ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్సెస్‌ వంగవీటి రాధా!

ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్సెస్‌ వంగవీటి రాధా!

రాజకీయాల్లో ఎవరు.. ఎప్పుడు.. శత్రువులుగా మారతారో.. మిత్రులవుతారో?  చెప్పలేం. బెజవాడ పాలిటిక్స్‌లో వారిద్దరు కూడా అంతే. ఒకప్పుడు కలిసిమెలిసి తిరిగారు. ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. ఒక నేత అయితే రివెంజ్‌ తీర్చుకునే పనిలో ఉన్నారట. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథ? 

పీఆర్పీ వచ్చాక ఇద్దరి మధ్యా గ్యాప్‌!

వంగవీటి రాధాకృష్ణ.. మాజీ ఎమ్మెల్యే.  మల్లాది విష్ణు.. వైసీపీ ఎమ్మెల్యే.  ఒకప్పుడు సఖ్యంగానే ఉన్న ఇద్దరు 2009 నుంచి బద్ధ శత్రువుగా మారిపోయారు. బెజవాడ రాజకీయాల్లో తమ ముద్ర చాటుకునేందుకు.. ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించేందుకు వేయని ఎత్తులు.. ఎత్తుగడలు లేవనే చెప్పాలి. ఇప్పటికీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రాధాకృష్ణ తండ్రి వంగవీటి రంగా అనుచరుల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఒకరు. రంగా మరణం తర్వాత వైఎస్‌ అనుచరుడిగా రాజకీయాల్లో పాతుకుపోయారు విష్ణు. ఆ సమయంలో రంగా తనయుడు రాధాకృష్ణ, మల్లాది విష్ణు కలిసి సాగేవారు. 2004లో కాంగ్రెస్‌ నుంచి తొలిసారి బెజవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచారు రాధా. అప్పటి వరకు వ్యవహారం బాగానే సాగినా.. ప్రజారాజ్యం రాకతో వీరిద్దరి మధ్యా గ్యాప్‌ వచ్చింది. విభేదాలకు బీజం పడింది. 

2019లో బెజవాడ సెంట్రల్‌ సీటుపై వైసీపీలో పేచీ!

రాధా పీఆర్పీలో చేరినా.. వంగవీటి రంగా మాత్రం ఎప్పటికీ కాంగ్రెస్‌ వాదేనని బందర్‌రోడ్డులోని రంగా విగ్రహానికి కాంగ్రెస్‌ కండువా కప్పే ప్రయత్నం చేశారు విష్ణు. ఆ సమయంలో విష్ణుపై రాధా వర్గీయులు దాడి చేశారు. 2009లో విజయవాడ సెంట్రల్‌లో విష్ణు కాంగ్రెస్‌ నుంచి, రాధా పీఆర్పీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాధా ఓడిపోయారు. ఇంతలో పీఆర్పీ కాంగెస్‌లో విలీనం కావడంతో.. తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చే ప్రయత్నం చేశారు రాధా. అయితే ఆ ప్రయత్నాలను విష్ణు అడ్డుకున్నారని చెబుతారు. తర్వాతి క్రమంలో రాధా వైసీపీలో చేరడం.. విష్ణు కూడా వైసీపీలోనే ఉన్నా పొసిగేది కాదు. 2019 ఎన్నికల్లో సెంట్రల్ సీటు విషయంలో ఇద్దరి మధ్యా తగువు రావడంతో రాధా వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకొన్నారు. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 

2019లో 25 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన విష్ణు!

తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడ్డారనో ఏమో.. 2019 ఎన్నికల్లో విష్ణును ఓడించడానికి రాధా చాలానే కష్టపడ్డారట. దీంతో 25 ఓట్ల మెజారిటీతో అతికష్టం మీద విష్ణు గెలిచారని చెబుతారు. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పరిస్థితి అయింది. ఇప్పుడు బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనూ విష్ణుపై రివెంజ్‌ తీర్చుకోవడానికి ప్లాన్‌ వేశారట రాధా.

సెంట్రల్‌లో 21చోట్ల టీడీపీ, జనసేనే గెలవాలని రాధా చెప్పారా?

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 21 మున్సిపల్‌ డివిజన్లు ఉన్నాయి. ఈ  21 చోట్ల టీడీపీ లేదా జనసేన అభ్యర్థులే గెలవాలని  అక్కడి వారితో రాధా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ బలమున్న చోట జనసేన, జనసేన బలమున్నచోట టీడీపీ కలిసి పనిచేయాలని.. వైసీపీని ఓడించాలని ఆయన స్పష్టం చేశారట. తాను కూడా టీడీపీతోపాటు అవసరమైన చోట జనసేన తరఫున కూడా ప్రచారం చేస్తానని రాధా హామీ ఇచ్చినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. బలంగా ఉన్న అధికార పార్టీని ఢీకొట్టడంలో రాధా వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.