రథాన్ని తగలబెట్టిన వారిని వదిలి పెట్టేది లేదు : దేవాదాయశాఖ మంత్రి

రథాన్ని తగలబెట్టిన వారిని వదిలి పెట్టేది లేదు : దేవాదాయశాఖ మంత్రి

అంతర్వేది రథం కాల్చివేత ఘటనపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. రథాన్ని తగలబెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని వార్ణింగ్ ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. 95 లక్షల రూపాయలతో కొత్త రథాన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ఘటనపై ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారని వెల్లడించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ ఘటనపై మతాలను,కులాలను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ముసుగులో కొంత మంది విద్రోహులు చర్చ్‌పై రాళ్లు రువ్వారని మండిపడ్డారు. చర్చ్, మసీదు, గుళ్లపై దాడులు చేసేవారిని క్షమించబోమని హెచ్చరించారు. పుష్కరాల సందర్భంగా 40 దేవాలయాలను చంద్రబాబు కూల్చివేశారని, ఈ కూల్చివేతలో బీజేపీ జనసేనకు భాగస్వామ్యం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కూల్చివేసిన దేవాలయాలను జగన్ నిర్మించాలని ఆదేశించారని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని జూమ్ యాప్ లో సలహాలిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతర్వేది ఆలయ ఈవోని ఇప్పటికే సస్పెండ్ చేశామన్నారు. పవన్ కల్యాణ్ లాగా ఓట్లు కోసం రాజకీయాలు చేయడం తమకు తెలియదని అన్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తన పిల్లలు క్రిస్టియన్ అన్నారు...ఎన్నికలు తరువాత హిందువులని అంటున్నాడని వ్యాఖ్యానించాడు.