బీజేపీ నుంచి రాజ్యసభకు విజయశాంతి...?

బీజేపీ నుంచి రాజ్యసభకు విజయశాంతి...?

తెలంగాణలో కాంగ్రెస్‌ బలహీన పడింది అన్న రాములమ్మ ప్రకటన వెనక ఆంతర్యం ఏంటి? ఈ కామెంట్‌తో తన భవిష్యత్‌ రాజకీయాన్ని విజయశాంతి స్పష్టం చేయదలుచుకున్నారా? బుజ్జగింపులు వర్కవుట్‌ కాలేదా? కమలంలోనే వికసించాలని భావిస్తున్నారా? 

బీజేపీలోకి ఆహ్వానించిన కిషన్‌రెడ్డి!

కాంగ్రెస్‌ పార్టీలో విజయశాంతి అసంతృప్తితో ఉన్న మాట అందరికీ తెలిసిందే. అవకాశం కోసం  ఆమె ఎదురు చూస్తున్నారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపించే మాట. ఈ విషయం చెవిన పడిందో లేదో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెళ్లి విజయశాంతితో రహస్య మంతనాలు చేశారు. బీజేపీకిలోకి ఆమెను ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. 

బుజ్జగించిన మాణిక్యం ఠాగూర్‌!

2018 ఎన్నికల తర్వాత పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్నారు విజయశాంతి. రాములమ్మతో కిషన్‌రెడ్డి భేటీ రాజకీయంగా ఆసక్తి కలిగించినా.. కాంగ్రెస్‌లో పెద్దగా రియాక్షన్‌ లేదు. కాకపోతే పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్‌ చొరవ తీసుకుని విజయశాంతి ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చారు. తర్వాత ఏమైందో ఏమో కానీ AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ సైతం ఆమె ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంఛార్జ్‌గా ఠాగూర్‌ రాష్ట్రానికి వచ్చిన తర్వాత విజయశాంతి గాంధీభవన్‌కు వెళ్లి మాట్లాడింది లేదు. ఆయన అనేక సమావేశాలు నిర్వహించినా వాటిల్లో వేటికీ హాజరు కాలేదామె. అయినా విజయశాంతి ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చారు ఠాగూర్‌. కాంగ్రెస్‌ను వీడొద్దని బుజ్జగించినట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. 

పార్టీ మార్పుపై ఓ నిర్ణయానికి వచ్చేశారా? 

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జ్‌ ఠాగూర్‌ ఓ మెట్టుదిగి వెళ్లినా.. రాములమ్మ బెట్టు వీడలేదని సమాచారం. ఏ ఉద్దేశంతో అన్నారో ఏమో కానీ.. ఠాగూర్‌ రాక ఆలస్యమైందని ప్రకటించారు విజయశాంతి. దాంతో మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీ మార్పుపై విజయశాంతి ఒక నిర్ణయానికి వచ్చేశారని అనుకుంటున్నారు. ఇందుకు ఆమె చేసిన ప్రకటననే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు నాయకులు. 

ప్రకటనలో చెప్పాల్సింది చెప్పేశారా? 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కొందరిని ప్రలోభపెట్టి.. ఇంకొందరిని భయపెట్టి.. టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని విమర్శించిన విజయశాంతి.. కాంగ్రెస్‌ను బలహీనపర్చడంతో మరో జాతీయపార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చిందన్నారు. ఠాగూర్ ఇంకాస్త ముందుగా రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవని కామెంట్ చేశారు. ఈ ప్రకటనతో తాను తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకున్నా అని  విజయశాంతి చెప్పదలచుకున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

ఈ నెలాఖరులోగా పార్టీ మార్పుపై క్లారిటీ?

ఈ ప్రకటనలు.. పరిణామాలను గమనించిన వారు విజయశాంతి బీజేపీలో చేరటం ఖాయమైందనే  ప్రచారం ఊపందుకుంది. నెలాఖరులోగా ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. ఒకవేళ బీజేపీలో చేరితే.. రాములమ్మను రాజ్యసభకు పంపుతారనే  కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అలాగే తమిళనాడు పాలిటిక్స్‌పై  ఆమె ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. మరి.. రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.