రివ్యూ: వకీల్ సాబ్

రివ్యూ: వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'అజ్ఞాతవాసి' విడుదలై చూస్తుండగానే మూడేళ్ళు గడిచిపోయింది. ఆ తర్వాత ఎన్నికల్లో జనసేన అధినేతగా పవన్ బిజీ అయిపోయాడు. ఒకానొక సమయంలో ఇక సినిమాల్లో నటించేది లేదనీ ప్రకటించాడు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకుని తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. అలా తిరిగొచ్చి చేసిన మొదటి సినిమా 'వకీల్ సాబ్'.  అమితాబ్ బచ్చన్ హిందీ చిత్రం 'పింక్'కు ఇది రీమేక్. అయితే... ఇదే సినిమాను ఇప్పటికే అజిత్ తమిళంలో 'నేర్కొండ పార్వై' పేరుతో రీమేక్ చేశాడు. మరి ఇప్పుడు పవర్ స్టార్ చేసిన ఈ ఎమోషనల్ కోర్ట్ డ్రామా ఎలా ఉందో తెలుసుకుందాం.

పల్లవి (నివేద థామస్), జరీనా (అంజలి), దివ్య (అనన్య) వేర్వేరు నేపథ్యాలకు చెందిన మహిళలు. ఈ వర్కింగ్ ఉమెన్ ముగ్గురూ హైదరాబాద్ లోని ఓ ఫ్లాట్ లో రెంట్ కు ఉంటారు. ఒకరోజు రాత్రి పార్టీకి వెళ్ళి తిరిగి వస్తుంటే... ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంటుంది. దాంతో వారి జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. వ్యవహారం పోలీసు కేసు, అరెస్టుల వరకూ వెళుతుంది. అవతలి వ్యక్తి ఎం.పీ కొడుకు కావడంతో ఇష్యూ కాంప్లికేటెడ్ గా మారుతుంది. అస్సహాయతతో దిక్కుతోచకుండా ఉన్న వీళ్ళకు వకీల్ సాబ్... సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) తోడుగా నిలుస్తాడు. తన వాదనా పటిమాతో ఈ కేసును ఎలా గెలిచాడన్నదే సినిమా కథ.

మన దేశంలో అబ్బాయిలకంటే అమ్మాయిలకే ఆంక్షలు ఎక్కువ. నలుగురిలో ఉన్నప్పుడు ఆడవాళ్ళు మనసు విప్పి మాట్లాడకూడదు. హాయిగా నవ్వకూడదు. వేసుకునే దుస్తులు విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. రాత్రిపూట అయితే ఒంటరిగా వెళ్ళకూడదు. తెలిసిన వ్యక్తిని కూడా తనువుతో టచ్ చేయకూడదు. అలా చేస్తే వేరే వేరే అర్థాలు వచ్చేస్తాయి. వాళ్ళ క్యారెక్టర్ ను ఎసాసినేషన్ చేసేస్తారు. ఈ అంశాలనే 'వకీల్ సాబ్' మూవీలో చూపించారు. మహిళలను, వారి ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా గౌరవించాల్సిందేనని, అందుకు వారి సామాజిక, ఆర్థిక నేపథ్యం ఎంతమాత్రం ప్రధానం కాదని స్పష్టం చేశారు. ఒక మహిళకు తనకు నచ్చని విషయాన్ని నచ్చలేదని గట్టిగా చెప్పే స్వేచ్ఛను గురించి, ఒకవేళ ఎదుటి వ్యక్తి నచ్చని పని చేయమని ఒత్తిడి చేస్తే... దానిని ఏ రకంగానైనా తిరస్కరించవచ్చనే విషయాన్ని నొక్కి చెప్పారు. దాంతో ఇది ప్రతి మహిళా మెచ్చే చిత్రంగా నిలిచింది. లేడీస్, అందులోనూ ప్రధానంగా వర్కింగ్ ఉమెన్ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మధ్య కాలంలో ఇంత చక్కగా చూపించిన సినిమా మరొకటి లేదు. 

ఇక నటీనటుల విషయానికి వస్తే... వకీల్ సాబ్ సత్యదేవ్ పాత్రలో పవన్ కళ్యాణ్‌ పూర్తి గా ఒదిగిపోయాడు. సినిమా ప్రారంభం నుండి చివరి సీన్ వరకూ అదే మూడ్ ను కంటిన్యూ చేశాడు. ఇక ద్వితీయార్థంలోని కోర్టు సీన్స్ లో చెలరేగిపోయాడు. యాంగ్రీ లుక్ తో, డైలాగ్ మాడ్యులేషన్ తో ఆకట్టుకున్నాడు. పవన్ నోట తెలంగాణా యాస వినడానికి కాస్తంత కొత్తగా అనిపించింది. ఇక పవన్ భార్య పాత్రలో శ్రుతీహాసన్ ఎందుకో అంతగా ఆకట్టుకోలేకపోయింది. నిజానికి 'క్రాక్'లో చూసిన శ్రుతికి ఇప్పటి శ్రుతికీ కొంత వ్యత్యాసం కనిపించింది. పాత్ర నిడివి తక్కువ కావడం, ఆమెకు బలమైన సన్నివేశాలను రాయకపోవడం కూడా ఓ కారణం కావచ్చు. మూవీలో కీలక పాత్ర పోషించిన ముగ్గురమ్మాయిలలో ఎక్కువ మార్కులు నివేదా, అంజలికే పడతాయి. వీరిద్దరూ కొన్ని సన్నివేశాలలో కంట తడిపెట్టించారు. అలానే అనన్య నాగళ్ళ కూడా ఉన్నంతలో బాగానే చేసింది. క్రిమినల్ లాయర్ నందగా ప్రకాశ్ రాజ్ మరోసారి నట విశ్వరూపం చూపించాడు. పవన్ కళ్యాణ్, ప్రకాశ్ రాజ్ మధ్య సాగే కోర్ట్ సీన్స్ తో ద్వితీయార్థం మూవీ గ్రాఫ్‌ అమాంతంగా పెరిగిపోయింది. సినిమాటిక్ డైలాగ్స్ తో ఆ డ్రామా మరింత రక్తి కట్టించింది. న్యాయమూర్తిగా కెమెరామేన్, డైరెక్టర్ మీర్, పవన్ కేర్ టేకర్ గా సమ్మెట గాంథీ, ఎంపీగా ముకేశ్‌ రుషి, అతని అనుచరుడుగా దేవ్ గిల్, శుభలేఖ సుధాకర్, షాయాజీ షిండే తదితరులు ఇతర పాత్రలు పోషించారు. 

సాంకేతిక నిపుణులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎస్.ఎస్. తమన్ సంగీతం గురించి. అతను స్వరపరిచిన 'మగువ మగువ...' పాట సినిమాకు ప్రాణంగా నిలిచింది. చాలా సన్నివేశాలకూ అదే ట్యూన్ ను తమన్ ఉపయోగించారు. థియేటర్ నుండి బయటకు వచ్చినా... ఆ పాట హంట్ చేస్తూనే ఉంటుంది. రామజోగయ్య శాస్త్రితో పాటు సుద్దాల అశోక్ తేజ రాసిన 'కదులు కదులు' గీతం కూడా ఉత్తేజ భరితంగా ఉంది. పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ బాగుంది. కోర్ట్ సీన్స్ తో పాటు... మెట్రో ట్రైన్, రెస్ట్ రూమ్స్ లో చిత్రీకరించిన యాక్షన్స్ సీన్స్ అదిరిపోయాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. కానీ ప్రథమార్ధంలో అతని కత్తెరకు ఇంకాస్తంత పనిచెప్పాల్సింది. 

నిజానికి దర్శకుడు వేణు శ్రీరామ్ కు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌ టఫ్‌ టాస్క్ ఇచ్చారు. ఇది 'పింక్' రీమేక్ కాబట్టి దానిలోని ఆత్మను ఒడిసి పెట్టుకుని తెర మీద ప్రెజెంట్ చేయాలి. అదే సమయంలో పవన్ కళ్యాణ్‌ లాంటి స్టార్ హీరో నటిస్తున్నాడు కాబట్టి మాస్ ఆడియెన్స్ మెచ్చే సీన్స్ ఉండాలి. ఇక ఆయనో పొలిటికల్ పార్టీ లీడర్, అతన్ని అభిమానించే లక్షలాది మంది జనం ఉన్నారు కాబట్టి వారినీ మెప్పించే సంభాషణలు ఉండాలి. ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఓ ముప్పేట గొలుసులాగానే వేణు శ్రీరామ్ 'వకీల్ సాబ్'ను తెర కెక్కించాడనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్‌ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన మార్పులు కొంతవరకూ ఓకే గానీ శ్రుతీహాసన్ ఎపిసోడ్ మాత్రం అంతగా అతకలేదు. కథకు ఎలాంటి బలాన్నీ చేకూర్చలేదు. అది కూడా కరెక్ట్ గా ఉండి ఉంటే మూవీ మరో స్థాయిలో ఉండేది. ఏదేమైనా... మహిళలు మెచ్చే ఉమెన్ ఎంపోవర్ మెంట్ గురించి ఇందులో ఉంది. మాస్ మెచ్చే యాక్షన్ సీన్స్ ఉన్నాయి. జనసేన కార్యకర్తలు చప్పట్లు కొట్టేలా సంభాషణలున్నాయి.  ఓవర్ ఆల్ గా ఆల్ సెక్షన్స్ ను ఆకట్టుకునేలా వేణు శ్రీరామ్ అండ్ టీమ్ 'వకీల్ సాబ్'ను తీర్చిదిద్దింది. ఆ కష్టానికి తగిన ప్రతిఫలితం మొదటి ఆట నుండే కలెక్షన్ల రూపంలో కనిపిస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ కు ఇది రైట్ కమ్ బ్యాక్ మూవీ.

రేటింగ్ : 2.75 / 5

ప్లస్ పాయింట్స్ 
ప్రధాన పాత్రధారుల నటన
ఆకట్టుకునే కథాంశం
ఎస్. తమన్ సంగీతం
ఫ్యాన్స్ మెచ్చే సంభాషణలు
మాస్ కు నచ్చే యాక్షన్ సీన్స్

మైనెస్ పాయింట్
పవన్ ఫ్లాష్ బ్యాక్
నిదానంగా సాగే ప్రథమార్ధం

ట్యాగ్ లైన్: ఎమోషనల్ కోర్ట్ డ్రామా!