విద్యాబాలన్ తన శరీరాన్ని అంతలా ద్వేషించిందా!?

విద్యాబాలన్ తన శరీరాన్ని అంతలా ద్వేషించిందా!?

ఇంగ్లీష్ లో ‘వెయిట్’ అంటే రెండు అర్థాలు! ఒకటి బరువు. ఇంకొకటి ఎదురుచూడటం. కానీ, కొందరికీ వెయిట్ తగ్గటమనే ఇష్యూ... ఎల్లాప్పుడూ వెయిటింగ్ కి కారణం అవుతుంటుంది. సన్నబడాలని ఎదురు చూస్తూ, చూస్తూ అనేక సంవత్సరాలు గడిచిపోతాయి. మొత్తంగా, లావుగా ఉన్నామని... తమని తామే లవ్ చేసుకోవటం మానేస్తారు... చాలా మంది! విద్యా బాలన్ కూడా వాళ్లలో ఒకరట! ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న అత్యంత విభిన్నమైన నటి ఎవరంటే... విద్యా బాలన్ పేరు చెప్పొచ్చు! ఆమె టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. కానీ, ఆమె రూపం కూడా ప్రత్యేకమే! అంతగా లావుగా బహుశా ఈ తరం బాలీవుడ్ బ్యూటీ మరెవ్వరూ ఉండరనుకుంటా! కానీ, విద్యా తనలా తాను ఉంటూనే బీ-టౌన్ లో సత్తా చాటుతోంది. బలమైన కథ ఉన్న ప్రతీ రచయిత, దర్శకుడు, నిర్మాత ఆమెని గుర్తు చేసుకునే స్థాయికి ఎదిగింది. కానీ, ఇదంతా ఒక్క రోజులో జరగలేదట. ఆమె తన బరువుని అంగీకరించలేక భారమైన మనస్సుతో ఎన్నో సంవత్సరాలు కృంగిపోయిందట! కానీ, ఎట్టకేలకు తనని తాను... తనలానే... అంగీకరించటం, ప్రేమించటం నేర్చుకుందట!


విద్యా బాలన్ కెరీర్ ప్రారంభంలో అనేక అవమానాలు, అపశ్రుతులు ఎదుర్కొంది. ప్రధాన కారణం... ఆమె బరువే. సాధారణంగా హీరోయిన్స్ స్లిమ్ గా, సెక్సీగా ఉంటారు. కానీ, విద్యా కొంచెం లావుగా, హోమ్లీగా ఉండేది. దాంతో ఆమెకు సరైన ఆఫర్లు వచ్చేవి కావు. వచ్చినా చాలా సినిమాలు రిలీజ్ అవ్వకపోవటం లేదంటే ఫ్లాప్ అవ్వటం జరిగేది. ఇలా కెరీర్ ఒడిదుడుకులకు లోను కావటంతో ఆమెది ఐరన్ లెగ్ అనే దాకా వెళ్లింది వ్యవహారం. ఇక అప్పుడు విద్యా తన రూపాన్ని, తన శరీరాన్ని... తానే ద్వేషించే స్థాయికి వచ్చేసిందట. చిన్నప్పట్నుంచీ బొద్దుగా ఉండటంతో ఆమెకు తనపైన తనకే ఏహ్య భావం కలిగిందట. కానీ, చాలా ఏళ్లు మనసుకు సర్ది చెప్పుకుంటూ అంతర్మథనం సాగించిన విద్యా బాలన్ ఇప్పుడు గతంలోని అపరాధ భావం తొలిగించుకోగలిగింది.

ఓ ఇంటర్వ్యూలో ఇదంతా పూసగుచ్చినట్టు చెప్పిన ఆమె అప్పట్లో తన బరువు జాతీయ సమస్యగా మారిందని వ్యాఖ్యానించింది. మీడియాలో, సొషల్ మీడియాలో చర్చలు జరగటంతో తీవ్ర నిరాశకి, నిస్పృహకి లోనైందట. కానీ, తనకున్న శరీరం ఒక్కటే. దాన్ని తాను ప్రేమించుకోవాలి. లేదంటే, అది లేనినాడు తాను కూడా ఉండబోనని విద్యా గ్రహించిందట. ఆ ఆలోచన వచ్చిన తరువాత తన శరీరం ఎలా ఉన్నా అంగీకరించటం అలవాటైందట. ఈ సంగతి నేటి తరం అమ్మాయిలు చాలా మంది గ్రహించాల్సిన విషయం అనటంలో ఎలాంటి సందేహం లేదు...