రివ్యూ: వెంకిమామ 

రివ్యూ: వెంకిమామ 

నటీనటులు: వెంకటేష్, నాగచైతన్య, పాయల్ రాజపుత్, రాశిఖన్నా, ప్రకాష్ రాజ్, రావు రమేష్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర తదితరులు 

మ్యూజిక్: థమన్ 

సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ 

నిర్మాతలు: సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ 

దర్శకత్వం: బాబీ 

వెంకటేష్ హీరోగా ఎన్నో హిట్స్ అందుకున్నాడు.  అలానే నాగ చైతన్య సోలోగా మంచి హిట్స్ వచ్చాయి.  వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి చేసిన సినిమా వెంకీమామ.  గతంలో ప్రేమమ్ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేశారు.  ఆ తరువాత ఇప్పుడు మరలా తన మేనల్లుడు చైతుతో వెంకిమామ చేశారు.   వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ మూవీ ఈరోజు రిలీజ్ చేశారు.  మరి సినిమా ఎలా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం.  

కథ: 

పల్లెటూరిలో ఉండే వెంకటేష్ కు ఆ వూరిలో ఓ గౌవరం ఉంది.  ప్రతి ఒక్కరు ఆయన్ను గౌరవిస్తూ ఉంటారు.  వెంకటేష్ కు మేనల్లుడు నాగ చైతన్య అంటే ప్రాణం.  చైతు తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతే... చైతూని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు.  ఇక వెంకటేష్ తండ్రి నాజర్ కు జాతకాలపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది.  చైతూ జాతకం బాగాలేదని, చైతు వలన వెంకటేష్ కు ఇబ్బందులు వస్తాయని అందుకే వాడి నీడకూడ ఇంటిపై పడటానికి వీలులేదని అని అంటాడు నాజర్.  కానీ, వెంకీ అవేమి పట్టించుకోడు.  అదే సమయంలో అనుకోకుండా నాగచైతన్య తన మామ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆర్మీలో జాయిన్ అవుతాడు.  అలా వెళ్లిన చైతును వెతుక్కుంటూ కాశ్మీర్ వెళ్లిన వెంకటేష్ కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అన్నది కథ.  

విశ్లేషణ: 

మేనమామ, మేనల్లుడి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  వారి మధ్య చాలా వరకు ఫన్ ఉంటుంది.  వయసులో తేడా ఎక్కువగా లేకుంటే ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కూడా పెరగొచ్చు.  ఈ సినిమాలో అలాంటి ప్రేమ, అనుబంధం గురించి చూపించారు.  ప్రేమ, అనుబంధాలకు జాతకం, ఆర్మీ నేపధ్యం మిక్స్ చేయడంతో ఆసక్తి నెలకొన్నది.  సినిమా స్టార్టింగ్ లోనే ఆర్మీకి సంబంధించిన సన్నివేశాలు చూపించి షాక్ ఇచ్చారు.  అక్కడి నుంచి సినిమా పల్లెటూరికి మారిన తరువాత కథలో వేగం పెరిగింది.  వెంకటేష్ తనదైన శైలిలో కామెడీని పండించాడు. అక్కడి నుంచి సినిమాలో వేగం పెరిగింది.  ఇక తన కోసమే వయసును కూడా పట్టించుకోకుండా ఉండిపోయిన వెంకటేష్ కు జోడీని వెదికే విధానం, నాగ చైతన్యతో రాశిఖన్నా ప్రేమను ఫలవంతం చేయడం కోసం వెంకటేష్ పడే తపనను సినిమాలో చక్కగా చూపించారు.  ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా సరదాగా సాగిపోతుంది.  సెకండ్ హాఫ్ లో ఆర్మీ ఎపిసోడ్ కారణంగా ఎమోషన్ గా నడుస్తుంది.  అయితే, సెకండ్ హాఫ్ లో పెద్దగా ట్విస్ట్ లు లేకపోవడంతో సాదాసీదాగా నడిచింది.  

నటీనటుల పనితీరు: 

వెంకటేష్ మామ పాత్రలో అదిరిపోయే విధంగా నటించాడు.  సినిమా మొత్తానికి వెంకీ పాత్రనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  వెంకీ నటనతో ఆకట్టుకున్నాడు.  వెంకటేష్ మామగా మెప్పిస్తే.. అల్లుడు చైతన్య రెండు వేరియేషన్స్ లో మెప్పించారు.  పల్లెటూరిలో సందడి చేసే వ్యక్తిగా, ఆర్మీ మేజర్ గా రెండు పాత్రల్లో మెప్పించారు.  ఈ రెండు పత్రాలు దేనికవే హైలైట్ గా నిలిచాయి.  ఇక రాశిఖన్నా, పాయల్ రాజ్ పుత్ లు వారి పాత్రల మేరకు మెప్పించారు 

సాంకేతిక వర్గం పనితీరు: 

సాంకేతికంగా సినిమాను చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు.  పల్లెటూరి అందాలు, కాశ్మీర్ పచ్చదనం, సర్జికల్ స్ట్రైక్స్ మొదలైన వాటిని తన కెమెరాలో అద్భుతంగా  బంధించాడు ప్రసాద్ మూరెళ్ళ.  థమన్ మ్యూజిక్ మరోసారి ఆకట్టుకుంది.  సినిమా సాంకేతికంగా అద్భుతంగా ఉన్నా, క్లైమాక్స్ ఎపిసోడ్స్ విషయంలో దర్శకుడు బాబీ దృష్టి పెట్టినట్టైతే ఇంకా బాగుండేది.  

పాజిటివ్ పాయింట్స్ :

మామ అల్లుళ్ళు 

కథనం 

ఫస్ట్ హాఫ్, ఎమోషన్స్ 

నెగెటివ్ పాయింట్స్: 

క్లైమాక్స్ 

చివరిగా: వెంకిమామ : మామ అల్లుళ్ళ మాయ