'లవ్‌ జీహాద్‌' ఆర్డినెన్స్‌ అమల్లోకి..

'లవ్‌ జీహాద్‌' ఆర్డినెన్స్‌ అమల్లోకి..

లవ్ జీహాద్' నిరోధక ఆర్డినెన్స్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. బలవంతపు, నిజాయితీ లేని మత మార్పిడులను నిరోధించే లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆమోదం తెలిపారు. ఉత్తరప్రదేశ్ చట్ట విరుద్ధ మత మార్పిడుల నిషేధ ఆర్డినెన్స్ 2020 పేరుతో... ఈ రాజశాసనం అమల్లోకి వచ్చింది. చట్టవిరుద్ధ మతమార్పిడులు, మతాంతర వివాహాలను నిరోధించడమే ఈ ఆర్డినెన్స్ లక్ష్యం. యువతిని ఒక మతం నుంచి వేరొక మతంలోకి మార్చాలన్న ఏకైక లక్ష్యంతో వివాహం చేసుకుంటే, ఆ పెళ్లి చెల్లదని ఆర్డినెన్స్ చెప్తోంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా మత మార్పిడికి పాల్పడినవారికి గరిష్ఠంగా పదేళ్ళ జైలు శిక్ష విధించవచ్చు. నిర్బంధించి, దురాగతాలు లేదా మోసాల ద్వారా మతం మార్చినట్లు నిర్ధారణ అయితే, అది నాన్ బెయిలబుల్ నేరం అవుతుంది. 

మరోవైపు.. యూపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆర్డినెన్సుపై ప్రతిపక్ష సమాజ్ వాదీ నేత అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేశారు. అసెంబ్లీలో ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తామన్నారు ఆయన. అంతేకాకుండా..ఈ విషయమై ప్రభుత్వానికి చురకలు అంటించారు. 'దీనికి బదులు.. వ్యవసాయోత్పత్తుల సేకరణ కోసం, యువత ఉద్యోగాల కోసం ఆర్డినెన్స్ ఎందుకు తేరు' అని ఆయన ప్రశ్నించారు.  కాగా, ఈ ఆర్డినెన్స్ అమలులోకి రావడంతో పాటు.. యూపీ కేసు కూడా నమోదు చేశారు.