ పొలిటీషియన్‌ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతల్లో కొందరిని సీఎం కేసీఆర్ ప్రలోభపెట్టి, మరికొందరిని భయపెట్టి టీఆర్ఎస్‌లోకి తీసుకున్నారని, ఎమ్మెల్యేలపై  ఒత్తిడి తెచ్చి పార్టీ మార్పించారని విజయశాంతి ఆరోపించారు. కాంగ్రెస్‌ను బలహీనపరచడం వల్ల ఇప్పుడు తెలంగాణలో బీజేపీ సవాలు విసిరే స్థాయికి వచ్చిందని, ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌కు వర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా వచ్చిన మాణిక్కం ఠాగూర్ మరికొంత ముందుగా రాష్ట్రానికి వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు మెరుగ్గా ఉండేవని రాములమ్మ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితిని కాలము, ప్రజలే నిర్ణయించాలని విజయశాంతి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అయితే విజయశాంతి వ్యాఖ్యలు, ట్వీట్లు కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ లో ఆమె అసంతృప్తితో ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందుకు అనుగుణంగా బీజేపీ నాయకులు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే విజయశాంతి కూడా ఓ నిర్ణయానికి వచ్చేశారా..? అనేలా ఉంది పరిస్థితి. అయితే..కాంగ్రెస్ ఇంఛార్జి ఠాగూర్ కూడా పార్టీ నాయకులు ఎవరూ లేకుండా...ఒంటరిగా విజయశాంతి ఇంటికి వెళ్లి మాట్లాడారు. అప్పటి వరకు ఎలాంటి ఆలోచనలో ఉన్నారో తెలియదు కాని... విజయశాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో బీజేపీ...కాంగ్రేస్ ఇంఛార్జి ఠాగూర్ ప్రస్తావన ఉండటంతో రాములమ్మ ఏ రాజకీయ వేదిక పంచుకోబోతున్నారు అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. 

కేసీఆర్ కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి... ఇంకొందరిని భయపెట్టి... ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు అంటూనే...కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది అంటూ విజయశాంతి పత్రిక ప్రకటన చేశారు. ఇంత వరకు కొంత క్లారిటీగానే ఉన్నా..ఠాగూర్ కొంత ముందుగా రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేది అంటూ కామెంట్ చేశారు. అయితే విజయశాంతి తాను తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నా అని చెప్పదలుచుకున్నారా..? ఆలస్యంగా ఠాగూర్ మంతనాలు చేశారు.. అనుకున్నారో ఏమో కాని... విజయశాంతి ఇక బీజేపీ లో చేరటం ఖాయం అయినట్టు ప్రచారం జరిగింది. ఈ నెలాఖరులో రాములమ్మ రాజకీయ భవిష్యత్ డిసైడ్ చేసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. రాములమ్మ రాజకీయం ఏంటో కానీ...కాంగ్రెస్ లో ఉంటారో...కమలానికి దగ్గరైతారో చూడాలి మరి.